Central Govt Scheme 2023: సరికొత్తగా.. అప్రెంటీస్‌షిప్ స్కీమ్!

- ఇండస్ట్రీ 4.0 అంశాల్లోనూ అప్రెంటీస్ అవకాశాలు
- స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ పరిధిలోకే ఎన్‌ఏపీఎస్
- అప్రెంటీస్ ట్రైనీల అకౌంట్లలోకే నేరుగా స్టయిఫండ్ బదిలీ
- వచ్చే మూడేళ్లలో 47 లక్షల మందికి శిక్షణ లక్ష్యం
- తాజా బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం వెల్లడి
అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్‌లో.. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నిరంతరం మార్పులు జరుగుతుండాలి. అప్పుడే విద్యార్థులు క్షేత్ర నైపుణ్యాల సాధనలో.. ఎంప్లాయబిలిటీ స్కిల్స్‌ను మెరుగుపరచుకోవడంలో ముందంజలో నిలుస్తారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన మార్పులు అప్రెంటీస్ ట్రైనీలకు ఎంతో ఉపకరిస్తాయి అంటున్నారు నిపుణులు.
స్కిల్ ఇండియా పరిధిలోకి
నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్(ఎన్‌ఏపీఎస్)ను స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ పరిధిలోకి తీసుకురావాలని తాజాగా నిర్ణయించారు. ఇప్పటి వరకు ప్రత్యేక విభాగంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్కీమ్‌ను.. ఇక నుంచి స్కిల్ ఇండియా ప్రోగ్రామ్‌లలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రస్తుతం స్కిల్ ఇండియా పరిధిలో.. ప్రధానమంత్రి కౌశల్ వికాశ్ యోజన, జన్ శిక్షణ్ సంస్థాన్‌లు ఉన్నాయి. తాజా నిర్ణయంతో ఎన్‌ఏపీఎస్ కూడా స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ జాబితాలో చేరనుంది. అంతేకాకుండా.. దాదాపు ఏడేళ్ల నుంచి అమలవుతున్న ఎన్‌ఏపీఎస్‌ను ఇకపై ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్‌గా పిలవనున్నారు.
చదవండి: Industry 4.0 Skills: బీటెక్ తర్వాత వెంటనే కొలువు కావాలంటే.. ఈ 4.0 స్కిల్స్ ఉండాల్సిందే!
ఇండస్ట్రీ 4.0 స్కిల్స్ కూడా
ఎన్‌ఏపీఎస్ ద్వారా ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌లోనూ అప్రెంటీస్ శిక్షణ లభించేలా చూడాలని కూడా నిర్ణయించారు. ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌గా పేర్కొనే ఐఓటీ, ఆటోమేషన్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీలకు ఇటీవల కాలంలో ప్రాధాన్యత పెరుగుతోంది. దీంతో ఈ టెక్ స్కిల్స్‌లోనూ అప్రెంటీస్ ట్రైనింగ్ అవకాశాలు కల్పించనున్నారు. ఫలితంగా ఇంతకాలం కోర్ అంశాల్లోనే శిక్షణ పొందుతున్న విద్యార్థులకు.. ఇకపై లేటెస్ట్ టెక్నాలజీస్‌పైనా శిక్షణ, నైపుణ్యం లభించనున్నాయి.
