Library for Readers: పాