పరీక్షలను బహిష్కరించిన విద్యార్థినులు
Sakshi Education
కర్ణాటకలో హిజాబ్ వివాదంపై పలుచోట్ల విద్యార్థులకు తల్లిదండ్రులకు, పాఠశాలల సిబ్బంది మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. శివమొగ్గ, చిక్కమగళూరు, ఉడుపి, తుమకూరు, కొడగు తదితర ప్రాంతాల్లో ఫిబ్రవరి 15న విద్యార్థినులు నిరసనకు దిగారు. హైకోర్టు మధ్యంతర ఆదేశాల మేరకు మత చిహ్నాలతో విద్యాలయాల్లోకి రాకూడదని ఉపాధ్యాయులు, పోలీసులు చెప్పడంతో తమకు సంప్రదాయమే ముఖ్యమని కొందరు విద్యార్థినులు తరగతులను, ప్రిపరేటరీ పరీక్షలను బహిష్కరించారు.
- ఉడుపి జిల్లా కాపు మల్లారు ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో హిజాబ్ తొలగించి తరగతిలోకి ప్రవేశించేందుకు విద్యార్థినులు అంగీకరించలేదు. చివరికి హిజాబ్ ధరించి పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలను విద్యార్థినులు రాశారు. శివమొగ్గ నగరంలోని కేపీఎస్ ఉన్నత పాఠశాలలో హిజాబ్ తీసేయడం ఇష్టం లేదని తరగతులను బహిష్కరించి ఇద్దరు విద్యార్థినులు ఇళ్లకు వెళ్లిపోయారు.
- చిక్కమగళూరు మౌలానా ఆజాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 11 మంది విద్యార్థినులు పాఠశాలలో బైఠాయించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య వాగ్వాదం చెలరేగింది. పాఠశాలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. గదగ్ జిల్లాలోనూ ఒక పాఠశాలలోనూ కొందరు బాలికలు నిరసన తెలిపారు.
- దావణగెరె జిల్లా హోన్నాళిలో 50, చెన్నగిరలో 30, నల్లూరిలో 20, హరిహరలో 23 మంది విద్యార్థినులు హిజాబ్ తీసేందుకు నిరాకరించి, తమకు మత సంప్రదాయమే ముఖ్యమని తరగతులను బహిష్కరించి ఇళ్లకు వెళ్లిపోయారు.
- తుమకూరు ఎస్‌వీఎస్ స్కూల్ ముందు విద్యార్థినుల తల్లిదండ్రులు ‘అల్లా హు అక్బర్’ అంటూ నినాదాలు చేశారు. జగత్‌లోని ఉర్దూ పాఠశాలకు 80 మందికి పైగా విద్యార్థినులు గైర్హాజరయ్యారు.
- రాయచూరులో చదువుతో పాటు తమకు హిజాబ్ కూడా ముఖ్యమని, హిజాబ్ ధరించేందుకు అవకాశం కల్పించాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో గొడవకు దిగారు.
హైకోర్టు ఉత్తర్వులు అమలు చేస్తాం..
హిజాబ్ వ్యవహారంపై హైకోర్టు ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వును కచ్చితంగా అమలు చేస్తామని కర్ణాటక న్యాయ శాఖ మంత్రి జె.సి.మధుస్వామి ప్రకటించారు. రాష్ట్ర శాసనసభలో ఫిబ్రవరి 15న హిజాబ్ అంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు యు.టి.ఖాదర్ లేవనెత్తారు. హైకోర్టు ఉత్తర్వును పాటించే విషయంలో క్షేత్రస్థాయిలో స్పష్టత లేకుండా పోయిందని అన్నారు.
చదవండి:
Tenth Class: అర్థమైనా కాకున్నా పాఠాలు.. సిలబస్ పూర్తి చేయడమే లక్ష్యం
NEET 2021: బీహెచ్ఎంఎస్ సీట్లకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..
Published date : 16 Feb 2022 06:25PM