Skip to main content

సీఏ, సీఎస్, సీడబ్ల్యుఏ కోర్సులు పూర్తిచేసిన ఘనత

సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యుఏ.. పరిచయం అక్కర్లేని కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులు.
సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యుఏ.. పరిచయం అక్కర్లేని కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులు. వీటిలో ఉత్తీర్ణత సాధించాలంటే ఏళ్ల తరబడి శ్రమించాలనే భావన. అదే అపోహతో అంతర్గత నైపుణ్యాలు ఉన్నప్పటికీ ఎందరో విద్యార్థులు వీటివైపు కన్నెత్తి కూడా చూడరు. కానీ.. ఈ మూడు కోర్సులను 23 ఏళ్ల వయసులోనే పూర్తిచేసి, అరుదైన ఘనత సాధించి జాతీయ స్థాయిలో శభాష్ అనిపించుకుంటున్నాడు హైదరాబాద్‌కు చెందిన నేమాని శ్రవణ్ కుమార్. 2009లో సీఏ-సీపీటీ ఉత్తీర్ణతతో ప్రారంభించిన కామర్స్ కెరీర్ ప్రస్థానంలో ఎక్కడా వెనుకంజ వేయని ఎన్.శ్రవణ్ కుమార్ సక్సెస్ స్టోరీ...

చిన్నప్పటి నుంచి కామర్స్‌లో కెరీర్ దిశగా ఆసక్తి ఉండేది. నాన్న నేమాని శివశంకర ప్రసాద్ ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్. ఆయనతోపాటు ఆఫీసుకు వెళ్లడం, అక్కడ చార్టర్డ్ అకౌంటెన్సీ విధులను పరిశీలించడంతో ఆ ఆసక్తి మరింత పెరిగింది. దీంతో ఎలాగైనా సీఏ పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాను.

2009లో మొదలైన విజయ ప్రస్థానం
సీఏ లక్ష్యంగా పెట్టుకోవడంతో ఇంటర్మీడియెట్‌లో ఎంఈసీ గ్రూప్ తీసుకుని 94.4 శాతంతో 2009లో ఉత్తీర్ణత సాధించాను. ఆ అర్హతగా 2009 జూన్‌లో సీఏ-సీపీటీలో ఉత్తీర్ణత. అది సీఏ లక్ష్యం దిశగా తొలి విజయం. అక్కడి నుంచి ఏ దశలోనూ వెనుదిరిగి చూడలేదు. సీఏలోని మిగతా రెండు దశలు(ఐపీసీసీ-2010 మేలో, ఫైనల్ 2013 మేలో) తొలి అటెంప్ట్‌లో ఉత్తీర్ణత సాధించి సీఏ లక్ష్యం నెరవేర్చుకున్నాను. ఇదే సమయంలో దూరవిద్య విధానం ద్వారా 2012లో బీకాం సర్టిఫికెట్ కూడా సొంతం చేసుకున్నాను.

ఆ రెండూ చేస్తే మరింత ప్రొఫెషనల్‌గా
సీఏ కోర్సు చదువుతున్న సమయంలోనే నాన్నతోపాటు మరికొందరు చార్టర్డ్ అకౌంటెంట్లను కలిశాను. వారంతా సీఏతోపాటు మిగతా రెండు కోర్సులు(సీఎస్, ఐసీడబ్ల్యుఏ) పూర్తి చేస్తే కెరీర్ మరింత బాగుంటుందన్నారు. మరిన్ని ప్రొఫెషనల్ నైపుణ్యాలు సొంతమవుతాయని సూచించారు. తొలుత 2010 ఐసీడబ్ల్యుఏ ఫౌండేషన్ కోర్సుకు రిజిస్ట్రేషన్ చేసుకుని అదే ఏడాది డిసెంబర్‌లో అందులో ఉత్తీర్ణత సాధించాను. ఆ తర్వాత వరుసగా రెండేళ్లలో 2011లో సీడబ్ల్యుఏ ఇంటర్మీడియెట్, 2012లో ఫైనల్ స్టేజ్‌ల్లో విజయం సాధించాను. సీఎస్ విషయానికొస్తే జూన్ 2013లో ఎగ్జిక్యూటివ్, డిసెంబర్ 2014లో ఫైనల్ పూర్తి చేశాను. ఇలా వరుసగా అయిదేళ్లు ఏడాదికో మెట్టు ఎక్కుతూ కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులు మూడింటినీ పూర్తిచేయడం ఎంతో ఆనందంగా ఉంది.

అడుగులు తడబడకుండా
సీఏ లక్ష్యంగా పెట్టుకున్నప్పటి నుంచి విజయం దిశగా ఎక్కడా అడుగులు తడబడకుండా ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ సాగించాను. ఆర్టికల్‌షిప్ చేస్తున్నప్పుడు రోజూ కనీసం రెండున్నర లేదా మూడు గంటలు చదివే విధంగా; ఎగ్జామ్ లీవ్ సమయంలో రోజుకు పది గంటలు చదివేలా టైం ప్లాన్ రూపొందించుకుని దానికి అనుగుణంగానే ముందుకు సాగాను. ప్రతి అంశంలో నైపుణ్యం పొందేందుకు ప్రాక్టికల్ అప్రోచ్‌కు, అప్లికేషన్ ఓరియెంటేషన్‌కు ప్రాధాన్యమిచ్చాను. అందుకే సింగిల్ అటెంప్ట్ విజయాలు లభించాయి. ఒక్క సీఎస్ ఫైనల్‌లో మాత్రం ఫస్ట్ మాడ్యూల్‌ను రెండోసారి రాయాల్సి వచ్చింది.

అపోహలు వీడాలి
కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులు అంటే క్లిష్టం అనే అపోహ వీడితే వీటిలో విజయం సాధించడం తేలికే. ఇష్టంగా చదివితే క్లిష్టం అనే భావన పోతుంది. అదేవిధంగా చదివే అంశాలను, వాటి మూల భావనలు అన్వయించుకుంటూ ప్రిపరేషన్ సాగిస్తే సిలబస్‌పై మరింత సులభంగా పట్టు సాధించే అవకాశాలు మెరుగవుతాయి. ఇది పరీక్షలో కూడా ఉపయోగపడుతుంది. వాస్తవానికి పరీక్షల్లో 75 శాతం ప్రశ్నలు డెరైక్ట్ అప్రోచ్‌తో ఉంటే.. మిగతా 25 శాతం ప్రశ్నలు అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా ఉంటాయి. అందుకే ఔత్సాహికులు అప్లికేషన్ ఓరియెంటేషన్‌ను అలవర్చుకుంటే పరీక్షలో ఉత్తీర్ణతతోపాటు, భవిష్యత్తులో కెరీర్ పరంగానూ ముందుండేందుకు వీలవుతుంది.

ప్రాక్టీసింగ్, టీచింగ్
మూడు కోర్సులు ఉత్తీర్ణత సాధించినప్పటికీ.. సీఏ ప్రాక్టీసింగ్‌కే నా ప్రాధాన్యం. అదే విధంగా ఈ కోర్సుకు సంబంధించి టీచింగ్ అంటే కూడా ఆసక్తి. ఇప్పటికే సీఏలో ఉండే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంశంపై ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో లెక్చర్స్ ఇస్తున్నాను. భవిష్యత్తులో అకౌంటెన్సీ విభాగానికి అవసరమ్యే ఐటీ సంస్థను నెలకొల్పాలనేది నా లక్ష్యం.

మరో అటెంప్ట్ గురించి ఆలోచించొద్దు
సీఏ, సీఎస్, సీడబ్ల్యుఏ కోర్సు ఔత్సాహికులకు సలహా.. పరీక్ష రాసేటప్పుడు తదుపరి అటెంప్ట్ ఉంది కదా.. ! అనే ఆలోచనను ఎట్టి పరిస్థితుల్లోనూ రానీయకూడదు. "As it There is no Next Attempt' అనే భావనతోనే ప్రిపరేషన్ నుంచి ముందుకు సాగాలి. చదవడాన్ని ఇష్టపడాలి, ప్రేమించాలి, కష్టపడాలి.

ఆసక్తికి ప్రాధాన్యం
మరో ముఖ్యమైన సలహా.. ఆసక్తి ఉంటేనే ఈ కోర్సుల్లో చేరాలి. కెరీర్ డిమాండ్, జాబ్ మార్కెట్ ట్రెండ్స్ కారణంగానే ఈ కోర్సుల్లో అడుగుపెట్టాలనుకోవడం సరికాదు. ఒకవేళ అలాంటి దృక్పథంతోనే ఈ కోర్సుల్లో చేరినా, సబ్జెక్ట్‌లు కష్టంగా ఉన్నాయి అనే భావనను తొలగించుకొని సబ్జెక్ట్‌లను ఇష్టంగా మార్చుకోవాలి.

శ్రవణ్ కుమార్ అకడమిక్ ప్రొఫైల్
  • పదో తరగతి - 2007 (83.5 శాతం)
  • ఇంటర్మీడియెట్ - 2009 (94.4 శాతం)
  • సీఏ ఫైనల్ - మే, 2013
  • సీడబ్ల్యుఏ ఫైనల్ - డిసెంబర్, 2012
  • సీఎస్ ఫైనల్ - డిసెంబర్, 2014
Published date : 16 Mar 2015 01:23PM

Photo Stories