Medical PG Admissions: ‘పర్సంటైల్’తో పరిష్కారం కాకుంటే మళ్లీ విచారిస్తాం
- మెడికల్ పీజీ విద్యార్థులకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: మెడికల్ పీజీ సీట్లు పూర్తిస్థాయిలో భర్తీ కాని నేపథ్యంలో కేంద్రం తగ్గించిన పర్సంటైల్‌తో సమస్య పరిష్కారం కాకుంటే ఈ అంశాన్ని మళ్లీ విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా ఏటా మెడికల్ పీజీ సీట్లు వేలాదిగా మిగిలిపోతున్న క్రమంలో కౌన్సెలింగ్‌కు అందరినీ అనుమతించాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. పర్సంటైల్ తగ్గించి కటాఫ్ మార్కులు తగ్గిస్తున్నట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ తరఫు న్యాయవాది గౌరవ్ శర్మ కోర్టుకు తెలిపారు. 15శాతం పర్సంటైల్ తగ్గించామన్నారు. 2020–21లో పర్సంటైల్ 20 శాతం తగ్గించినప్పుడే చాలా సీట్లు మిగిలిపోయాయని, ఇప్పుడు 15 శాతం తగ్గించడం వల్ల కనీసం 5 వేల సీట్లు మిగిలిపోయే అవకాశం ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, రమేశ్ అల్లంకి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్ల తరఫు వాదనతో గౌరవశర్మ ఏకీభవిస్తూ ఏటా నాన్ క్లినికల్ సీట్లు మిగిలిపోతున్నాయని, దీనికి శాశ్వత పరిష్కారం చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘కేంద్రం 15 శాతం పర్సంటైల్ తగ్గించింది. జనరల్ కేటగిరీకి కటాఫ్ పర్సంటైల్ 35, దివ్యాంగుల జనరల్ కేటగిరీకి 30, ఎస్సీ–ఎస్టీలకు 25 శాతం కటాఫ్ పర్సంటైల్‌గా పేర్కొంది. దీంతో పిటిషనర్లు సహా పలువురు లబ్ధి పొందే అవకాశం ఉంది. ప్రస్తుతానికి విచారణ ముగిస్తున్నాం. కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత కూడా పిటిషనర్లు పూర్తిగా లబ్ధి పొందకపోతే వారు మళ్లీ కేసు రీఓపెన్ చేయించుకొనే స్వేచ్ఛను కలి్పస్తున్నాం’అని ధర్మాసనం పేర్కొంది.