Govt Medical College: రూ.166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల..
ఫిబ్రవరి 5వ తేదీ ఆయన ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించి, కళాశాల స్థలం, వసతుల కల్పనను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ వి.పి.గౌతమ్‌తో కలిసి, వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత కళాశాల ప్రభుత్వ ఆస్పత్రికి దగ్గరగా ఉందని, నూతన కలెక్టరేట్ నిర్మాణం పూర్తి కావడంతో పాత కలెక్టరేట్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేశామని చెప్పారు.
రూ.10 కోట్లతో పాత కలెక్టరేట్‌కు రెనోవేషన్ పనులు, వసతుల కల్పన చేపట్టి, మొదటి సంవత్సరం తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండో సంవత్సరంలో మరో 100 మంది విద్యార్థులు రానున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు అనుకూలంగా ఉందా లేదా అనే విషయాన్ని అధికారులు పరిశీలించాలని సూచించారు.
సుమారు రూ.166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలకు వివిధ భవనాలు వస్తాయని, వాటన్నింటికీ అవసరమైన స్థలాలను ఎలా సర్దుబాటు చేయాలో ఆలోచించాలని చెప్పారు. కలెక్టర్, వైద్య కళాశాల అధికారులు ఈ మేరకు చర్చించుకోవాలని సూచించారు.