Prateek Jain, IAS: ఏజెన్సీ విద్యార్థులు సత్తా చాటాలి
గుండాల మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల ఆవరణలో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ ఏడో జోనల్‌స్థాయి క్రీడా పోటీలను అక్టోబర్ 13న ఆయన ప్రారంభించారు. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి జాతీయ, క్రీడా, గురుకుల జెండాలను ఎగురవేశాక క్రీడాకారుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పీఓ ప్రతీక్‌జైన్ మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంత విద్యార్థులు సహజంగా క్రీడల్లో నైపుణ్యం కలిగి ఉంటారని, ఈ నైపుణ్యంతోనే పోటీల్లో ప్రతిభ చాటి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
చదవండి: Gurukul Principal: గురుకుల ప్రిన్సిపాల్ సస్పెన్షన్
అండర్–14, 17, 19 విభాగాల్లో ఖో–ఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ ముఖ్యమేనని తద్వారా స్నేహభావం పెరగడమే కాక శారీరక దృఢత్వం దరి చేరుతుందని పీఓ వివరించారు. కాగా, మూడు రోజులపాటు జరిగే పోటీల్లో ఇబ్బంది ఎదురుకాకుండా భోజన, వసతి సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడారు. ఈ పోటీలకు ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని 18 పాఠశాలలు, కళాశాలల నుంచి 700 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గిరిజన గురుకులాల ఇన్‌చార్జ్ ఆర్‌సీఓ డేవిడ్‌రాజ్, తహసీల్దార్ రంగా, ఎంపీడీఓ సత్యనారాయణ, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ హరికృష్ణతో పాటు సత్యనారాయణ, మనీశ్‌రెడ్డి, జానూనాయక్, రామారావు తదితరులు పాల్గొన్నారు.