Skip to main content

సీఏ ఫైనల్ టాపర్ల... మనోగతం!

చార్టర్డ్ అకౌంటెన్సీ.. సంక్షిప్తంగా సీఏ! ఇది కష్టమైన కోర్సని భావిస్తూ.. ఎంతోమంది విద్యార్థులు ఈ కోర్సులో చేరేందుకు జంకుతుంటారు. కానీ, ఇష్టంతో చదివితే సీఏలో విజయకేతనం ఎగురేయొచ్చని నిరూపించారు.. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు!! ఇటీవల విడుదలైన సీఏ ఫైనల్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జాతీయస్థాయిలో టాప్-50 ర్యాంకర్ల జాబితాలో చోటు సాధించారు. తాజాగా విడుదలైన సీఏ ఫైనల్ ఫలితాల్లో సక్సెస్ సాధించిన విజేతల మనోగతం మీకోసం...
సేల్స్‌మ్యాన్ కుమార్తె.. సీఏ ఫైనల్‌లో సత్తా
Career Guidance మా స్వస్థలం గుంటూరు. నాన్న బేకరీలో సేల్స్‌మ్యాన్. అమ్మ అరుణ కుమారి గృహిణి. ఇద్దరూ పెద్దగా చదువుకోలేదు. ఆర్థిక సమస్యలు. దాంతో తక్కువ ఖర్చుతో ఉన్నత భవిష్యత్తు లభించే సీఏ కోర్సులో చేరేలా అమ్మానాన్న ప్రోత్సహించారు. ఫలితంగా అక్క వైష్ణవి సీఏ పూర్తి చేసింది. అక్కనే స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా సీఏ కోర్సులో చేరాను. సీఏ లక్ష్యం చేరుకోవడానికి ఇంటర్మీడియెట్ నుంచే అడుగులు ప్రారంభించాను. ఇంటర్మీడియెట్‌లో ఎంఈసీ గ్రూప్ ఎంచుకొని మాస్టర్‌మైండ్స్ సంస్థలో చేరాను. సీఏ తొలిదశ సీపీటీలో 183 మార్కులు రావడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. సీఏ పూర్తి చేయగలననే నమ్మకం కలిగింది. అదే స్ఫూర్తితో మిగతా దశలకు కూడా ప్రిపరేషన్ సాగించాను. ఫలితంగా తాజాగా సీఏ ఫైనల్‌ను కూడా తొలి ప్రయత్నంలో జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకుతో విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. సీఏ చదువుతూనే సీఎంఏ(కాస్ట్ అకౌంటెన్సీ) కోర్సుకు కూడా దరఖాస్తు చేసుకున్నాను. సీఎంఏ ఇంటర్‌లో 40వ ర్యాంకు వచ్చింది. సీఏ కోర్సును ఇష్టంగా చదివితే సులువుగా విజయం సాధించొచ్చు.

గుమాస్తా కొడుకు.. సీఏపై గురి
Career Guidance మా స్వస్థలం తుని. నాన్న వెంకట రమణ ఒక ట్రాన్స్‌పోర్ట్ సంస్థలో గుమాస్తాగా ఉద్యోగం చేస్తున్నారు. అమ్మ సుబ్బలక్ష్మి గృహిణి. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. సీఏ కోర్సు పూర్తి చేస్తే ఉన్నత అవకాశాలు లభించడమే కాకుండా.. సమాజంలో గుర్తింపు లభిస్తుందనే ఆలోచనతోనే ఇందులో చేరాను. ఇంటర్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి సీఏలో గెలుపు దిశగా కృషి చేశాను. ఫలితాల గురించి ఆందోళన చెందకుండా.. సబ్జెక్ట్‌పై పట్టు సాధిస్తే విజయం సొంతమవుతుందనే ఆలోచనతో చదివాను. దీంతో ఎలాంటి ఒత్తిడి ఎదురుకాలేదు. ఫలితంగా సీఏ ఐపీసీసీని తొలి ప్రయత్నంలోనే పూర్తి చేశాను. తాజాగా సీఏ ఫైనల్‌ను కూడా తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 13వ ర్యాంకుతో పూర్తి చేయగలిగాను. సీఏలో విజయం సాధించడానికి హార్డ్ వర్క్ ఎంతో ప్రధానం. దీనికితోడు ప్రిపరేషన్ పరంగా పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరించాలి.

