Medical and Health Department: గ్రామీణ సేవల్లో పీజీ వైద్య విద్యార్థులు
ఈ కార్యక్రమాన్ని 2020–21 విద్యా సంవత్సరంలోనే నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఎండీ/ఎంఎస్ కోర్సులు చేసే పీజీ రెసిడెంట్‌లను మూడు, నాలుగు, ఐదో సెమిస్టర్‌ల సమయంలో రొటేషన్ పద్ధతిలో మూడు నెలలు సీహెచ్‌సీలు, జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో నియమిస్తారు. ఈ మూడు నెలలు వీరు ఆస్పత్రుల్లో రెసిడెంట్‌లుగా సేవలు అందించాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలకు ఆ పరిధిలో ఉండే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఆస్పత్రులను ట్యాగ్ చేశారు. 2020–21లో పీజీ కోర్సుల్లో చేరిన వైద్యుల్లో 830 మంది డీఆర్ చేయాల్సి ఉంది. వీరిలో 200 మంది పీజీలకు రాష్ట్రవ్యాప్తంగా ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. జిల్లా స్థాయిలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల ప్రణాళిక, అమలు, పర్యవేక్షణపై పీజీ విద్యార్థులకు అవగాహన కల్పించడమే డీఆర్ ముఖ్య ఉద్దేశం.
చదవండి: NMC: వైద్య కళాశాలకు గ్రీన్ సిగ్నల్
ప్రీ, పారా క్లినికల్ రెసిడెంట్‌లు రోగనిర్ధారణ/ప్రయోగశాలలు, ఫార్మసీ, ఫోరెన్సిక్ సేవలు, సాధారణ వైద్య విధులు, ప్రజారోగ్య కార్యక్రమాలపై శిక్షణ పొందుతారు. క్లినికల్ స్పెషాలిటీ రెసిడెంట్‌లు ఆయా స్పెషాలిటీ ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, క్యాజువాలిటీ, ఇతర ప్రాంతాలలో సేవ చేయడంతోపాటు రాత్రి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పీజీలకు వసతి, స్టైఫండ్ సౌకర్యాన్ని వైద్య శాఖ కల్పిస్తోంది. డీఆర్ కార్యక్రమానికి ఏపీవీవీపీ కమిషనర్ రాష్ట్ర నోడల్ అధికారిగా, డీసీహెచ్‌ఎస్‌లు జిల్లా నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. వీరు పీజీ రెసిడెంట్‌లకు శిక్షణ నాణ్యతను, హాజరు, పనితీరు, ఇతర అంశాలను పర్యవేక్షిస్తారు. పీజీ తుది పరీక్షకు హాజరు కావడానికి ముందు డీఆర్ సంతృప్తికరంగా పూర్తి చేయడం తప్పనిసరి.
చదవండి: 295 Jobs: మెడికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
5200 మంది పీజీలు గ్రామీణ సేవల్లో ఉంటారు
వైద్య కళాశాలల నుంచి వచ్చిన వివరాల ఆధారంగా పీజీ వైద్యులను ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో నియమించాం. వారికి వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం. రొటేషన్ పద్ధతిలో పీజీలు డిస్ట్రిక్ట్ రెసిడెన్సీకి వస్తుంటారు. ఈ క్రమంలో ఏడాది పొడవునా కనీసం 200 మంది పీజీ వైద్యులు రాష్ట్రంలో గ్రామీణ సేవల్లో ఉంటారు. క్షేత్ర స్థాయిలో వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు, గ్రామీణ ఆస్పత్రుల పనితీరు తెలుసుకోవడానికి వైద్య విద్యార్థులకు ఈ కార్యక్రమం ఓ మంచి వేదిక. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పీజీ విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ వినోద్ కుమార్, కమిషనర్ ఏపీవీవీపీ