Medical College: గుట్టలోనే మెడికల్ కాలేజీ
ఇందుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా జీఓ 85ను జారీ చేసింది. దీంతో మెడికల్ కాలేజీని తరలిస్తారని కొంతకాలంగా జరుగుతున్న వదంతులకు తెరపడింది. 2023 జూలై 6 తేదీన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేసింది. మల్లాపురం పరిధిలోని సర్వే నంబర్ 64లో 20 ఎకరాల్లో రూ.183 కోట్ల వ్యయంతో కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే సాంకేతిక కారణాల వల్ల అలస్యం జరిగింది.
ఈ క్రమంలో మెడికల్ కళాశాలను మరో ప్రాంతానికి తరలిస్తున్నట్లు ప్రచారం జరగడంతో గందరగోళానికి దారి తీసింది. అయితే వదంతులకు తెరదించుతూ ప్రభుత్వ కొత్త జీఓ జారీ చేసింది. తాత్కాలికంగా కళాశాల ఏర్పాటుకు భువనగిరి పట్టణంలో పలు ప్రైవేట్ భవనాలను పరిశీలించారు. పగిడిపల్లి పరిధిలోని పాత కలెక్టరేట్ అనుకూలంగా ఉండడంతో అందులోనే హాస్టల్, తరగతులు ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.
చదవండి: Stress Management: స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌పై శిక్షణ
కళాశాలకు అనుబంధంగా జిల్లా కేంద్ర ఆస్పత్రి
పాత కలెక్టరేట్‌లో ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాల ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం కానుంది.ప్రారంభంలో 50 సీట్లతో నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మెడికల్ కళాశాలకు జిల్లా కేంద్ర ఆస్పత్రి అనుబంధంగా కొనసాగనుంది.
డీఎంఈ పరిధిలోకి జిఆస్పత్రి
ఇప్పటి వరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో ఉన్న భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రి.. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలోకి వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి.
జిల్లా కేంద్ర ఆస్పత్రి డీఎంఈ పరిధిలోకి వెళ్లడంతో అందులో పనిచేస్తున్న 28 మంది నర్సులను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టీవీవీపీ పరిధిలోని ఏడు ఆస్పత్రులకు బదిలీ చేశారు. చౌటుప్పల్ సీహెచ్‌సీకి 16, ఆలేరు సీహెచ్‌సీకి 4, హన్మకొండ ఏరియా ఆస్పత్రికి 3, నకిరేకల్ ఆస్పత్రికి 3, కోదాడ, హైదరాబాద్‌లోని మలక్‌పేట, కింగ్ కోటి ఆస్పత్రులకు ఒక్కొక్కరిని బదిలీ అయ్యారు.
అస్పత్రికి అభివృద్ధికి అవకాశాలు
మెడికల్ కళాశాలకు అనుబంధంగా కొనసాగడం వల్ల జిల్లా కేంద్ర ఆస్పత్రి అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. 50 సీట్లతో ప్రారంభం కానున్న కళాశాలకు భవిష్యుత్తులో 200 సీట్లు మంజూరయ్యే అవకాశం ఉంది. 200 సీట్ల కళాశాలకు 500 పడకల ఆస్పత్రి అవసరం ఉంటుంది. కాగా మల్లాపురంలో మెడికల్ కళాశాలకు అనుబంధంగా 100 పడకల ఆస్పత్రి మాత్రమే నిర్మించనున్నారు.
జిల్లా కేంద్ర ఆస్పత్రి తప్పనిసరిగా అనుబంధంగా కొనసాగే అవకాశం ఉండనుంది. ఈ క్రమంలో డీఎంఈ నిబంధనల ప్రకారం జిఆ్ల ఆస్పత్రిలో వసతులు, వైద్య సేవలు పెంచవల్సి ఉంటుంది.
జీఓ నంబర్ 85 జారీ చేసిన ప్రభుత్వం
- తాత్కాలికంగా పాత కలెక్టరేట్‌లో ఏర్పాటు
- 50 సీట్లతో ప్రారంభం
- డీఎంఈ పరిధిలోకి వెళ్లిన జిల్లా కేంద్ర ఆస్పత్రి
- 28 మంది నర్సులు రిలీవ్
పాత కలెక్టరేట్‌లో కళాశాల
యాదగిరిగుట్ట సమీపంలో మెడికల్ కళాశాల భవన సముదాయం పూర్తయ్యే వరకు తాత్కాలికంగా పగిడిపల్లి పరిధిలోని పాత కలెక్టరేట్‌లో ఏర్పాటు చేస్తాం. భవనం అనువుగా ఉండడంతో ఇక్కడే హాస్టల్, తరగతుల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేశాం.
ఈ విద్యా సంవత్సరం నుంచే 50 సీట్లతో కళాశాల ప్రారంభంకానుంది. యాదగిరిగుట్టలో భవన సముదాయం పూర్తయిన తర్వాత అక్కడి కళాశాల తరలిస్తారు.
–చిన్నానాయక్, డీసీహెచ్‌ఎస్