అమ్మ ప్రోత్సాహంతోనే విజయం :
Career Guidance నా విద్యాభ్యాసం అంతా గుంటూరులోనే. నాన్న కోటేశ్వరరావు. అమ్మ మల్లీశ్వరి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉద్యోగిణి. అమ్మ.. నన్ను, అక్కను మంచి చదువులు చదివేలా చిన్నప్పటి నుంచి ప్రోత్సహించింది. సీఏ కోర్సు పూర్తి చేస్తే మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, తొలి ప్రయత్నంలోనే విజయం సాధించే విధంగా కృషి చేస్తే చిన్న వయసులో కెరీర్‌లో స్థిరపడొచ్చని స్నేహితురాలు చెప్పింది. ఇంటర్మీడియెట్ చదువుతూనే సీఏ సీపీటీకి ప్రిపరేషన్ సాగించాను. తొలి ప్రయత్నంలోనే 179 మార్కులతో విజయం సాధించాను. దీంతో సీఏ చదవగలనని పూర్తిస్థాయిలో నమ్మకం కలిగింది. దాన్ని కొనసాగిస్తూనే సీఏ ఐపీసీసీకి కూడా సన్నద్ధమయ్యాను. ఈ దశలోనూ తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించాను. తాజాగా ఫైనల్ కూడా తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 22వ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. సీఏ కోర్సులో విజయానికి ప్రధానంగా లాజికల్ థింకింగ్ అప్రోచ్ ఉండాలి. ఆ దృక్పథం ఉంటేనే పరీక్షలో ఎలాంటి ప్రశ్న ఎదురైనా సమాధానం రాయగలిగే సన్నద్ధత లభిస్తుంది.

అన్నయ్య మాటలే స్ఫూర్తిగా..
Career Guidance మా స్వస్థలం గుంటూరు. నాన్న ఈశ్వర్ రెడ్డి, వృత్తిరీత్యా వ్యాపారి. అమ్మ భారతి గృహిణి. సీఏ పూర్తిచేసిన అన్నయ్య సలహాతో.. పదో తరగతిలోనే సీఏ లక్ష్యంగా నిర్దేశించుకున్నాను. ఇంటర్ పూర్తి కాగానే సీఏ సీపీటీలో ఉత్తీర్ణత సాధించాను. తర్వాత సీఏ-ఐపీసీసీలోనూ 362 మార్కులతో రెండు గ్రూప్‌లలోనూ విజయం సాధించాను. సీఏ ఫైనల్‌లోనూ తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడానికి పకడ్బందీ ప్రణాళికతో చదివాను. ఎప్పటికప్పుడు సబ్జెక్ట్‌లోని అంశాల ప్రిపరేషన్ పూర్తి చేసుకోవడం, రివిజన్‌కు తగినంత సమయం లభించేలా టైమ్ మేనేజ్‌మెంట్ పాటించాను. మాక్ టెస్ట్, రివిజన్ టెస్ట్‌లకు హాజరుకావడం కలిసొచ్చింది. ఫలితంగా తొలి ప్రయత్నంలోనే ఫైనల్‌లో విజయం సొంతమైంది.

పట్టుదలతోనే విజయం :
Career Guidance మా స్వస్థలం భీమవరం. నాన్న పెరుమాళ్ల గుప్తా నగల వ్యాపారం చేస్తున్నారు. అమ్మ మాధవి గృహిణి. పదోతరగతిలోనే సీఏ కోర్సు గురించి స్నేహితురాలి ద్వారా తెలుసుకున్నాను. సీఏ లక్ష్యంగా ఎంచుకున్నప్పటికీ.. ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్‌లో చేరాను. సీఏ సీపీటీలో 157 మార్కులతో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాను. అదే ఉత్సాహంతో సీఏ-ఐపీసీసీ దిశగా అడుగులు వేశాను. అందులోనూ తొలి ప్రయత్నంలోనే గట్టెక్కాను. ఇంకొక్క దశ (సీఏ ఫైనల్) పూర్తి చేస్తే సీఏ లక్ష్యం చేరుకోవచ్చనే నమ్మకంతో ఫైనల్‌కు పకడ్బందీగా ప్రిపరేషన్ సాగించాను. ఫలితంగా తాజాగా విడుదలైన ఫలితాల్లో జాతీయ స్థాయిలో 49వ ర్యాంకు సొంతం చేసుకోగలిగాను. సీఏ కోర్సు విజయం దిశగా.. ప్రిపరేషన్ సమయంలో అకడమిక్ సబ్జెక్ట్‌లపై పట్టుతోపాటు సెల్ఫ్ మోటివేషన్ ఎంతో ప్రధానం. అప్పుడే కోర్సు పట్ల ఇష్టం కలుగుతుంది. నిర్దిష్టంగా ఒక ప్రామాణిక మెటీరియల్‌ను ఎంపిక చేసుకుని దానికి పరిమితమై.. అందులోని అంశాలపై పట్టు సాధిస్తే పరీక్షలో విజయం తథ్యం!!
Published date : 04 Feb 2019 05:29PM

Photo Stories