Inspirational Story : ఇంటర్, డిగ్రీలో ఫెయిలైనా.. జీవితంలో పాస్ అయ్యాడిలా..
తనను వేధిస్తున్న సమాజానికి సరైన సమాధానం చెప్పాలన్న కాంక్షతో అడుగు ముందుకేశాడు. తరుముకొచ్చే అవసరం నుంచి.. సృజనాత్మక ఆలోచన పుట్టుకొచ్చింది. అప్పటి వరకూ అసాధ్యమైన పనిని సులభసాధ్యం చేసే.. సరికొత్త ఆలోచనై మెరిసింది. అదే అతన్ని విజయతీరాలకు చేర్చింది. తన ప్రతిభతో ఆకలినీ.. అవనినీ.. అవమానాలనూ జయించాడు. ప్రతి ఓటమి నుంచి పాఠం నేర్చుకుంటూ.. వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగాడు. ఒకప్పుడు కోడిని చంపి.. చికెన్ డెలివరీ చేసిన అతనే.. ఈ రోజు ప్రపంచ వాణిజ్య విభాగంలో తనకంటూ ఓ పేజీని సృష్టించుకున్నాడు. ఆకలి, ఆవేదనలో నుంచి పుట్టికొచ్చిన అక్షరాలను ఆకళింపు చేసుకుని ప్రపంచస్థాయి రచయితగా ఎదిగాడు. పేదరికంతో మొదలైన అతని జీవన ప్రస్థానం.. నేడు పదుగురికి సాయం చేసే స్థాయికి చేరింది. మేధో శ్రమకే అంకితమైన ఒక అసమాన యాత్రికుని ప్రయాణమిది. ఆ యువకుడి పేరే శ్రీధర్ బెవర.
కుటంబ నేపథ్యం :
శ్రీధర్ బెవర పుట్టింది శ్రీకాకుళం జిల్లా రాజాం. కుటుంబాన్ని పేదరికం వెక్కిరించడంతో తల్లి శ్రీధర్‌తో పాటు తన నలుగురు పిల్లలను ఒక్కొక్కరిని ఒక్కో బంధువు ఇంట్లో పెట్టింది. అక్కడైనా తన పిల్లలకు కష్టాలు లేకుండా మూడు పూటలా తిండి దొరుకుతుందనీ.. చక్కగా చదువుకుంటారనీ.! అలా ఒకే గూటి పక్షులను వేర్వేరు ప్రాంతాలకు పంపించేసింది. శ్రీధర్‌ను గుంటూరులో, శ్రీధర్ అక్క శైలజను వాళ్ల పెదనాన్న ఇంట్లో, అన్నయ్య మురళి, తమ్ముడు గిరిధర్‌ను విశాఖలోని బంధువుల ఇంటికి అప్పగించింది. శ్రీధర్ గుంటూరులోని పెద్దమ్మ వాళ్ల అబ్బాయి ఇంట్లో ఆశ్రయం పొందారు. పదో తరగతి వరకు అక్కడే కాలం వెళ్లదీశారు. చివరి పరీక్ష రాసి ఇంటికి వచ్చిన రోజున.. ఇక నుంచి ఇక్కడ ఉండొద్దని బంధువులు ఆయనకు తెగేసి చెప్పేశారు.
కూటి కోసం..
ఏదైనా పనిలో చేరి సమస్యల నుంచి బయటపడాలని భావించాడు శ్రీధర్. విశాఖ డెయిరీలో పాల ప్యాకెట్లు తీసుకుని టీ దుకాణాలకు డెలివరీ బాయ్‌గా ప్రస్థానం ప్రారంభించారు. కష్టపడుతున్నా.. ఆదాయం రాకపోవడంతో చికెన్ దుకాణంలో మాంసం కొట్టేందుకు పనికి కుదిరాడు. కోడిని చంపడం వంటి దృశ్యాలతో చూసిన శ్రీధర్ బెదిరిపోయి జ్వరం బారిన పడ్డారు. కూటి కోసం ఆ పనిలోనే కొనసాగాడు. ఆ సమయంలోనే కొత్త ఆలోచనలకు బీజం పడింది. అపార్ట్‌మెంట్లు, ఇంటింటికీ వెళ్లి ముందు రోజే చికెన్ ఆర్డర్ తీసుకునేవాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆర్డర్లు సరఫరా చేసేవాడు. అక్క శైలజ పేరుతో చిన్నపాటి వ్యాపారం ప్రారంభించాడు. మంచి లాభాలొచ్చినా.. రేయింబవళ్లు పని చేయడంతో శ్రీధర్ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా ఆ వ్యాపారానికి కూడా మధ్యలోనే స్వస్తి చెప్పాడు.
