NIT Andhra Pradesh: నిట్‌లో సీట్ల కోత
తాడేపల్లిగూడెం: ఏపీ నిట్‌లో ఈ ఏడాది మొత్తం 270 సీట్లకు కోతపడింది. హోం స్టేట్ కోటాలో ఏకంగా ఏపీ విద్యార్థులు 135 మంది, అదర్ స్టేట్ కోటాలో దేశ వ్యాప్తంగా మరో 135 మంది విద్యార్థులు ఏపీ నిట్‌లో చేరే అవకాశం లేకుండా పోయింది. రెగ్యులర్ డైరెక్టర్ లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది. డైరక్టర్ లేకపోవడం, ఫ్యాకల్టీ కొరత వంటివి సీట్లపై ప్రభావం చూపింది. ఏపీ నిట్‌కు ఇంతకుముందు డైరెక్టర్‌గా వ్యవహరించిన సీఎస్‌పీ రావు పలు ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో సస్పెండయ్యారు. ఆ తర్వాత రెగ్యులర్ డైరెక్టర్ ఇప్పటివరకు లేరు. నిట్ ఫైలుపై చిన్న సంతకం కావాలన్నా ఇన్‌చార్జిగా ఉన్న నాగపూర్ నిట్ డైరెక్టర్ కోసం కూడా నాగపూర్ వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఈ ప్రభావం నిట్ అభివృద్ధిపై నేరుగా పడింది. ఈ విద్యాసంవత్సరంలో నిట్‌లో ఉండే 750 సీట్లలో 270 సీట్లకు కోత పడింది.
అభివృద్ధిలో దూసుకుపోతున్న సమయంలో
ఏపీ నిట్ దూసుకెళ్తున్న తరుణంలో నిట్ డైరక్టర్‌పై అవినీతి ఆరోపణలు రావడం నిట్ ప్రతిష్టపై ప్రభావం చూపింది. సస్పెండైన నిట్ డైరెక్టర్ స్థానంలో నాగపూర్ నిట్ డైరెక్టర్ ప్రమోద్ పడోలేను ఆరు నెలలు ఇన్‌చార్జిగా నియమించారు. ఆ గడువు ముగియడంతో దానిని మరో ఆరు నెలలు పొడిగించారు. ఈలోగా డైరెక్టర్ నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చారు. డైరెక్టర్ నియామక ప్రక్రియ మినహా మిగిలిన తంతు ముగిసింది. ఇది జరుగుతున్న తరుణంలోనే జరిగిన బోర్డు ఆఫ్ గవర్నెన్స్ సమావేశంలో ఫ్యాకల్టీ కొరత కారణంగా ఏపీ నిట్ సీట్లను తగ్గించే ప్రతిపాదన రావడం, ఇన్‌చార్జి డైరెక్టర్ అంగీకరించడంతో విద్యార్థులకు తీరని అన్యాయం జరిగింది.
చదవండి: MBBS Preliminary Merit List: ఎంబీబీఎస్ ప్రాథమిక మెరిట్ జాబితా విడుదల
అభయన్స్‌లో ఎంటెక్
నిట్‌లో ఎంసీఏ ప్రారంభిద్దామని గతంలో నోటిఫికేషన్‌లు ఇచ్చి ప్రక్రియ పూర్తయిన తర్వాత కోర్సు ప్రారంభించకుండానే ఎత్తేశారు. నిట్‌లో ఎంటెక్ ఉంది. దీని కింద 85 సీట్లు ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి ఎంటెక్‌ను అభయన్స్(హోల్డ్)లో ఉంచారు. గతేడాది కేవలం పదిమంది మాత్రమే ఎంటెక్‌లో చేరడం ఒక కారణంగా చూపించి ఎంటెక్‌ను అభయాన్స్‌లో ఉంచారు.
నిట్‌కు మరో 50 ఎకరాలు
ఏపీ నిట్‌కు గతంలో 176 ఎకరాలు కేటాయించారు. అప్పటికే ఈ భూముల్లో ఉన్న విమానాశ్రయ రన్‌వే పోగా 150 ఎకరాలు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ భూముల్లో 110 ఎకరాల్లో కాంక్రీట్ నిర్మాణాలు ఉన్నాయి. ఫ్యాకల్టీ క్వార్టర్లు, అదనపు హాస్టళ్ల నిర్మాణాలు వంటి వాటి కోసం మరో 50 ఎకరాల భూమి అవసరం. ఈ మేరకు ఏపీ నిట్ ద్వారా ప్రతిపాదనలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శికి, ఇతర ఉన్నతాధికారులకు పంపించారు. ఏపీ నిట్‌కు చేరువలో విమానాశ్రయ భూములు అందుబాటులో ఉన్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాల నిమిత్తం ఏపీ నిట్‌కు అదనపు భూములు ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ తదితరులు ఇప్పటికే మూడు సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. భూ కేటాయింపు ప్రక్రియ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొత్తం 270 సీట్లను తగ్గిస్తూ నిర్ణయం రెగ్యులర్ డైరక్టర్ లేకపోవడంతో ఇక్కట్లు సరిపడా ఫ్యాకల్టీ లేకపోవడం మరో కారణం ఫ్యాకల్టీ వస్తే సీట్లు పెరుగుతాయి
ఏపీ నిట్‌లో 130 నుంచి 140 మంది ఫ్యాకల్టీలను శాశ్వత ప్రాతిపదికన నియమించే ప్రక్రియ కొనసాగుతోంది. వీరు వస్తే సీట్లు పూర్వం మాదిరిగానే వచ్చే అవకాశం ఉంది. ఎంటెక్ కోర్సులో చేరడానికి ఆసక్తి చూపే సంఖ్య తగ్గడం వల్లే అభయాన్స్‌లో ఉంచాం. విద్యార్థులు నష్టపోకుండా బోర్డు ఆఫ్ గవర్నెన్సు సమావేశంలో మాట్లాడి నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉంది.
– దినేష్ పి.శంకరరెడ్డి, ఇన్‌చార్జి డైరెక్టర్, ఏపీ నిట్
చదవండి: JEE Mains Free Training: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఫ్యాకల్టీ లేకపోవడమే కారణం
ఏపీ నిట్‌లో ప్రస్తుతం 2,300 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. కేంద్ర ఉన్నత విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం 12 మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ ఉండాలి. కనీసం 15 మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ ఉన్నా నాణ్యమైన విద్యను అందించగలరు. ప్రస్తుతం ఏపీ నిట్‌లో 43 మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు. 120 మంది అడహాక్ ఫ్యాకల్టీ ఉన్నారు. కొత్త ఫ్యాకల్టీలను శాశ్వత ప్రాతిపదికన నియమించకపోవడంతో 150 మంది విద్యార్థులను కూడా ఒకే తరగతిలో ఉంచి విద్యను బోధించే పరిస్థితి వచ్చింది. ఏపీ నిట్ ఏర్పాటు సమయంలో 480 సీట్లు కేటాయించారు. వరంగల్ నిట్‌లో ఉన్న సూపర్ న్యూమరరీ సీట్లు 120 సీట్లను ఏపీ నిట్‌కు ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 150 సీట్లు వచ్చాయి. గత విద్యాసంవత్సరం వరకు ఈ దామాషాలోనే సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగింది. ఈ విద్యాసంవత్సరంలో 270 సీట్లు తగ్గాయి.