Skip to main content

సివిల్స్‌కు ఎంపిక అవుతాననుకోలేదు... 2011 సివిల్స్ 373వ ర్యాంకర్ డి పార్థసారథి భాస్కర్

మంచి వేతనం, కార్పోరేట్ సదుపాయాలు అన్నీ వదిలి సంవత్సరం నుంచి ప్రిపేర్ అయ్యాను. ర్యాంకు వస్తుందని మాత్రం ఊహించలేదు. సివిల్స్‌కు ఎంపిక కాకపోయి ఉంటే అదే కార్పోరేట్ సంస్థలో చేరేవాణ్ని. నా శ్రమకు అదృష్టం కూడా తోడవడంతోనే సివిల్స్‌కు ఎంపికయ్యానంటున్నారు 2011 సివిల్స్ 373వ ర్యాంకర్ డి పార్థసారథి భాస్కర్...

ప్ర: సివిల్స్‌కు ఎంపిక అయిన విషయం తెలియగానే మీ ఫీలింగ్? ఇది ముందే ఊహించారా?
జ: చాలా సంతోషంగా ఉంది. నేను ఎంపిక అవుతాననుకోలేదు. 373వ ర్యాంకు ఆనందాన్నిచ్చింది. అదృష్టం కూడా తోడవడంతో మొదటి ప్రయత్నంలోనే నా శ్రమ ఫలించింది.

ప్ర: సివిల్స్ రాయాలని ఎప్పుడు అనుకున్నారు? దీనికేమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా ?
జ: 2010 డిసెంబర్ వరకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, ముంబయిలో ఉద్యోగం చేశాను. సివిల్స్ రాయాలని నిర్ణయించుకొని ఉద్యోగం వదిలి హైదారాబాద్ వచ్చాను. సొంతంగా ప్రిపరేషన్ మొదలు పెట్టాను. దీనికి ప్రత్యేక కారణాలేమి లేవు. అమ్మా, నాన్న ఇద్దరూ ఇదే రంగంలో ఉండడం వల్ల నేనూ సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నాను.

ప్ర: ప్రిపరేషన్ ఎప్పుడు మొదలు పెట్టారు? రోజుకు ఎన్ని గంటలు చదివేవారు?
జ: ఉద్యోగం మానేసిన వెంటనే జన వరిలో ప్రిపరేషన్ మొదలు పెట్టాను. ప్రత్యేకంగా ఇన్ని గంటలు అని ఏమీ లేదు. ఆసక్తిని బట్టి రకరకాల సబ్జెక్టులు, అంశాలు, చదివే వాణ్ని. దేన్నీ ఎక్కువ టెన్షన్ తీసుకునే వాణ్ని కాదు. అర్థం కాని టాపిక్‌ను బేసిక్స్ నుంచి ప్రారంభించేవాణ్ని. దీంతో కొద్దిరోజులకు ప్రిపరేషన్ సులభమైంది. దాదాపు అన్ని అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాను.

ప్ర: కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు? ఎవరైనా మార్గదర్శకులు ఉన్నారా?
జ: ప్రిలిమ్స్‌కు కోచింగ్ తీసుకోలేదు. దీంట్లో అర్హత సాధించిన వెంటనే మెయిన్‌‌సకు బ్రెయిన్ ట్రీ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను. అక్కడ గోపాల్ సార్ గెడైన్స్ బాగా ఉపయోగపడింది. ఆయన చెప్పిన పద్దతులన్నీ అనుసరించాను.

ప్ర: సివిల్స్ రాయడం ఇది ఎన్నోసారి? ఇదివరకేమైనా అనుభవం ఉందా?
జ: ఇది మొదటి ప్రయత్నమే. కేవలం సంవత్సరం పాటు చదవడం వల్ల ఈ ర్యాంకు సాధించాను. అన్ని ముఖ్యమైన అంశాల్లో గత ప్రశ్నలు విశ్లేషించి, ప్రశ్నల తీరుపై అవగాహన పెంచుకున్నాను.

