Skip to main content

అమ్మానాన్నల కష్టమే స్ఫూర్తి!.. ఎడ్‌సెట్‌ సోషల్‌ స్టడీస్‌ ఫస్ట్‌ర్యాంకర్‌ విజయేందర్‌ అంతరంగం

‘కూలి దొరికితేకానీ పొట్టనిండని ఇంట్లో పుట్టాను. నా తర్వాత తరానికీ ఇదే కష్టం కొనసాగాలా! అలా జరక్కుండా ఉండాలంటే.. బాగా చదువుకోవాలి. అందుకే కష్టపడుతున్నా’నంటున్నాడు ఎడ్‌సెట్‌-2013 సోషల్‌స్టడీస్‌ విభాగంలో స్టేట్‌ఫస్‌ ్టర్యాంకు సాధించిన ఎం.విజయేందర్‌చారి.
కులవృత్తి కడుపునింపకపోవటంతో నాన్నతోపాటు అమ్మ కూడా కూలీనాలీ చేసి మమ్మల్ని చదివించింది. ఆ కష్టాలు చూసాక వచ్చే తరానికైనా ఈ ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదనే కసితో చదివా. ఫలితంగానే ఫస్ట్‌ర్యాంకు వచ్చింద ంటున్న విజయేందర్‌ చారి విజయ రాహస్యం ఆయన మాటల్లోనే..!!

చదివితే ర్యాంకులు అవే వస్తాయి:
మూడోసారి రాస్తే వచ్చిన ఫస్ట్‌ర్యాంక్‌ చాలా సంతోషాన్నిచ్చింది. టాప్‌టెన్‌లో ఉంటాననుకున్నా. జాగ్రఫీలో స్కోరు రావటంతో 111 మార్కులు వచ్చాయి. కష్టపడి చదివితే ఎవరైనా ర్యాంకులు సాధించవ చ్చు. తెలుగు మీడియంలో సాధారణంగా చదివిన వాణ్నే. ఏదో ఒకటి సాధించాలనే తపనే నడిపిస్తోంది.

మట్టిమోస్తేనే ఇల్లుగడిచేది:
మాది నల్గొండ జిల్లా,  అనుముల గ్రామం. నాన్న రాములు కులవృత్తి. పల్లెల్లో పనిలేకపోవటంతో కూలీగా మారాడు. అమ్మ మంగమ్మ. తానూ ఉపాధిహామీ పథకం కూలీగా పనిచేస్తుంది. ఇద్దరు చెల్లెళ్లు. ఒకామెకు పెళ్లయింది. మరో చెల్లి ఇంటర్‌ చదువుతోంది. ఈ పరిస్థితుల్లో ఇంకా చదువెందుకురా! అని నాన్న చాలాసార్లు అనేవాడు. కానీ నాకేమో ఏదైనా సాధించాలనే తాపత్రయం. మా బతుకులు నాతో అయినా మారితే బావుంటుందనే ఆలోచన. అమ్మ మాత్రం చదువుకో బిడ్డా! అంటూ ధైర్యం చెప్పేది. మొన్న ఎండల్లో ఉపాధిపనులు వెళ్లిన అమ్మకు ఎండదెబ్బ తగిలి జ్వరమొచ్చింది. డాక్టరైతే సీరియస్‌గా ఉంది, కష్టమన్నాడు. అయినా మొండిధైర్యం అమ్మను బతికించింది.

హన్మంతరావు మాస్టారే మార్గదర్శి:
పదోతరగతి జడ్పీహైస్కూల్‌లో చదివా.. 421 మార్కులు వచ్చాయి. ఇంటర్‌ 834, డిగ్రీ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యా. పీజీ ఓయూలో చేశా. పల్లెటూరి నుంచి కాలేజీకు వెళ్లిన నాకు పోటీపరీక్షలకు గురించి చెప్పింది హన్మంతరావు మాస్టారు. ఆయనే నాకు మార్గదర్శి. కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌ అనే మాట ఆయన నోటి నుంచే విన్నా. పీజీ చేసేటపుడు గ్రూప్స్‌కు ప్రిపేరయ్యా. కొద్దిలో అవకాశం తప్పింది. గతేడాది ఎడ్‌సెట్‌ 27వ ర్యాంకు వచ్చినా.. పీజీలో స్కాలర్‌షిప్‌ వస్తుండటంతో చేరలేకపోయా.

‘సాక్షి’ మెటీరియల్‌ సూపర్‌:
రెండేళ్ల క్రితం ఏపీపీఎస్సీ పరీక్షలకు కోచింగ్‌ తీసుకున్నా. అప్పుడు తీసుకున్న మెటీరియల్‌ చదివా. జాగ్రఫీలో 35కు 30 మార్కులు వచ్చాయి. దాంతో మంచి స్కోరైంది. రెండు నెలలపాటు రోజూ నాలుగైదు గంటలు చదివేవాణ్ని. అకాడమీ పుస్తకాలు ర్యాంకు వచ్చేందుకు ఉపకరించాయి. పోటీపరీక్షల సమయంలో సాక్షిలో వచ్చే స్టడీమెటీరియల్‌ సూపర్‌గా ఉపయోగపడింది. ప్రశ్నలు ఏ తరహాలో వస్తాయనేది సాక్షి మెటీరియల్‌ నుంచే నేర్చుకున్నా. జనరల్‌ కొశ్చన్స్‌, ఇంగ్లిషులో రెగ్యులర్‌గా ప్రాక్టీసు చేయటంతో మంచి మార్కులు సాధించగలిగా.

ప్రశ్నలు తయారు చేయగలగాలి:
కాంపిటేటివ్‌ పరీక్షలు అనగానే మార్కెట్‌లో దొరికే బిట్‌బ్యాంకు తెచ్చి బట్టీపడతారు. ఇది సరికాదు. పరీక్షలో ఇచ్చే ప్రశ్నలపై అవగాహన పెరగాలి. ఇంటర్నెట్‌, పత్రికల్లో వచ్చే మెటీరియల్‌, అకాడమీ పుస్తకాలు లోతుగా  చదవాలి. ప్రశ్నలిస్తే జవాబు రాయటం కాదు.. సొంతంగా ప్రశ్నలను రూపొందించగలగాలి. కేవలం కొన్ని పుస్తకాలకే పరిమితం కావటం వల్ల కొత్త ఆలోచనలు రావు. సృజనాత్మకత మనకు దూరమవుతుంది. ఎడ్‌సెట్‌ పోటీలో నిలవాలంటే రెండు మూడు నెలలు రోజుకు 5-6 గంటలు చదవాలి!!
Published date : 21 Jun 2013 02:29PM

Photo Stories