Skip to main content

Jobs : ఇంటెల్ చరిత్రలోనే తొలిసారిగా.. భారీగా ఉద్యోగులను తొల‌గింపు.. ఎందుకంట‌..?!

ప్రముఖ సెమీ కండక్టర్‌ తయారీ సంస్థ ఇంటెల్‌ ఊహించని నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా పర్సనల్‌ కంప్యూటర్‌ మార్కెట్‌ డిమాండ్‌ తగ్గడంతో ఆ సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది.

బ్లూం బెర్గ్‌ విడుదల చేసిన జులై రిపోర్ట్‌లో ఇంటెల్‌ మొత్తం ఉద్యోగులు 113,700 మంది పనిచేస్తున్నారు. అయితే తాజాగా పీసీ మార్కెట్‌లో నెలకొన్న ఒడిదుడుకుల కారణంగా ఇంటెల్‌ 20శాతం మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపనున్నట్లు, వారిలో సేల్స్‌, మార్కెటింగ్‌ బృంద సభ్యులున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 

వీటి ఉప‌యోగం లేక‌పోవ‌డంతో..
ఉద్యోగుల తొలగింపుపై ఇంటెల్‌ నుంచి ఎలాంటి ప్రకటన రాకున్నా.. జులై నెలలో ఆ సంస్థ ప్రకటించిన సేల్స్‌ గణాంకాలే కారణమని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ దశాబ్ధ కాలంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ దేశాల ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్న ద్రవ్యోల్బణం, దీనికి తోడు కొనుగోలు సామర్ధ్యం తగ్గిపోవడం, స్కూల్స్‌ ఓపెన్‌ కావడం, ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నుంచి కార్యాలయాల నుంచి విధులు నిర్వహించడం వంటి ఇతర కారణాల వల్ల  పీసీల వినియోగం తగ్గిపోయింది.  

కాబట్టే ఉద్యోగుల్ని.. 
సెమీ కండక్టర్ల తయారీ సంస్థలకు కీలకమైన పర్సనల్‌ కంప్యూటర్ల మార్కెట్‌ చైనాలో కోవిడ్‌-19 ఆంక్షలు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం స‌ప్ల‌యి చైన్ స‌మ‌స్య‌లు డిమాండ్‌పై ప్రభావంపై పడింది. అందుకే మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఇంటెల్‌ కార్యకలాపాల్ని కొనసాగించాలని భావిస్తోంది. కాబట్టే ఉద్యోగుల్ని తొలగించడంపై దృష్టిసారించినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి.

Published date : 12 Oct 2022 03:52PM

Photo Stories