బ్యాంక్ అకౌంట్లోకి స్టయిఫండ్
ఎన్‌ఏపీఎస్ స్కీమ్ ప్రకారం-ఒక అప్రెంటీస్ ట్రైనీకి ప్రతి నెల ఇచ్చే స్టయిఫండ్‌లో 75 శాతాన్ని సదరు శిక్షణ కల్పిస్తున్న సంస్థ, మరో 25 శాతం లేదా రూ.1500ను ప్రభుత్వం చెల్లిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ స్టయిఫండ్ చెల్లింపును డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డీబీటీ) విధానంలో అందిస్తారు. అంటే.. అప్రెంటీస్ ట్రైనీల బ్యాంక్ అకౌంట్లలోకే నేరుగా స్టయిఫండ్ జమ చేస్తారు. ముందుగా సదరు ట్రైనింగ్ అవకాశం కల్పించిన సంస్థ తాను ఇవ్వాల్సిన 75 శాతం మొత్తాన్ని అప్రెంటీస్ ట్రైనీ ఖాతాలో జమ చేసినట్లు ఆధారాలు చూపిన తర్వాతే కేంద్ర ప్రభుత్వ వాటా జమ కానుంది. ఇప్పటికే అప్రెంటీస్ ట్రైనీలుగా పని చేస్తూ స్టయిఫండ్ పొందుతున్న వారు, స్టయిఫండ్ అందిస్తున్న సంస్థలు.. డీబీటీ విధానంలోకి మారడానికి ఈ-కేవైసీ, ఆధార్ ధ్రువీకరణలతో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
పైలట్ ప్రాజెక్ట్‌గా
అప్రెంటీస్ ట్రైనీలకు డీబీటీ విధానంలో స్టయిఫండ్ చెల్లింపుపై ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్‌ను అమలు చేశారు. గతేడాది జూలైలో ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి..1,544 సంస్థల పరిధిలో పని చేస్తున్న 1,55,000 మంది అప్రెంటీస్ ట్రైనీలకు రూ.22.29 కోట్ల మొత్తాన్ని డీబీటీ విధానంలో చెల్లించారు. డీబీటీ విధానం వల్ల స్టయిఫండ్ చెల్లింపుల్లో పారదర్శకత వస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ట్రైనీలకు సంస్థలు ఇచ్చే స్టయిఫండ్ విషయంలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా నియంత్రిచొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
చదవండి: Career Opportunities: 5జీ టెక్నాలజీలో రానున్న మూడేళ్లలో 2.2 కోట్ల ఉద్యోగాలు..
మూడేళ్లలో 47 లక్షల ట్రైనీలు
ఎన్‌ఏపీఎస్‌లో భాగంగా రానున్న మూడేళ్లలో 47 లక్షల మందికి అప్రెంటీస్ ట్రైనీ అవకాశాలకు కల్పించడం లక్ష్యంగా చేసుకున్నట్లు కేంద్ర బడ్జెట్ సందర్భంగా పేర్కొన్నారు. పదో తరగతి నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ వరకు.. ట్రెడిషనల్, టెక్నికల్ కోర్సుల అభ్యర్థులందరికీ వారి అర్హతలకు సరితూగే సంస్థలు లేదా విభాగాల్లో అప్రెంటీస్ శిక్షణ లభించేలా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే ఈ స్కీమ్ ద్వారా 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరం.. డిసెంబర్ 2022 నాటికి 35,229 సంస్థలు నమోదు చేసుకోగా.. 21,71,431 మంది అభ్యర్థులు అప్రెంటీస్ ట్రైనీలుగా నమోదు చేసుకున్నారు. ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే.. అప్రెంటీస్ ట్రైనింగ్‌కు ఆదరణ పెరుగుతుందని చెప్పొచ్చు.
ఎన్‌ఏపీఎస్.. లక్ష్యం
- కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 2016లో.. ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో అప్రెంటీస్ అవకాశాలను పెంచే ఉద్దేశంతో సంస్థలను భాగస్వాములను చేస్తూ ఎన్‌ఏపీఎస్‌ను ప్రారంభించారు.
- అప్రెంటీస్ ట్రైనీలను.. ట్రేడ్ అప్రెంటీసెస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీసెస్, టెక్నిషియన్ అప్రెంటీసెస్, టెక్నిషియన్(ఒకేషనల్) అప్రెంటీస్, ఇతర ఆప్షనల్ ట్రేడ్ అప్రెంటీసెస్‌గా వర్గీకరించారు.
- ఎన్‌ఏపీఎస్ పరిధిలోని సంస్థలు, అదే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు అప్రెంటీస్ ట్రైనీ అవకాశాలను కల్పించాలి. సంస్థ మొత్తం సిబ్బందిలో 2.5 శాతం నుంచి 10 శాతానికి సమానమైన సంఖ్యలో అభ్యర్థులను అప్రెంటీస్ ట్రైనీలుగా నియమించాలి.
- నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్‌లో సంస్థలు పాల్పంచుకునేలా పలు ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించారు.
పరీక్షలు.. సర్టిఫికెట్లు
ఎన్‌ఏపీఎస్ ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ పేరుతో పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికెట్ కూడా అందిస్తారు. ఈ పరీక్షకు హాజరు కావాలంటే.. సదరు అభ్యర్థులు అప్రెంటీస్ ట్రైనింగ్ సమయంలో కనీసం 80 శాతం హాజరు కలిగుండాలి. అదే విధంగా.. ఫార్మేటివ్ అసెస్‌మెంట్‌లో ట్రేడ్ ప్రాక్టికల్స్‌లో 60 శాతం, ట్రేడ్ థియరీలో 40 శాతం మార్కులు పొందాలి.
