Skip to main content

Degree Students: ప్రైవేటు కళాశాలలు రెట్టింపు స్థాయిలో ఫీజుల వసూలు.. తరగతుల నిర్వహణ మాత్రం ఇలా..

జగిత్యాల: జిల్లాలోని కొన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. వివిధ రకాల ఫీజుల పేరుతో విద్యార్థులను నిరంతరం పీడిస్తున్నాయి.
Private colleges charge double the fees

కళాశాలల్లో చేర్చుకునేటప్పుడు అన్నీ ఉచితమని విద్యార్థులకు మాయమాటలు చెప్పి ఆపై వివిధ రకాల పేర్లతో ఇష్టారీతిన ఫీజుల వసూళ్లకు పాల్పతున్నాయనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. అలాగే తరగతుల నిర్వహణపై దృష్టి సారించాల్సిన కొన్ని కళాశాలలు కేవలం ప్రభుత్వం ఇచ్చే ఫీజురీయంబర్స్‌మెంట్‌ కోసమే నడుపుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

రెట్టింపు స్థాయిలో ఫీజుల వసూలు

డిగ్రీ విద్యలో కొన్నాళ్ల క్రితం సెమిస్టర్‌ విధానాన్ని అమలు చేశారు. ప్రస్తుతం ఏడాదికి రెండుసార్లు పరీక్షలు రాయాల్సి వస్తోంది. వీటికోసం చెల్లించాల్సిన ఫీజులు కోర్సును బట్టి రూ.800 నుంచి రూ.900 వరకు ఉంటాయి. కొన్ని ప్రైవేటు కళాశాలలు మాత్రం ఇందుకు రెట్టింపు కంటే ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను దోచుకుంటున్నాయి.

చదవండి: Degree Admissions: ఈ కళాశాలలో ప్రవేశం పొందే విద్యార్థులకు ఉచితంగా దోస్త్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌

ప్రవేశాల సమయంలో అన్నీ ఉచితమే అని చెప్పిన యాజమాన్యాలు తరువాత ల్యాబ్‌ ఫీజు, ప్రాక్టికల్‌ రికార్డు ఫీజు, ట్రావెలింగ్‌ ఫీజు, స్కాలర్‌షిప్‌ రెన్యూవల్‌ ఫీజు, టీసీ ఫీజులంటూ ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా కనీసం పట్టించుకునే నాథుడే లేడని పలువురు అధ్యాపకులే వాపోతున్నారు.
గత సెమిస్టర్‌ పరీక్షల సందర్భంగా విద్యార్థుల నుంచి పరీక్షల ఫీజును వసూలు చేసిన జిల్లాకేంద్రంలోని ఓ ప్రముఖ ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యం.. వారి పేర్ల మీద యూనివర్సిటీకి మాత్రం ఫీజు చెల్లించలేదు. దీంతో అందులో చదువుతున్న విద్యార్థులు సెమిస్టర్‌ పరీక్షలు రాయలేకపోయారు. ఈ విషయంపై విద్యార్థి సంఘాలు సదరు కళాశాల యాజమాన్యాన్ని నిలదీశాయి. కళాశాల ఫర్నిఛర్‌ను ధ్వంసం చేశాయి. ఈ సంఘటన అప్పట్లో జిల్లాలో చర్చనీయాంశమైంది.

తరగతుల నిర్వహణపైనా నిర్లక్ష్యం

జిల్లాలోని కొన్ని కళాశాలల్లో పూర్తిస్థాయిలో తరగతుల నిర్వహణనే జరగడం లేదని పలు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదే విషయంపై తాము యాజమాన్యాలను నిలదీస్తే తమకు ఫీజు రీయంబర్స్‌మెంటు బకాయిలు పేరుకుపోవడంతో నిర్వహణ ఇబ్బందిగా మారిందని బదులిస్తున్నారని అంటున్నారు.

అనేక కళాశాలల్లో పార్ట్‌ టైం పద్ధతి, సబెక్టు పద్ధతిలో అతి తక్కువ వేతనాలకు అధ్యాపకులను నియమించుకుంటున్నారు. ఫలితంగా బోధనలో నాణ్యత లోపిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.

దృష్టిసారిస్తే అనేకం వెలుగులోకి..

యూనివర్సిటీ అధికారులు, ఉన్నత విద్యాశాఖ అధికారులు ఇలాంటి కళాశాలలపై లోతుగా విచారణ జరిపితే అనేక అక్రమాలు బయటపడే అవకాశాలుంటాయని పలువురు విద్యావేత్తలు అంటున్నారు. యాజమాన్యాల దోపిడీని ప్రత్యక్షంగా గమనిస్తున్న పలువురు అధ్యాపకులే కళాశాలల్లో జరిగే అక్రమాలపై చర్చించుకుంటున్నారు.

యూనివర్సిటీ, ఉన్నత విద్యామండలికి అందించే సమాచారానికి.. క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు ఏమాత్రమూ పొంతన ఉండడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. జిల్లాలోని కొన్ని కళాశాలలు నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇకనైనా యూనివర్సిటీ అధికారులు, ఉన్నత విద్యామండలి అధికారులు స్పందించి ఇటువంటి కళాశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

Published date : 15 Mar 2024 03:46PM

Photo Stories