No Entry into Campus: ఓయూలోకి ఇక నో ఎంట్రీ!
కేవలం విద్యార్థులకు మాత్రమే ఓయూలోకి అనుమతించేలా చూడాలని భావిస్తు న్నారు. ఇందుకోసం – ప్రత్యామ్నాయంగా లింక్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం తార్నాక వైపు నుంచి హిందీ మహా విద్యాలయ, విద్యానగర్, నల్లకుంట తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు..ఆ ప్రాంతాల నుంచి తార్నాక వైపు వెళ్లాల్సిన వారు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) నుంచే వెళ్లాల్సి వస్తోంది.
ఈ కారణంగా వర్సిటీ ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతోంది. ఈ పరిస్థితి నివారించేందుకు మునిసిపల్ మంత్రి కేటీఆర్ మానసపుత్రికగా ప్రారంభమైన లింక్/స్లిప్ రోడ్ నిర్మాణం ఉపకరిస్తుందని అధికారులు గుర్తించారు. తద్వారా సమస్యకు పరిష్కారం లభించనుండటంతో అందుకు సిద్ధమయ్యారు.
ఓయూ క్యాంపస్‌లోకి రానవసరం లేకుండా ఉపకరించే ప్రత్యామ్నాయంగా లింక్ రోడ్డు నిర్మాణం త్వరలో చేపట్టనున్నారు. యూనివర్సిటీ ఎన్‌సీసీ గేటు నుంచి అడిక్‌మెట్ ఆర్‌ఓబీ వరకు దాదాపు 1.20 కి.మీ.లతో ఈ లింకు రోడ్డు హెచ్‌ఆర్‌డీసీఎల్ (హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) ఆధ్వర్యంలో నిర్మించనున్నారు. అంచనా వ్యయం రూ.16 కోట్లుగా నిర్ణయించామని హెచ్‌ఆర్‌డీసీఎల్ చీఫ్ ఇంజినీర్ సరోజరాణి తెలిపారు.
వంద అడుగుల వెడల్పుతో నాలుగులేన్లలో, ఫుట్‌పాత్‌లతో సహా నిర్మించే ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే వాహనాలిక ఓయూ లోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. రోడ్డు నిర్మించే ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, ఓయూ వీసీ రవీందర్, ఇంజినీర్లు ఇటీవల పరిశీలించారు.