Students: చిట్టి చెల్లెమ్మకు ‘స్వేచ్ఛ’
- 10 లక్షల మందికిపైగా
- విద్యార్థినులకు ఉచితంగా నాణ్యమైన, బ్రాండెండ్ నాప్‌కిన్స్
- బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే లక్ష్యంగా రూ.32 కోట్లతో –పథకం అమలు: సీఎం జగన్
మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 28 రాష్ట్రాల కంటే అగ్రగ్రామిగా ఉందని, ఇది అక్కచెల్లెమ్మల పక్షపాత ప్రభు త్వమని ఏపీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. చరిత్రను మార్చే శక్తి రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఉందని రాష్ట్ర ప్రభుత్వం ధృఢంగా విశ్వసిస్తోందన్నారు. మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల మందికి పైగా విద్యార్థినులకు రూ.32 కోట్లతో నాణ్యమైన బ్రాండెడ్ శానిటరీ నాప్‌కిన్లు ఉచితంగా పంపిణీ చేసే ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని సీఎం మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించి పోస్టర్ విడుదల చేశారు. రుతుక్రమం ఇబ్బందులతో బాలికలు స్కూలుకు దూరమవుతున్న పరిస్థితులు నెలకొన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయని, వారికి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ‘స్వేచ్ఛ’ ద్వారా చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా గ్రామీణ మహిళలకు వైఎస్సార్ చేయూత స్టోర్స్ ద్వారా తక్కువ ధరకే నాప్‌కిన్స్ సరఫరా చేసేందుకు పీ అండ్ జీ (విస్పర్), నైన్ బ్రాండ్‌ల ప్రతినిధులు సీఎం జగన్ సమక్షంలో సెర్ప్ సీఈవో ఇంతియాజ్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నారు.