Childrens Education: పిల్లల చదువు కోసం ఎందులో పెట్టుబడులు పెడితే మంచిది?
మార్కెట్లలో అస్థిరతలను ఇన్వెస్టర్లు అధిగమించడం ఎలా?– కిరణ్
అస్థిరతలనేవి ఈక్విటీల సహజ లక్షణం. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోడం ఎలా అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమలు చేయాల్సి ఉంటుంది.
ముందుగా ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించుకోవాలి. అత్యవసర సందర్భాల్లో ఈక్విటీ పెట్టుబడులను కదిలించకుండా ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకంగా అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి.
ఈక్విటీల్లో మీ పెట్టుబడులను కనీసం ఐదు నుంచి ఏడేళ్ల పాటు కదపకూడదు. ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ చర్యలు అవసరం. అలాగే, సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ అస్థిరతల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో కరెక్షన్‌లు మంచి అవకాశాలను తెస్తాయి.
చదవండి: Gaganyaan Mission: గగన్‌యాన్‌లో మహిళా పైలట్లు, శాస్త్రవేత్తలకే ప్రాధాన్యం
ఎందుకంటే ఆ సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను తక్కువ ధరకే సమకూర్చుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ, మీడియాలో వచ్చే గందరగోళ సమాచారం ఇన్వెస్టర్లను నిరాశకు, అయోమయానికి, భయానికి గురి చేస్తుంది. దాంతో వారు ప్రతికూల సమయాల్లో పెట్టుబడులు చేయడానికి వెనుకాడుతుంటారు.
పైగా కొందరు అమ్మకాలు కూడా చేస్తుంటారు. ఇదే అతిపెద్ద తప్పు. ఆ సమయంలో తప్పకుండా సిప్‌ను కొననసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోడానికి వీలుంటుంది.
నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి వయస్సు పదేళ్లలోపే ఉంటుంది. వారి ఉన్నత విద్య కోసం ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుకూల సాధనాలు ఏవి? – విజయశ్రీ
పిల్లల విద్య కోసం ఏక మొత్తంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?.. చాలా మంది తల్లిదండ్రులు సాధారణంగా ఎదుర్కొనే సందేహం ఇది. ప్రాపర్టీ విక్రయం లేదా బోనస్ లేదా తాతలు తమ మనవళ్లు, మనవరాళ్ల కోసం నగదు బహుమతి ఇచ్చినప్పుడు.. ఆ మొత్తాన్ని పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ఈ మొత్తాన్ని పిల్లల ఉన్నత విద్య కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అందుకు, సాధారణంగా పదేళ్ల కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలకు మించి మెరుగైన సాధనం లేదనే చెప్పాలి. ఈక్విటీల్లోనూ ఫ్లెక్సీక్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు పెట్టుబడులను వైవిధ్యం ఉండేలా చూస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన (డైవర్సిఫైడ్) కంపెనీల్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడులు పెడతారు.
ఒకవేళ పన్ను ప్రయోజనం కూడా కోరుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్‌ఎస్‌ఎస్)ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్లెక్సీక్యాప్ మాదిరే పనిచేస్తుంటాయి. అన్ని రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించే విధంగా ఈఎల్‌ఎస్‌ఎస్ పథకాల పనితీరు ఉంటుంది. ఈ పథకాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది. ఈక్విటీల్లో అస్థిరతలు సహజంగా ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోనూ ఇదే కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న ఏక మొత్తాన్ని ఏదైనా డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి.. దాని నుంచి ప్రతి నెలా సిస్టమ్యాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ (ఎన్‌టీపీ) రూపంలో ఈక్విటీ పథకాల్లోకి మళ్లించుకోవాలి. మూడేళ్ల కాలంలో దీన్ని పూర్తి చేయాలి. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది.