Skip to main content

మిల్లు అకౌంటెంట్ బిడ్డ... చార్టర్డ్ అకౌంటెంట్

భిన్నంగా ఉజ్వల భవిత ఉండే చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ)గా తనను తాను మలచుకోవాలని తపించాడు. ప్రతిభా పాటవాలకు పదునుపెడుతూ... అవగాహన, విశ్లేషణ సామర్థ్యాలను ఒంట బట్టించుకున్నాడు. ఫలితం... అసలు సిసలైన సీఏ పరీక్షలో జాతీయస్థాయిలో 34వ ర్యాంకర్‌గా నిలిచాడు. 21 ఏళ్ల ప్రాయంలోనే చార్టర్‌‌డ అకౌంటెంట్ పూర్తి చేసిన రామాయణం సాయి సూర్యతేజ విజయ రహస్యం ఆయన మాటల్లోనే.

మాది గుంటూరు జిల్లా నరసారావుపేట. నాన్న శివ నారాయణ. ఓ దాల్ మిల్లులో అకౌంటెంట్. అమ్మ విజయ. పెద్దక్క నాగలక్ష్మీ ప్రసన్న బీటెక్ చదివింది. చిన్నక్క మాధవీలత. రాజస్థాన్‌లో బిట్స్ పిలానీ చేసింది. ప్రస్తుతం బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అన్నయ్య పవన్ జగదీశ్ బీటెక్ ఈసీఈ. సోనీ ఎరిక్‌సన్‌లో ఉద్యోగం వచ్చింది. వీరిని అనుసరించకుండా సీఏతో జీవితంలో బాగా స్థిర పడొచ్చని పదో తరగతిలోనే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాను.

చిన్నక్క సలహా:
ప్రస్తుతం అందరూ మెడిసిన్, ఇంజనీరింగ్ వైపు ఆసక్తి చూపుతున్నారు. అలా కాకుండా భిన్నంగా కెరీర్ ఎంచుకోమని చిన్నక్క మాధవీ లత సూచించింది. సీఏ చేస్తే కెరీర్ బాగుంటుందని సలహా ఇచ్చింది. సీఏసీపీటీ నుంచి సీఏ ఫైనల్ పరీక్షల దాకా ప్రోత్సహించింది. ఇంటర్ ఎంఈసీలో రాష్ట్రస్థాయి రెండో ర్యాంక్ సాధించాను. అదే నాలో సీఏ చేయడానికి ఆత్మవిశ్వాసాన్ని నింపింది.

ఆరు సబ్జెక్టులకు కోచింగ్:
హైదరాబాద్‌లో తుకారాం అండ్ కోలో ఆర్టికల్‌షిప్ చేస్తూ సీఏ ఫైనల్ పరీక్షలకు కేవలం మూడున్నర నెలల పాటు మాత్రమే ప్రిపేరయ్యాను. ఫైనల్ పరీక్షలకు మొత్తం 8 సబ్జెక్టులలో ఇస్కా (ఆరోపేపర్), డెరైక్ట్ టాక్సెస్ (ఏడో పేపర్)లను సొంతంగా ప్రిపేరయ్యాను. మిగతా ఆరింటికి కోచింగ్ తీసుకున్నాను.

కష్టమనిపించిన సబ్జెక్ట్:
ఆడిటింగ్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సబ్జెక్ట్ కష్టమనిపించింది. ఇందులో ఉత్తీర్ణుడవుతానో లేదో అనే భయమేసింది. దీనిపై మరింత అధికంగా దృష్టి సారించాను. నాణ్యమైన స్టడీ మెటీరియల్‌ను చదివాను. చదివే అంశాలను రివిజన్ చేశాను. నోట్స్‌లో పాయింట్లను రాసుకోవడం చేశాను. మిగతా వాటికంటే అధిక సమయం కేటాయించాను. ర్యాంక్ గురించి ఆలోచించకుండా సీఏలో ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో చదివాను. ఖాళీ సమయాన్ని సద్వినియోగపరచుకున్నాను. విశ్లేషణాత్మక ఒరవడితో ప్రతీ పేపర్‌ను రాసి మంచి ర్యాంక్ సాధించాను.

సబ్జెక్టుల వారీ ప్రణాళిక:
గ్రూప్-1లో స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, కార్పోరేట్ అండ్ అలైడ్ లాస్ అడ్వాన్స్‌డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఉంటాయి. గ్రూప్-2లో అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్, డెరెక్ట్ ట్యాక్స్ లాస్, ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్ లాస్,ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్ కంట్రోల్ అండ్ ఆడిట్ ఉంటాయి. రోజూ అన్ని సబ్జెక్టులనూ చదివేలా ప్రణాళిక రచించుకోవాలి. ఆర్టికల్ షిప్ సమయంలో ఒక్కో సబ్జెక్టుకు రోజుకు గంట సమయాన్ని కేటాయిస్తే తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులవడం సులభం. సీఏలో 64.25 శాతం మార్కులు సాధించాను.

మార్పులు గ్రహించాలి:
ఆర్టికల్ షిప్ కాలంలో సబ్జెక్టులను విస్మరించకుండా జాగ్రత్త పడ్డాను. అన్ని సబ్జెక్టులు ఆర్థి క వ్యవస్థకు సంబంధించినవి కాబట్టి ఎప్పటికప్పుడు వ్యవస్థలో చోటు చేసుకుంటున్న కొత్త మార్పులను ఆకళింపు చేసుకోవాలి. ఉదాహరణకు పన్నుల చట్టాలు, కార్మిక చట్టాలు, పరిశ్రమల చట్టాలు... ఇలా పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలు, నూతన ఆర్థిక పోకడలను ప్రభుత్వం అనుసరిస్తుంది. వీటిని అనునిత్యం గమనిస్తూ అదనపు సమాచారాన్ని సేకరించాలి. వాటిని సిలబస్‌కు జో డించి ప్రిపరేషన్ సాగించాలి. లేకపోతే ఫైనల్ పరీక్షలో విజయం సాధించడం చాలా కష్టం. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

సివిల్స్ రాస్తా:
సీఏగా రెండేళ్లు చేస్తా. అనంతరం సివిల్స్ రాస్తాను. ఐఏఎస్ కావాలనుంది. తర్వాత లక్ష్యం అదే.

అకడెమిక్ ప్రొఫైల్:
  • టెన్త్ (2008): 531
  • ఇంటర్ ఎంఈసీ: 966 (2010- రెండో ర్యాంక్)
  • ఐసీడబ్ల్యూఏఐ ఇంటర్: 33వ ర్యాంక్
  • సీఏ: 34వ ర్యాంక్ (జాతీయస్థాయి)
Published date : 26 Sep 2014 03:23PM

Photo Stories