ప్ర: మీరు చదివిన ప్రామాణిక పుస్తకాలేంటి? ప్రత్యేకమైన మెటీరియల్ ఏమైనా ఉందా ?
జ: ప్రత్యేకమైన మెటీరియల్ ఏమీ లేదు. బ్రెయిన్ ట్రీ కోచింగ్ సెంటర్ వాళ్లు ఇచ్చిన మెటీరియల్ బాగా చదివాను. అక్కడ చెప్పిన ప్రతి అంశాన్ని ఇంటికి వచ్చిన వెంటనే చదివే వాణ్ని. దాంతో ఎక్కువ విషయాలు గుర్తుంచుకోగలిగాను. కొన్ని ప్రత్యేక అంశాల కోసం మాత్రం ఇతర పుస్తకాలు చదివాను.

ప్ర: మీ ఆప్షనల్స్ ఏంటి ? అవే తీసుకోవడానికి కారణం ?
జ: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంత్రోపాలజీ. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో సార్ గెడైన్స్ వల్ల ఇవి తీసుకున్నాను. ఇన్‌స్టిట్యూట్‌లో బోధించిన పద్ధతి నాకు బాగా నచ్చింది.

ప్ర: ఇంటర్వ్యూలో అడి గిన ప్రశ్నలేంటి ?
జ: 40 నిమిషాలు ఇంటర్వ్యూ చేశారు. ఎక్కువగా నేను చదివిన పుస్తకాల గురించి అడిగారు. తర్వాత భారత్-విదేశీ సంబంధాల గురించి అడిగారు. నా హాబీల్లో ఒకటైన కర్ణాటక సంగీతం గురించి అడిగారు.

ప్ర: మీ విద్యార్హతలు,ఎక్కడ చదివారు ?
జ: నా స్కూలింగ్ మొత్తం హైదరాబాద్‌లోనే. సీబీఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాను. ఢిల్లీ విశ్వ విద్యాలయంలో ఎంబీఎ తర్వాత ముంబయిలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌లో చేరాను.

ప్ర: మీ హాబీలేంటి ?
జ: పుస్తకాలు చదవడం, సంగీతం వినడం. టెన్నిస్ కూడా అడతాను.

ప్ర: మీ కుటుంబ నేపథ్యం, వివరాలు ?
జ: మాది హైదరాబాద్. అమ్మ లక్ష్మీ పార్థసారథి, నాన్న వి.భాస్కర్. ఇద్దరూ ఐఎఎస్‌లే. అమ్మ నెల్లూరు, ఖమ్మం, క్రిష్ణ జిల్లా కలెక్టరుగా చేశారు. చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో పెరగడంతో ప్రజా సమస్యలు, సమాజం గురించి అవగాహన పెంచుకున్నాను. అందుకే సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నాను.

ప్ర మీకు నచ్చిన పుస్తకం ?
జ: నందన్ నిలేఖని రాసిన ‘ఇమాజినింగ్ ఇండియా’ నాకు బాగా నచ్చిన పుస్తకం. నేను చదివిన పుస్తకాల గురించి ఇంటర్య్వూలో ఎక్కువగా అడిగారు.

ప్ర: సివిల్స్‌కు ఎంపిక కాకుంటే ఏం చేసేవారు ? రెండోసారి ప్రయత్నించే వారా ?
జ: ఎంపిక కాకుంటే అదే సంస్థలో చేరేవాణ్ని. రెండోసారి ప్రయత్నం గురించి అప్పుడున్న పరిస్థితులను బట్టి అలోచించేవాణ్ని.

ప్ర: సివిల్స్ రాయాలనుకునే వాళ్లకు మీ సలహా ?
జ: కచ్చితంగా సంవత్సరం ముందు నుంచి పక్కా ప్రణాళికతో చదివితే సివిల్స్ సాధించవచ్చు. ప్రతీది టెన్షన్ తీసుకోకుండా అర్థమయ్యే రీతిలో చదవాలి. పదేపదే చదవడం, నోట్స్ రాసుకోవడం వల్ల చదివింది గుర్తుంటుంది. ఇతర ఏ వ్యాపకాలు లేకుండా మన దృష్టి లక్ష్యం వైపే ఉండాలి. అప్పుడే అనుకున్న గమ్యాన్ని చేరవచ్చు.

Published date : 04 May 2012 08:33PM

Photo Stories