Andhra Pradesh: ‘కోవిడ్’లోనూ కొలువుల జాతర..ఈ రంగాలోనే ఎక్కువ జీతాలు - ఉద్యోగాలు..
కోవిడ్ సంక్షోభంలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉద్యోగాలు కోల్పోగా ఆర్జీయూకేటీ విద్యార్థులకు మాత్రం ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రావడం విశేషం. ప్రభుత్వ విద్యా సంస్థ అయిన ఆర్జీయూకేటీ విద్యార్థుల్లో నైపుణ్యాలు, ఉన్నత ప్రమాణాలు గుర్తించిన ఆయా కంపెనీలు నేరుగా ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తూ విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నాయి.
ఉచిత భోజన వసతులతో పాటు..
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచిత భోజన వసతులు కల్పిస్తూ ఆరేళ్ల సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్సార్ ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆర్జీయూకేటీ పరిధిలో నాలుగు ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. ప్రతి సంస్థలో వేయి మంది చొప్పున నాలుగు వేల మందికి ఇక్కడ సాంకేతిక విద్యను అందిస్తున్నారు. మొదటి రెండేళ్లు ప్రీ యూనివర్సిటీ కోర్సుగా, తదుపరి నాలుగేళ్లు అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సుగా నిర్వహిస్తున్నారు. ఈ నాలుగింటిలో ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలు కొత్తగా ఏర్పడ్డాయి. వీటిలో ఆయా బ్యాచ్‌ల ఆరేళ్ల కోర్సు కాలపరిమితి ఇంకా కొనసాగుతోంది. ముందుగా ఏర్పాటైన నూజివీడు, ఆర్కే వ్యాలీల్లోని విద్యార్థులకు మాత్రం పలు కంపెనీల్లో ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయి. 2014–15 నుంచి 2020–21 వరకు చూస్తే మొత్తం 13,208 మంది విద్యార్థులు నియామకాల కోసం నమోదు చేసుకున్నారు. వీరిలో 5,111 మందికి వివిధ సంస్థల్లో అవకాశాలు దక్కాయి. నూజివీడు క్యాంపస్‌లో 2,610 మందికి, ఆర్కే వ్యాలీలో 2,501 మందికి ఐటీ కంపెనీలు కొలువులు ఇచ్చాయి.
అత్యధిక వార్షిక ప్యాకేజీలు అందించిన కంపెనీలు..
➤ అనలాగ్ డివైజెస్– బెంగళూరు: రూ.20 లక్షలు
➤ ఫ్రెష్ డెస్క్–చెన్నై: రూ.12 లక్షలు
➤ టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్– బెంగళూరు: రూ.10 లక్షలు
➤ సినాప్సిస్– హైదరాబాద్: రూ.9.5 లక్షలు
➤ జేవోటీటీఈఆర్–ఐఈ: రూ.9.0 లక్షలు
➤ థాట్ వర్క్స్– హైదరాబాద్: రూ.7.8 లక్షలు
➤ ఏడీపీ, మేథ్ వర్క్స్, గోల్డెన్ హిల్స్: రూ. 5.0 లక్షల నుంచి రూ. 6.5 లక్షల వరకు
ఇవేకాకుండా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, అలక్రిటీ, ఏడీపీ, అచలా, పర్పుల్ టాక్, పర్పుల్.కామ్, సెలెక్ట్, నూక్కాడ్ షాప్స్, సెవ్యా, అడెప్ట్‌చిప్స్, సినాప్సిస్, టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంటేషన్, రాంకీ, ఆర్వీ, హెటిరో, అటిబిర్, అమర్‌రాజా తదితర కంపెనీల్లో విద్యార్థులకు ఉద్యోగాలు దక్కాయి.
ప్రతికూల పరిస్థితుల్లోనూ గణనీయంగా కొలువులు..
గ్రామీణ విద్యార్థులకు కూడా ఐఐటీల స్థాయిలో మంచి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఆర్జీయూకేటీ ఏర్పాటైంది. త్రిపుల్ ఐటీల్లో ఆరేళ్లు చదివే విద్యార్థులు హైక్వాలిటీ గ్రాడ్యుయేట్లుగా బయటకు రావాలన్న సంకల్పంతో పనిచేస్తోంది. విద్యార్థులు ప్రముఖ కంపెనీల్లో అత్యధిక వేతనాలతో ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దుతోంది. సివిల్ సర్వీసెస్ వంటి ఆలిండియా క్యాడర్ ఉద్యోగాల్లోనూ కొలువుదీరేలా తర్ఫీదు ఇస్తోంది. దీనివల్లే కోవిడ్ సంక్షోభంలోనూ విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉద్యోగాలు పొందగలిగారు. రానున్న కాలంలో మరింతమందికి ప్లేస్‌మెంట్లు దక్కనున్నాయి. నేటి పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు సిలబస్‌లో మార్పులు చేస్తున్నాం.
– ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఏపీ ఉన్నత విద్యామండలి
వీరికే అగ్రపీఠం...
ఆర్జీయూకేటీ విద్యార్థులకు ఆయా కంపెనీలు ఇచ్చిన ఉద్యోగాలను పరిశీలిస్తే.. ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులే అగ్రభాగాన ఉన్నారు. తదుపరి ఈసీఈ, సివిల్, మెకానికల్, కెమికల్ విభాగాల విద్యార్థులున్నారు. 2014–15 నుంచి ఇప్పటివరకు ఉద్యోగాలు దక్కించుకున్నవారిలో 1,921 మంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు. కాగా 1,702 మంది ఈసీఈ విద్యార్థులున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), అమెజాన్, ఐబీఎం, కేప్ జెమిని, ఇన్ఫోసిస్ తదితర ప్రముఖ కంపెనీల్లో వీరికి కొలువులు దక్కాయి.