కుంగదీసిన ఘటన ఇదే..
ఇంతలో అన్నయ్య మురళీధర్ క్యాన్సర్ బారిన పడి 2017లో కన్నుమూశాడు. దీంతో అందరూ ఉన్నా ఒంటరిగా మారిపోయిన శ్రీధర్.. ఆ బాధ నుంచి కోలుకుని అన్నయ్య పేరుతో బీఎంఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. పేద పిల్లలకు విద్యాదానం, ప్రజలకు నిత్యావసరాల పంపిణీ, ఇతర సేవాకార్యక్రమాలు చేపడుతున్నాడు.
ఆకలి ముందు చదువు ఫెయిల్..
పదో తరగతి పరీక్షలో మంచి మార్కులతో పాసయ్యారు శ్రీధర్. గుంటూరు నుంచి బయటకు వచ్చిన తర్వాత విశాఖలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌లో చేరారు. ఆకలి కారణంగా చదువులో వెనకబడిపోయాడు. అన్నయ్య మురళి, తమ్ముడు గిరిధర్ కూడా బంధువుల ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ముగ్గురూ కలిసి ఒకే రూమ్‌లో జీవనం ప్రారంభించారు. అన్నయ్య మురళి తండ్రిగా బాధ్యతను భుజానికెత్తుకున్నారు. అప్పటికే అన్నయ్య మురళి పెద్దింటి అమ్మాయి లక్ష్మీ భారతిని ప్రేమించి.. పెళ్లి చేసుకుని రూమ్‌కు తీసుకొచ్చేశారు. ఆ ముగ్గురితో పాటు లక్ష్మీభారతి కూడా అదే చిన్న రూమ్‌లో తలదాచుకుంది. తల్లిలా వారిని లాలించింది. ఆర్థిక సమస్యలు.. ఆకలి బాధలతో చదువుపై దృష్టి సారించలేకపోయారు శ్రీధర్. ఇంటర్‌లో తప్పారు. దీంతో తను కన్న కలలన్నీ కల్లలయ్యాయ్.
డిగ్రీలో ఫెయిల్..
విశాఖలోని తాజ్ హోటల్‌లో వెయిటర్ ఉద్యోగాలు పడటంతో శ్రీధర్ అక్కడ పనికి చేరాడు. బ్యాంకెట్ వెయిటర్‌గా 14 గంటల పాటు నిలబడి పనిచేసేవాడు. ఉదయం 10 నుంచి రాత్రి ఒంటి గంట వరకు పని పూర్తి చేసి.. ఆ సమయంలో వాహనాలు లేక 5 కిలోమీటర్లు నడుచుకుంటూ రూమ్‌కు వెళ్లేవాడు. ఆ సమయంలో పోలీసులు శ్రీధర్‌ను అదుపులోకి తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. క్రమంగా వెయిటర్‌గా మంచి గుర్తింపు వచ్చింది. వైజాగ్‌కు ప్రముఖులు ఎవరొచ్చినా సర్వ్ చేసేందుకు శ్రీధర్‌నే ఎంపిక చేసే వారు. వెయిటర్‌గా చేస్తూనే బీకామ్‌లో చేరాడు. పని ఒత్తిడితో మూడేళ్ల డిగ్రీ పూర్తయ్యే సరికి 15 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు.
కొత్త జీవితం వైపు..
ఎదుగు బొదుగూ లేని జీవితంతో పోరాటం చేస్తున్న శ్రీధర్‌కు అన్నయ్య మురళీ మాటలు కొత్త జీవితం వైపు అడుగులు వేసేలా చేశాయి. అప్పటికే దుబాయ్‌లో స్థిరపడ్డ మురళీ.. శ్రీధర్‌ను డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏ చేయాలని సూచించాడు. ఆయన మాట ప్రకారం వాటిని పూర్తి చేసిన శ్రీధర్ దుబాయ్ వెళ్లిపోయాడు. అంతే.. అక్కడి నుంచి శ్రీధర్ జీవితం పూర్తిగా మారిపోయింది. చిన్న చిన్న కంపెనీల్లో ఉద్యోగం మొదలు పెట్టిన ఆయన.. ఎల్‌జీ, పానాసోనిక్ కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. మళ్లీ ఇండియా వచ్చి ఐఐఎం–అహ్మదాబాద్‌లో అడ్వాన్స్‌డ్ బిజినెస్ కోర్సు చదివి.. 37 ఏళ్లకే జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగాడు. పానాసోనిక్ మిడిల్ ఈస్ట్–ఆఫ్రికా విభాగం ఇన్‌చార్జిగా నియమితులయ్యారు.
తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే..
ఆకలి, ఆవేదన నుంచే అక్షరాలు ధ్వనిస్తాయన్నది అక్షర సత్యమని శ్రీధర్ కవిత్వం వింటే అర్థమవుతుంది. చిన్నతనం నుంచి కవితలు, కథలు రాయడం అలవాటు చేసుకున్న శ్రీధర్.. క్రమంగా మంచి రచయితగా మారారు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా కొన్నేళ్ల కిందట మూమెంట్ ఆఫ్ సిగ్నల్ అనే పుస్తకాన్ని ఇంగ్లిష్‌లో రచించారు. ఇది అమెజాన్‌లో బెస్ట్ సెల్లర్‌గా రికార్డు సృష్టించింది. ప్రపంచంలో ప్రసిద్ధ రచయితలతో పాటు సాహితీ విమర్శకులు.. ఈ పుస్తకానికి ప్రశంసల జల్లు కురిపించారు. నాయకత్వ లక్షణాలపై శ్రీధర్ రాసిన ‘ది రోరింగ్ ల్యాంబ్స్’ వ్యక్తిత్వ వికాస నవల చరిత్ర సృష్టించింది. ఈ–కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ నిర్వహించిన పాపులర్ బుక్స్ ఆఫ్–2021లో శ్రీధర్ ‘ది రోరింగ్ ల్యాంబ్స్’ నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
తొమ్మిది విభాగాల్లో ఐదేసి పుస్తకాల చొప్పున పోటీ నిర్వహించింది. ఇందులో ది రోరింగ్ ల్యాంబ్స్ పుస్తకం బిజినెస్ అండ్ ఎకనమిక్స్ విభాగంలో స్థానం దక్కించుకుంది. ఈ పోటీల్లో అన్ని విభాగాల్లోనూ చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ రచయిత శ్రీధర్ కావడం విశేషం. కొన్నేళ్లుగా బిజినెస్ అండ్ ఎకనమిక్స్ విభాగంలో అమెరికాకు చెందిన రచయితల పుస్తకాలే మొదటిస్థానంలో నిలిచేవి. తొలిసారిగా ఓ భారతీయ రచయిత ఆ రికార్డుని తుడిచిపెట్టేసి నంబర్ వన్‌గా అవతరించారని అమెజాన్ సంస్థ ప్రశంసించింది. అంతే కాదు.. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగానూ శ్రీధర్ తన ప్రస్థానాన్ని సాగిస్తున్నారు. చిన్నప్పటి నుంచి సమస్యలు చుట్టిముట్టినా.. పడిలేచిన కెరటం లా పైకెగిరిన అతని జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిద్దాం.
పారిశ్రామికవేత్తగా..
తాను పనిచేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి పారిశ్రామికవేత్తగా ప్రయాణం ప్రారంభించాడు శ్రీధర్. అన్నయ్య పేరుతో బీఎంఆర్ ఇన్నోవేషన్స్ అనే ఫైనాన్షియల్ కన్సెల్టెన్సీ కార్పొరేట్ సంస్థను ప్రారంభించాడు. రుణం పొందేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు పడే ఇబ్బందుల నుంచి గట్టెక్కించి.. రుణ మంజూరుకు సహాయం చేసేదే ఈ సంస్థ. పలు దేశాలకు ఈ సంస్థ రుణాలు మంజూరు చేసింది. మన కేంద్ర ప్రభుత్వానికి కూడా సహాయం అందించడం విశేషం. ఇటీవలే గోవా ప్రభుత్వం కన్వెన్షన్ సెంటర్ స్థాపించేందుకు రుణ మంజూరు ప్రక్రియ శ్రీధర్ కంపెనీతోనే జరిగింది. దీంతో శ్రీధర్‌ను గోవా ప్రభుత్వం స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్‌కు మెంటర్‌గా నియమించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ ఇండియా సంస్థతో కలిసి దేశానికి వివిధ పనులకు సంబంధించి రుణాల మంజూరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కూడా శ్రీధర్‌తో భేటీ అయ్యింది. ఒకప్పుడు ఆకలి తీర్చుకునేందుకు పని దొరుకుతుందని ఎదురు చూడగా... ఇప్పుడు అనేక దేశాలు శ్రీధర్ బెవర కోసం ఎదురు చూస్తున్నాయి. ఇదీ కదా.. అసలైన విజయమంటే.!