ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు
మంగళవారం జిల్లా లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాగింగ్ చేయడం వల్ల కలిగే అనర్థాలపై జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా జడ్జి సబిత పాల్గొని మాట్లాడారు.
అన్ని వృత్తుల్లో వైద్య వృత్తి చాలా గొప్పదని, అంతటి గొప్ప వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు చట్టాన్ని తెలుసుకొని మసులుకోవడం మూలంగా బంగారు భవిష్యత్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. చట్ట ప్రకారం ర్యాగింగ్ శిక్షార్హమని, సీనియర్స్, జూనియర్స్ పట్ల ర్యాగింగ్‌కు పాల్పడడం చట్టాన్ని అతిక్రమించినట్లే అవుతుందని అన్నారు. ర్యాగింగ్ చేయడమనేది మంచి విద్యార్థి లక్షణం కాదని, దీని వల్ల ఎదుటివారు మానసికంగా చాలా ఇబ్బందులు పడతారని, ఏ విద్యార్థి కూడా ఇలాంటి పనులకు పాల్పడవద్దని సూచించారు.
భిన్న ప్రాంతాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసించడం కోసం ఇక్కడికి వచ్చారని, అందరూ కుటుంబంలా కలిసిమెలిసి ఉండాలని, ఉన్నత స్ధాయికి ఎదగాలన్నారు. అంతకుముందు న్యాయవాదులు ర్యాగింగ్ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సమావేశంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమాదేవి, వైస్ ప్రిన్సిపాల్ సుగుణ, భరత్ కుమార్ రెడ్డి, న్యాయవాదులు మధుసూదన్ రావు, శ్యాం ప్రసాద్ రావు, సత్యనారాయణ, రామచంద్, శ్రీరామ్ ఆర్యన్ కోర్ట్ సిబ్బంది కేశవరెడ్డి, దేవకి కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.