Inspirational Story: మనలాంటి సాధారణ వ్యక్తే... నేడు లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు.. ఉదయ్‌కొటక్ సక్సెస్ జర్నీ ఇలా..
ఆస్తుల విలువ లక్ష కోట్లు..!
ఫోర్బ్స్ బిలియనీర్-2023 జాబితా ప్రకారం ప్రపంచంలోని మూడో అత్యంత సంపన్న బ్యాంకర్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్. దేశంలో అత్యంత సంపన్న బ్యాంకర్ కూడా ఈయనే. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ఇండెక్స్ ప్రకారం ఉదయ్ ఆస్తుల నికర విలువ 14.8 బిలియన్ డాలర్లు (రూ.1.2 లక్షల కోట్లు).
ఎదిగిన క్రమం ఇలా..!
ఉదయ్ కుటుంబం పత్తి వ్యాపారం చేసేది. ఆయన 1959, మార్చి 15న జన్మించారు. ఉదయ్ కొటక్ ఉన్నత విద్యాభ్యాసం ముంబైలోని సిడెన్‌హామ్ కాలేజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీజీ చేశారు. టాప్ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చినప్పటికీ, తండ్రి ప్రోత్సాహంతో బిజినెస్‌లోకి ప్రవేశించారు. రీజినబుల్ రేట్లలో చిన్న చిన్న రుణాలివ్వడం ప్రారంభించారు.
1985లో ప్రారంభం.!
దేశ ఆర్థికపరిస్థితి క్లిష్టంగా ఉన్న 1985లో ఫైనాన్సింగ్ వ్యాపారాన్ని ఉదయ్ ప్రారంభించారు. ఒకవైపు లోన్లపై అధిక వడ్డీరేట్లు, మరోవైపు డిపాజిట్ రేట్లు తక్కువగా ఉన్న సమయంలో ఉదయ్ కొటక్ ఒక విప్లవానికి నాంది పలికారు. కొద్దికాలంలోనే ఆర్బీఐ నుంచి పూర్తి బ్యాంకింగ్ లైసెన్స్‌ని అందుకున్నాడు. ఆ తరువాత బిల్ డిస్కౌంటింగ్, స్టాక్ బ్రోకింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, కార్ ఫైనాన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ రంగాల్లోకి ప్రవేశించి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. 22 మార్చి 2003న ఆర్బీఐ కోటక్ మహీంద్రా ఫైనాన్స్ లిమిటెడ్ కు బ్యాంకింగ్ లైసెన్స్ ఇచ్చింది.
క్రికెట్ అంటే చాలా ఇష్టం
ఉదయ్‌కొటక్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఒకవేళ బిజినెస్ రంగంలోకి వచ్చిఉండకపోయినట్లయితే క్రికెట్ ప్లేయర్ అయ్యేవాడినని ఆయనే చాలా సందర్భాల్లో చెప్పారు. అలాగే లెక్కల్లో ఉదయ్ దిట్ట. వీరిది ఉమ్మడి కుటుంబం. సుమారుగా 60 మంది ఉండేవారు ఇంట్లో. ఉదయ్ సతీమణి పేరు పల్లవి కోటక్. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దోడు జే కోటక్.. ప్రస్తుతం కోటక్ మహీంద్రా బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా జే కోటక్ ఉన్నారు. చిన్నోడు ధావల్ గతేడాది కొలంబియా బిజినెస్ స్కూల్ నుంచి పట్టా పొందారు. అయితే 2024 చివరికి బ్యాంకు సీఈఓగా ఉదయ్‌కొటక్ తప్పుకోవాలని చూస్తుండడంతో కొత్త సీఈఓ రేసులో పెద్ద కొడుకు ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.