Work: ఇకపై వారంలో 3 రోజులే పని..!
వచ్చే ఏడాది ప్రారంభం నుంచి వారానికి మూడు రోజుల పాటు ఆఫీస్‌లో పనిచేసేలా వర్క్ కల్చర్‌ను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ -ఇండీడ్ సర్వే తెలిపింది. అంతేకాదు ఇప్పటికే పలు కంపెనీలు అమలు చేసిన వారానికి మూడు రోజుల పని విధానాన్ని గుర్తి చేశారు.
ఎప్పుడెప్పుడు ఆఫీస్‌కు వెళ్దామా అని..
కరోనా కారణంగా ఉద్యోగులు ఏడాదిన్నరగా ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో పాటు ఉద్యోగులు సైతం ఆఫీస్‌లకు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో నాస్కామ్-ఇండీడ్ సంస్థలు ‘నాస్కామ్ రిటర్న్ టు వర్క్‌ప్లేస్ సర్వే’ నిర్వహించాయి. ఈ సర్వేలో ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల అభిప్రాయాల్ని సేకరించింది. ఇందులో 25 నుంచి 40 ఏండ్లకు పైనున్న ఉద్యోగులు ఎప్పుడెప్పుడు ఆఫీస్‌కు వెళ్దామా' అని ఎదురు చూస్తున్నట్లు సర్వేలో తేలింది. ఐటీ కంపెనీలు తెచ్చిన ఐబ్రిడ్ వర్క్ కల్చర్ పట్ల ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని నాస్కామ్ తెలిపింది.
‘నాస్కామ్ రిటర్న్ టు వర్క్‌ప్లేస్ సర్వే’ ఇలా..
► నాస్కామ్-ఇండీడ్ సర్వేలో దాదాపు 50 శాతం మంది ఉద్యోగులు వచ్చే ఏడాది జనవరి నుంచి వారానికి 3రోజుల పాటు ఆఫీస్‌లకు వచ్చే అవకాశం ఉంది. యజమానులు, ఉద్యోగులు ఇద్దరూ హైబ్రిడ్ సెటప్‌లో కార్యాలయాలకు తిరిగి రావడానికి ఆసక్తి చూపుతున్నారు.
► ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్ , విప్రో, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలు ఇప్పటికే సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయి ఉద్యోగస్తుల్ని కార్యాలయాలకు రప్పించాయి. ఇతర ఉద్యోగులు సైతం ఆఫీస్‌కు వచ్చేలా ప్రోత్సహిస్తున్నాయి.
► ఉద్యోగులు స్వచ్ఛందంగా ఆఫీస్‌కు వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు.
► 81 శాతానికి పైగా సంస్థలు ఉద్యుగుల్ని ఆఫీస్‌లకు రప్పించే విషయంలో ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తేలింది.
► దాదాపు 72 శాతం సంస్థలు వచ్చే ఏడాది నుంచి గరిష్టంగా 50 శాతం ఉద్యోగుల్ని ఆఫీసుల్లో పనిచేసేందుకు చూస్తున్నాయి.
► 70 శాతంపైగా ఐటీ, ఇతర కంపెనీలు దీర్ఘకాలిక హైబ్రిడ్ వర్క్ కల్చర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు మొగ్గుచూపుతున్నాయని ‘నాస్కామ్ రిటర్న్ టు వర్క్‌ప్లేస్ సర్వే’ లో తేలింది.
ఇప్పటికే కొన్ని కంపెనల్లో వారానికి..
వారానికి ఆరు రోజుల పని, ఓ రోజు సెలవు. సాధారణంగా ఇది అన్ని చోట్లా ఉండేదే. కొన్ని కార్పొరేట్ కంపెనీల్లో ఐదు రోజుల పనిదినాలు ఉన్నాయి. అయితే కొన్ని కంపెనీలు కేవలం మూడు రోజుల పనిదినాల విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నాయి. వారానికి మూడురోజుల పనిచేసినా మార్కెట్‌కు అనుగుణంగా 80శాతం వేతనాల్ని చెల్లిస్తామని ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే బెంగళూరుకు చెందిన ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీ ‘స్లైస్’ ఈ విధానాన్ని అమలు చేసింది. స్లైస్‌లో పనిచేస్తున్న 450 మంది ఉద్యోగులు వారానికి మూడు రోజులే పనిచేస్తున్నారు.
ఈ కల్చర్‌తో...
హైబ్రిడ్ వర్క్ కల్చర్ అంటే 25 శాతం ఉద్యోగులతో ఆఫీసుల్ని.. దశలవారీగా మిగతా వాళ్లతో వర్క్‌ఫ్రమ్ హోంను నిర్వహించడం. ఇప్పటికే టీసీఎస్ ఈ పని విధానాన్ని 2025 నుంచి పూర్తిగా అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్‌జీ సుబ్రమణియం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.