Medical students: పాఠం వినడంతో పాటు ఇకనుంచి పరిశోధనలు
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు చొరవతో సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ మంజూరైంది. ఇప్పటికే సకల హంగులతో తీర్చిదిద్దిన కళాశాలకు రీసెర్చ్ యూనిట్ రాకతో ప్రాధాన్యం పెరగనుంది. అంతేకాకుండా విద్యార్థులకు సరికొత్త పరిశోధనలు చేసేందుకు అవకాశం లభించినుంది. యూనిట్‌లో జరిగే పరిశోధనలతో మున్ముందు కళాశాలకు కూడా మంచి గుర్తింపు రానుంది.
చదవండి: NMA: కాబోయే వైద్యులకూ కావాలి వైద్యం!.. ఎన్‌ఎంఏ కీలక సూచనలివీ...
2018లో ప్రారంభం
- సిద్దిపేటలో 2018లో ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరైంది. పట్టణంలోని ఎన్సాన్‌పల్లి శివారులో 28 ఎకరాల స్థలంలో శాశ్వత భవన నిర్మించారు.
- ఈ ఏడాది ఎంబీబీఎస్ మొదటి బ్యాచ్ పూర్తవగా, 62 సీట్లతో పీజీ తరగతులు కూడా ప్రారంభమయ్యాయి.
- వైద్య విద్యార్థులు పాఠాలకే పరిమితం కాకుండా పరిశోధనలపై ఆసక్తి పెంపొందించడం కోసం మంత్రి హరీశ్‌రావు మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్‌ను మంజూరు చేయించారు.
- ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 35 విభాగాలు ఉన్నాయి. వాటిలో పరిశోధన చేయాలంటే ఈ రీసెర్చ్ యూనిట్ ఉపయోగించుకోనున్నారు.
- ఈ యూనిట్‌లో పరిశోధనలకు అవసరమైన అన్ని రకాల అధునాతన యంత్ర పరికరాలు అందుబాటులో ఉంటాయి.
- మెడికల్ కళాశాలలో పీజీ విద్య అభ్యసించేవారితో పాటు కళాశాలలో బోధించే ప్రొఫెసర్లు సైతం ఏదైనా అంశంపై లోతుగా పరిశోధన చేసేందుకు అవకాశం ఉంది.
- పరిశోధన ఫలితాలు పబ్లికేషన్‌లో ప్రచురితమైతే అటు పరిశోధన విద్యార్థితో పాటు వైద్య కళాశాలకు పేరు వస్తుంది.
- కళాశాలలో పరిశోధన సలహా మండలిని ఏర్పా టు చేసి పరిశోధన ప్రాధాన్యత అంశాలు, ప్రాజెక్టులను గుర్తించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
- లోకల్ అడ్వైజరీ కమిటీ సూచించిన వ్యాధులపై కూడా పరిశోధనలు చేస్తారు.
చదవండి: IMS: దరఖాస్తు గడువు నేడు.. కాంట్రాక్టు ముగిసేది ఎల్లుండి!
రూ.5కోట్లు మంజూరు
వైద్య కళాశాలలో పరిశోధనలు నిర్వహించేందుకు ఐదేళ్లకుగాను ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయనుంది. భవనాలకు రూ.25 లక్షలు, పరికరాల కొనుగోలు రూ.2 కోట్లను ప్రభుత్వం కేటాయించనుంది. తొలి విడతలో రూ.2.5 కోట్లు విడుదల చేయగా, వీటిని సివిల్ నిర్మాణాలు, పరికరాల కొనుగోలు, జీతాలు, శిక్షణ కార్యక్రమాలకు వినియోగిస్తారు. కాగా వైద్య కళాశాలకు మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ మంజూరు చేయించినందుకు మంత్రి హరీశ్‌రావుకు కళాశాల సిబ్బంది, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
- మెడికల్ కళాశాలకు
- మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్
- మంత్రి హరీశ్ రావుచొరవతో మంజూరు
- వైద్య విద్యార్థులకు ప్రయోజనం
పరిశోధనలతో పేరు తేవాలి
వైద్య విద్యార్థులు పాఠాలకే పరిమితం కాకుండా పరిశోధనలపై దృష్టి సారించాలి. రీసెర్చ్ యూనిట్‌ను సద్వినియోగం చేసుకొని గొప్ప ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలి. సరికొత్త పరిశోధనలతో భవిష్యత్‌లో కళాశాలకు పేరు తేవాలి.
– మంత్రి హరీశ్ రావు