Draupadi Murmu: విద్యార్థుల ప్రతిభతోనే.. దేశ గౌరవం ఇనుమడిస్తుంది
విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులదేనన్నారు. డిసెంబర్ 19న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) శతాబ్ది ఉత్సవాల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా పట్టుదలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
విద్యార్థులు జీవన నైపుణ్యాలను నేర్చుకోవడంపైనా దృష్టి సారించాలని సూచించారు. ప్రకృతి, పర్యావరణంపైనా అవగాహన పెంచుకోవాలని, స్వార్థ ప్రయోజనాలు కాకుండా ఇతరులకు సహాయపడే గుణాన్ని అలవర్చుకోవాలని చెప్పారు. జీవితంలో అభిరుచులను స్థిరంగా కొనసాగించడం చాలా అవసరమని, ఇవి సానుకూల శక్తిని పెంపొందించడమే కాకుండా ఇతరులకు ప్రేరణగా పని చేస్తాయన్నారు.
చదవండి: Modern education: ఆధునిక విద్యతో అత్యుత్తమ ఫలితాలు..
దేశానికి గుర్తింపు తెచ్చి పెట్టింది..
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గొప్ప గొప్ప విద్యార్థులను అందించి దేశానికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టిందని ద్రౌపదీ ముర్ము కొనియాడారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల లాంటి అనేకమంది గొప్పవాళ్లను ఈ స్కూల్ అందించిందని గుర్తు చేశారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థ అనేక సవాళ్లను ఎదుర్కొని ఉండొచ్చని, దాని అనుభవాల ఆధారంగా విద్యార్థులను శక్తివంతంగా తీర్చిదిద్దవచ్చన్నారు.
విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులు కలిసి చదువుకోవడానికి, ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడానికి ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించినందుకు హెచ్‌పీఎస్‌ను అభినందించారు. పాఠశాల శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషదాయకంగా ఉందంటూ... ఈ స్కూల్లో చదివిన విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: Inspirational Story: అడవి బిడ్డల నేస్తం... ఫ్లారెన్స్ నైటింగేల్ అవార్డు అందుకున్న తెలంగాణ ఏఎన్ఎం
చదువు, క్రీడలు రెండు కళ్లు: గవర్నర్
విద్యార్థులకు చదువు, క్రీడలు రెండు కళ్లలాంటివని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. విద్యార్థులను తరగతి గదుల నుంచి క్రీడా, సామాజిక రంగానికి తరలించడం అత్యవసరమని అభిప్రాయపడ్డారు. అప్పుడే సమాజంలో ఎలా ప్రవర్తించాలో అలవడుతుందని చెప్పారు.
హెచ్‌పీఎస్ ఆనేక దిగ్గజాలను తయారు చేసిందని, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు రాష్ట్ర, దేశాభివృద్ధికి పాటుపడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బి.వెంకటేశంపాల్గొన్నారు. అంతకుముందు స్కూల్ శతాబ్ది ఉత్సవాలను రాష్ట్రపతి జెండా ఊపి ప్రారంభించారు. వేడుకలు ఏడాది పొడవునా జరగనున్నాయి.