చదవండి: Engineering Students: బీటెక్ నాలుగేళ్ల ప్రణాళిక ఇలా..
ప్రత్యేక వెబ్‌సైట్
ఎన్‌ఏపీఎస్‌లో భాగంగా సంస్థలు, అప్రెంటీస్ ట్రైనీ అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి వీలుగా ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించారు. సంస్థలు తమకు అవసరమైన అర్హతలతో కూడిన ట్రైనీ నియామక వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. అదే విధంగా అభ్యర్థులు తమ అర్హతలు, తమకు ఆసక్తి ఉన్న విభాగాల వివరాలతో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఇలా అభ్యర్థుల వివరాలను పరిశీలించి సంస్థలు నియామకాలు చేపట్టే అవకాశం ఉంటుంది. శిక్షణ సమయంలో అభ్యర్థుల, సంస్థల పనితీరును పరిశీలించేందుకు రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్‌కు సంబంధించిన అధికారులు ప్రత్యక్ష తనిఖీలు చేస్తారు.
ఎన్‌ఏటీఎస్‌లోనూ మార్పులు!
- గ్రాడ్యుయేట్, డిప్లొమా విద్యార్థులకు ఉద్దేశించిన నేషనల్ అప్రెంటీస్ ట్రైనింగ్ స్కీమ్‌లోనూ మార్పులు చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
- ప్రస్తుతం ఎన్‌ఏటీఎస్ ప్రకారం-ఆర్ట్స్, హ్యుమానిటీస్, కామర్స్, ఇంజనీరింగ్, డిప్లొమా విద్యార్థులను ఎన్‌ఏటీఎస్ పరిధిలోకి తీసుకొచ్చారు.
- డిప్లొమా ఉత్తీర్ణులకు నెలకు రూ.8 వేలు, ఇతర కోర్సుల వారికి నెలకు రూ.9వేల స్టయిఫండ్‌ను అందిస్తున్నారు.
- శాశ్వత ఉద్యోగులు 30 మంది ఉన్న సంస్థలు ఎన్‌ఏటీఎస్ విధానంలో అప్రెంటీస్ ట్రైనీలను నియమించుకోవచ్చు.
- ప్రతి సంస్థ కనిష్టంగా నలుగురిని అప్రెంటీస్ ట్రైనీలుగా నియమించుకోవచ్చు.
- అప్రెంటీస్ ట్రైనీలకు నిర్దేశించిన స్టయిఫండ్ మొత్తంలో 50 శాతాన్ని సంస్థలు చెల్లిస్తే సరిపోతుంది. మిగతా 50 శాతాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2,77, 140 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా.. 1,77, 606 మందికి అప్రెంటీస్ ట్రైనీలుగా నియామకాలు ఖరారు.
ఎన్‌ఏపీఎస్ స్కీమ్.. మార్పులు
- స్టయిఫండ్ చెల్లింపులో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానం అమలు.
- ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీస్‌లోనూ అప్రెంటీస్ ట్రైనింగ్ అవకాశం.
- రానున్న మూడేళ్లలో 47 లక్షల మందికి శిక్షణ లక్ష్యం.
- స్కిల్ ఇండియా స్కీమ్స్‌లో భాగంగా అమలు కానున్న ఎన్‌ఏపీఎస్.
- ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీవ్‌గా పేరు మార్పు.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.apprenticeshipindia.gov.in/
ఆధునిక నైపుణ్యాలకు అవకాశం
నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్‌లో ప్రతిపాదించిన మార్పులతో యువతకు ఎంతో మేలు కలుగుతుంది. ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీ, ఐటీ అనుబంధ అంశాల్లోనూ అప్రెంటీస్‌షిప్ పేరుతో ఆన్ జాబ్ ట్రైనింగ్ పొందే అవకాశం లభిస్తుంది. దీనివల్ల ప్రధానంగా డిప్లొమా, బీటెక్ విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. స్టయిఫండ్ చెల్లింపులో డీబీటీని అమలు చేయడం..అటు యాజమాన్యాలకు, ఇటు అప్రెంటీస్ ట్రైనీలకు వ్యయ ప్రయాసల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా స్టయిఫండ్ చెల్లించే విషయంలో ఒడిదుడుకులు, అవకతవకలు లేకుండా మరింత పారదర్శకత ఏర్పడుతుంది.
- తోట ప్రదీప్, డిప్యూటీ డైరెక్టర్, ఎన్‌సీవీఈట