YS Jagan Mohan Reddy: నర్సింగ్ విద్యార్థులకు..జర్మనీలో అవకాశాలు కల్పించండి
Sakshi Education
ఇక్కడి నర్సింగ్ విద్యార్థులకు జర్మనీలో విస్తృతంగా అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జర్మనీలోని భారత రాయబారి పర్వతనేని హరీష్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు.
వారు కోర్సు చదివే సమయంలో అక్కడికి తగ్గట్లుగా భాషా శిక్షణ, కరిక్యులమ్ అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. దీనిపై హరీష్ సానుకూలంగా స్పందించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని అక్టోబర్ 18న నార్వే, జర్మనీ దేశాల్లోని భారత రాయబారులు డాక్టర్ బి. బాలభాస్కర్, పర్వతనేని హరీష్ కలిశారు.
చదవండి: Education: విద్యాశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్ష
ఎగుమతులను ప్రోత్సహించడంలో భాగంగా జర్మనీ, నార్వే దేశాల్లో అవకాశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించిన ఏపీ ప్రభుత్వం.. ఇదే అంశంపై ఏపీఐఐసీ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఆ వివరాలను వారిరువురూ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే..
- రాష్ట్రం నుంచి ఎగుమతికి అవకాశమున్న ఉత్పత్తులు, సులభతర వాణిజ్యం కోసం అమలుచేస్తున్న ప్రణాళికలను రాయబారులకు సీఎం జగన్ వివరించారు.
- వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఉద్యాన ఉత్పత్తులు, మత్స్య సంపద, చేనేత, టెక్స్‌టైల్, టూరిజం రంగాలలో అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
- దేశంలోనే ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో నిర్మిస్తున్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, పోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కుల ఏర్పాటు, ఎంఎస్‌ఎంఈలతో ఒప్పందాలు, పాలసీలు, టెక్నాలజీ అప్‌గ్రెడేషన్, డీకార్బనైజేషన్ వంటి కీలక అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది.
- నాణ్యతతో కూడిన ఉత్పత్తులకు ప్రాధాన్యతనిస్తూ అధిక మొత్తంలో ఆయా దేశాలకు ఎగుమతులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జగన్ వారికి వివరించారు.
- నాణ్యమైన, రుచికరమైన కాఫీ ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్, ప్రొడక్టివిటీ పెంచేలా తగిన సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరగా.. తప్పనిసరిగా తమ సహకారం ఉంటుందని ఇరుదేశాల రాయబారులు హామీఇచ్చారు.
- ఇక ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై ముఖ్యమంత్రి వారికి వివరించారు.
- ఈ సమావేశంలో సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ప్రణాళికా శాఖ కార్యదర్శి జి. విజయ్‌కుమార్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి. సృజన పాల్గొన్నారు.
చదవండి: Andhra Pradesh : విద్యాశాఖపై సీఎం జగన్ కీలక సమీక్ష.. 5,18,740 ట్యాబ్‌లను..
Published date : 19 Oct 2022 03:25PM