Skip to main content

Infosys Employees : ఇన్ఫోసిస్ ఉద్యోగులకు భారీ షాక్‌​.. ఈ రూల్స్ అతిక్రమిస్తే ఇక‌ అంతే.. !

టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులకు భారీ షాక్‌​ ఇచ్చింది. తమ అనుమతి లేకుండా పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకోవడానికి వీల్లేదంటూ అల్టిమేటం జారీ చేసింది.

ఈ మేరకు ఉద్యోగులకు సెప్టెంబరు 12వ తేదీన ఈమెయిల్‌ సమాచారాన్ని పంపింది. ఉద్యోగుల హ్యాండ్‌బుక్, ప్రవర్తనా నియమావళి  ప్రకారం ద్వంద్వ ఉపాధికి అనుమతి లేదని స్పష్టం చేసింది. అంతేకాదు దీన్ని ఉల్లంఘించినవారికి టెర్మినేషన్‌ తప్పదని కూడా హెచ్చరించింది.

రహస్య సమాచారాన్ని..

infosys

వర్క్‌ ఫ్రం హోం విధానంలో మూన్‌లైటింగ్‌ (ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు)లు అనేది అంశంలో పెరుగుదల కనిపించిందని ఇన్ఫోసిస్ పేర్కొంది. తమ అనుమతి లేకుండా ఉద్యోగి ఏదైనా వ్యాపార కార్యకలాపాల్లో పూర్తి సమయం లేదా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇది ఉత్పాదకతపై ప్రభావం చూపడం తోపాటు, ఉద్యోగ పని తీరు, డేటా ప్రమాదం , రహస్య సమాచారం లీకేజీ వంటి తీవ్రమైన సవాళ్లు ఉత్పన్న మవుతాయని తెలిపింది.  

భారత రాజ్యాంగంలోని..
మరో టెక్‌ దిగ్గజం విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ఈ పద్ధతి  మోసం అని వ్యాఖ్యానించిన కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది. అయితే ఉద్యోగులకు ఇన్ఫోసిస్‌తో 9 గంటలు మాత్రమే పని చేయడానికి ఒప్పందం ఉంది. ఉద్యోగులు పనివేళల వెలుపల ఏమి చేస్తారు అనేది వారి ప్రత్యేక హక్కు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి పౌరునికి జీవనోపాధి పొందే హక్కును అందించింది, కాబట్టి ఉద్యోగులకు పంపే ఇటువంటి ఇమెయిల్‌లు చట్టవిరుద్ధం, అనైతికమని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ వాదిస్తోంది.

తక్కువ వేతనం ఇస్తున్నామా..

it jobs

ఉద్యోగులుఎంప్లాయి అగ్రిమెంట్‌, నిబంధనలకు కట్టుబడి ఉంటారని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్, ఆరిన్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు టీవీ మోహన్‌దాస్ పాయ్ ఇటీవల వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, కంపెనీ ఐపీని ఉపయోగించనంతవరకు కోరుకున్నది చేసుకునే హక్కు ఉంటుందన్నారు. అలాగే ఉద్యోగులు ఎందుకు మూన్‌లైట్‌ని కోరుకుంటున్నారో కంపెనీలు తెలుసుకోవాలని, వారికి తక్కువ వేతనం ఇస్తున్నామా అనేది చూసుకోవడం ముఖ్యమన్నారు.

వర్క్‌-ఫ్రమ్-హోమ్ చేసే ఉద్యోగుల్లో..

work from home

మార్కెట్‌ పోటీ, రోజురోజుకు పెరుగుతున్న అట్రిషన్‌తో  ఇబ్బందులు పడుతున్న ఐటీ కంపెనీల్లో మూన్‌లైటింగ్  గుబులు పుట్టిస్తోంది. వర్క్-ఫ్రమ్-హోమ్ చేసే ఉద్యోగుల్లో 65 శాతం మంది పార్ట్‌టైమ్ అవకాశాలలో నిమగ్నమైఉన్నారని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీ సర్వేలో వెల్లడైన సంగతి తెలిసిందే. 

ఫుడ్ అగ్రిగేటర్ స్విగ్గీ ఆగస్టు ప్రారంభంలో ఉద్యోగులకు పార్ట్‌టైం వర్క్‌ చేసుకునే అవకాశాన్ని ప్రకటించడంతో మూన్‌లైటింగ్‌ అనేది  చర్చనీయాంశమైంది. మరోవైపు, ఉద్యోగులు పని చేయకుండా బయట ఏం చేస్తున్నారో చూసేంత శక్తి, సామర్థ్యం మేనేజ్‌మెంట్‌కు ఉందా  అని మార్కెట్‌ నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Published date : 13 Sep 2022 03:18PM

Photo Stories