Govt Degree College: పేరుకే ప్రభుత్వ డిగ్రీ కళాశాల!
విద్యారంగానికి పెద్దపీట వేస్తామని ప్రభుత్వం ఓవైపు చెబుతూనే.. మరోవైపు ఎంతోమందిని తీర్చిద్దిన పరకాల ప్రభుత్వ జూని యర్ కళాశాల భవనంలోనే డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్నారు. ఈ భవనం పూర్తిగా శిథిలావస్థలో ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని 50 ఏళ్ల క్రితం నిర్మించారు.
మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, దివంగత మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు ఒకప్పుడు ఈ కళాశాలలో చదువుకున్న వారే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మంచి గుర్తింపు ఉండేది.
చదవండి: CMOverseas Scheme: మైనారిటీల విదేశీ విద్యకు సర్కార్ చేయూత
ప్రతిభావంతులకే ఇందులో సీట్లు దొరికేవి. ఆసమయంలో ఎక్కడ కూడా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు ఉండేవి కావు. పరకాల పట్టణం నుంచి ఎంతో మంది ఉన్నత చదువులతో విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డవారు, పలు ప్రైవేట్ విద్యాసంస్థలు నడుపుతున్న వారు కూడా ఇక్కడ చదువుకున్నవారే.
జాడలేని కొత్త భవనాలు..
పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జనరల్, ఒకేషనల్ కోర్సులు ఉన్నాయి. పట్టణంలోని ఎన్నో ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నా ఎంతో మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్నారు. పాత భవనం శిథిలవస్థలోకి చేరుకోవడంతో జూనియర్, డిగ్రీ కళా శాలకు చెందిన విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.
అరకొర గదులున్న రెండు భవనాలు మాత్ర మే ఉన్నాయి. ల్యాబ్, లెక్చరర్స్ హాల్, సెమినార్ హాల్ ఉండాలి. శిథిలమైన భవనం నుంచి పెచ్చులు రాలి పడుతుండటంతో అదనపు తరగతుల భవనంలోకి జూనియర్ కళాశాలను మార్చారు. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరగతులు జూని యర్ కళాశాల భవనంలో కొనసాగుతుండడంతో విద్యార్థులు, అధ్యాపకులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఐద సంవత్సరాల క్రితం ప్రతిపాదనలు
శిథిలవస్థలోకి చేరుకున్న పరకాల ప్రభుత్వ జూని యర్ కళాశాల భవనం స్థానంలో డిగ్రీ కళాశాల భవనం నిర్మాణం చేయాలని ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఐదు సంవత్సరాల క్రితం ప్రతిపాదనలు పంపించారు.
ఇందుకు రూ.14 కోట్లు మంజూరు చేసినట్లు సమాచారం. కానీ, ఇప్పటివరకు కొత్త భవనం పనులు ప్రారంభం కాలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పరకాల డిగ్రీ కళాశాల పనులు ప్రారంభించి త్వరగా పూర్తిచేయాలని విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు.