టెన్త్ పేపర్ లీకేజీ అబద్ధం.. విద్యార్థులు ఆందోళన చెందవద్దు; Education Minister
- కుట్రలో ప్రధాన పాత్ర నారాయణదే
- పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు చేస్తే సహించం
- ఎల్లో మీడియాది దుష్ప్రచారం
- విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పేపర్ లీకేజీ జరగలేదని.. వదంతులను నమ్మొద్దని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కోరారు. ఎల్లో మీడియా, టీడీపీ దురుద్దేశంతో పదో తరగతి పరీక్షలపై విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు మంత్రి బొత్స గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో తెలుగు కాంపోజిట్ ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్‌లో షేర్ చేసిన నారాయణ విద్యా సంస్థల సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. అలాగే గురువారం శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలిలో హిందీ పేపర్ లీకైనట్టు వచ్చిన వార్తల్లో అసలు వాస్తవమే లేదన్నారు. దీనిపై ఎల్లో మీడియాలో వార్త ప్రసారమైన వెంటనే విద్యాశాఖ అధికారులు, పోలీసులు స్థానికంగా విచారణ చేశారన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి లీకేజీ జరగలేదని తేలిందన్నారు. ఎల్లో మీడియా ప్రతినిధి సైతం ఆ వార్తను తాను పంపలేదని చెప్పాడన్నారు. స్థానిక విలేకరి ఇవ్వకుండా హైదరాబాద్‌కు ఆ వార్త ఎలా వెళ్లిందని మంత్రి ప్రశ్నించారు. సదరు చానెల్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించేందుకు దుష్ప్రచారం చేస్తోందన్నారు. టీడీపీ, నారాయణ పేపర్ లీకేజీకి ఎన్ని ఎత్తులు వేసినా వాటిని భగ్నం చేస్తామన్నారు. ఆన్సర్ బుక్‌లెట్లు బయట దుకాణాల్లో లభిస్తున్నాయన్న వార్తల్లోనూ వాస్తవం లేదని స్పష్టం చేశారు. గత రెండు రోజులు జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఎక్కడా పేపర్ లీకేజీ, కాపీయింగ్ జరగలేదని కుండబద్దలు కొట్టారు.
Also read: 10th Class: ‘అంతర్గత’ మార్కులు ఇష్టారాజ్యం!
విద్యార్థుల భవిష్యత్‌తో రాజకీయాలు వద్దు
పదో తరగతి పరీక్షలను రాష్ట్రంలో 6.21 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారని.. వారి భవిష్యత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా ప్రవర్తిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి బొత్స హెచ్చరించారు. నారాయణ, ఎన్‌ఆర్‌ఐ స్కూళ్లు ఎవరికి మేలు చేసేందుకు ఇంతటి దుష్ప్రచారానికి ఒడిగట్టాయో, ఇది ఎవరికి లాభమో తెలుస్తోందన్నారు. విద్యార్థుల భవిష్యత్‌తో రాజకీయాలు చేయొద్దని చంద్రబాబు, లోకేష్‌లకు హితవు చెప్పారు. ఈ సమావేశంలో పరీక్షల కమిషనర్ సుధాకర్ పాల్గొన్నారు. కాగా గురువారం కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల ప్రాథమికోన్నత పాఠశాలలో పైకప్పు పెచ్చులు పడి విద్యార్థి గాయపడిన ఘటనపై మంత్రి స్పందిస్తూ.. గత ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలకు గొడుగుపట్టి ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేసిందన్నారు. ఇప్పుడు తాము నాడు–నేడుతో పాఠశాల భవనాలను బాగు చేస్తున్నామన్నారు. అలాగే 9వ తరగతి విద్యార్థితో పనులు చేయించిన స్కూల్ సిబ్బందిపై చర్యలు తీసుకున్నామని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.