ICSSR & TU: సోషల్ సైన్స్ పరిశోధకులకు ప్రత్యేక శిక్షణ
తెయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కాలేజ్ సెమినార్ హాల్‌లో ఏప్రిల్ 10 నుంచి వారం రోజుల పాటు ‘ఆన్‌సైట్ రీసర్చ్ మెథడాలజీ కోర్స్ ఫర్ పీహెచ్‌డీ స్టూడెంట్స్/యంగ్ ఫ్యాకల్టీ ఇన్ సోషల్ సైన్స్’ అనే అంశంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తారని కోఆర్డినేటర్ పున్నయ్య ఏప్రిల్ 9న తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన సోషల్ సైన్స్ పరిశోధకులు, వివిధ డిగ్రీ, పీజీ కళాశాలల్లో బోధించే యువ ఫ్యాకల్టీ ఈ శిక్షణ తరగతులకు హాజరవుతారని ఆయన తెలిపారు. శిక్షణలో భాగంగా వారం రోజుల పాటు 28 సెషన్లు కొనసాగుతాయన్నారు.
చదవండి: Central Govt Scheme 2023: సరికొత్తగా.. అప్రెంటీస్‌షిప్ స్కీమ్!
రాష్ట్రంలోని ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీల నుంచి అనుభవం కలిగిన ఆచార్యులు రిసోర్స్ పర్సన్స్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. పరిశోధనలోని మెళకువలతో పాటు పరిశోధన పద్ధతులపై లోతైన అవగాహన కల్పిస్తారని వివరించారు. ఈ పరిశోధన ఫలాలు వెనకబడిన, అభివృద్ధి చెందుతున్న రంగాలను ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడతాయన్నారు. శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, గౌరవ అతిథిగా ఐసీఎస్‌ఎస్‌ఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుధాకర్‌రెడ్డి హాజరువుతారన్నారు. సోషల్ సైన్స్ పరిశోధకులు, యంగ్ ఫ్యాకల్టీ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.