ఎయిడెడ్‌కు వ్యతిరేకం కాదు
Sakshi Education
రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థల చుట్టూ జరుగుతున్న రాజకీయాలు, రెచ్చగొట్టే ధోరణులు బాధాకరమని.. ఇందులోకి రాజకీయాలను తీసుకురావడం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
ఎయిడెడ్ విద్యా సంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని ఆయన స్పష్టంచేశారు. తన క్యాంపు కార్యాలయంలో నవంబర్ 2న అధికారులతో జరిగిన సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకమనే కోణంలో జరుగుతున్న ప్రచారాలు, కథనాలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలు, అందులో పనిచేస్తున్న టీచర్లు, విద్యార్థులకు మంచి చేయాలనే ఉద్దేశంతో కొన్ని అవకాశాలు కల్పించామన్నారు. ఈ అవకాశాల వెనకనున్న కారణాలను సీఎం జగన్ వివరించారు. అవి ఆయన మాటల్లోనే..
- గతంలో డబ్బున్న వారు, ఆస్తిపాస్తులు ఉన్నవారు ఛారిటీ కింద భవనాలు నిర్మించారు. అందులో ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీలు పెట్టారు. తర్వాత కాలంలో ఈ స్కూళ్లు, కాలేజీలు నడపడం ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది.
- మరోవైపు.. ప్రభుత్వాలు కూడా గడచిన 20–25 ఏళ్లుగా ఎయిడెడ్ పోస్టులను భర్తీచేయకపోవడంతో ఆ పోస్టులు కరిగిపోతూ వచ్చాయి. ఒక విధాన నిర్ణయంలో భాగంగా ఇది చేశాయి.
- యాజమాన్యాలే టీచర్లను నియమించుకుని ఎయిడెడ్ స్కూళ్లను నడపాల్సిన పరిస్థితి వచ్చింది.
- ఈ దశలో ఎయిడెడ్ స్కూళ్లను, కాలేజీలను నడపడానికి మళ్లీ మళ్లీ డబ్బులు పెట్టాల్సిన పరిస్థితులొచ్చాయి. ఈ విద్యా సంస్థలను నడిపేందుకు యాజమాన్యంలోని వ్యక్తులు అవసరమైన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. సంస్థల వ్యవహారాలను దగ్గరుండి చూసుకునే పరిస్థితులు కూడా లేకుండాపోయాయి.
- ఈ కారణాలన్నీ కూడా ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల నిర్వీర్యానికి దారితీశాయి. భవనాలన్నీ కూడా శిథిలావస్థకు చేరాయి. రిటైరైన టీచర్ల స్థానే కొత్త వారిని నియమించుకోవడం కూడా యాజమాన్యాలకు ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది. ఒకవేళ టీచర్లను పెట్టినా నాణ్యత లోపించింది.
- ఈ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు కూడా చాలాకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. తమను ప్రభుత్వంలో భాగంగా గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎయిడెడ్ స్కూళ్లన్నీ శిథిలావస్థకు చేరుతున్నాయని.. ప్రభుత్వంలో భాగం కానీయకుండా తమ కడుపులు కొడుతున్నారని కూడా వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
- ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థల వెనకున్న ఉద్దేశాల రక్షణకు, వాటి యాజమాన్యాలకు సహాయకారిగా ప్రభుత్వం ఐచ్ఛికంతో కూడిన విధంగా, స్వచ్ఛందంగా కొన్ని అవకాశాలను కల్పించింది.
- నడపలేని పరిస్థితుల్లో ఉన్న విద్యా సంస్థలను ఉన్నది ఉన్నట్లుగా ప్రభుత్వానికి అప్పగిస్తే.. నాడు–నేడులో భాగంగా పునరుద్ధరిస్తాం. విద్యార్థులకు సరిపడా టీచర్లను భర్తీచేస్తాం. చారిటీ కింద విద్యాసంస్థలను పెట్టిన దాతల పేర్లను కొనసాగించడం ద్వారా యాజమాన్యాల ఉద్దేశాలను నెరవేరుస్తాం. ఎయిడెడ్ విద్యాసంస్థల స్థాపన వెనకున్న లక్ష్యాలను చేరుకునేందుకు అందిస్తున్న తోడ్పాటులో భాగమే ఇది. ఆ సంస్థలను నడుపుతున్న వారికి సహాయంగా నిలిచే కార్యక్రమం ఇది.
- తాము ప్రభుత్వంలో భాగమయ్యేలా చూడాలంటూ ఎయిడెడ్ టీచర్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, వారి డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని, వారిని సరెండర్ చేసి, ప్రైవేటుగా నడుపుకోవచ్చు.
- లేదా ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా యథా ప్రకారం నడుపుకోవచ్చు.
- ఇప్పటికే ప్రభుత్వంలో విలీనానికి అంగీకారం తెలిపిన ఎయిడెడ్ విద్యాసంస్థలు, తిరిగి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటే.. అలా కూడా చెయ్యొచ్చు. దీనికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది.
- ఎయిడెడ్ విద్యాసంస్థల యజమానులకు, అందులో పనిచేస్తున్న టీచర్లకు, విద్యార్థులకు మంచిచేయాలని, మెరుగైన స్కూళ్లుగా వాటిని తీర్చిదిద్ది నడపాలనే ఉద్దేశంతోనే ఐచ్ఛికంగానే ఈ అవకాశాలను వారు వినియోగించుకోవచ్చు. ఇందులో ఎలాంటి బలవంతంలేదు.. అని ముఖ్యమంత్రి జగన్ వివరించారు.
చదవండి:
MBBS: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల వివరాలు
Published date : 03 Nov 2021 01:04PM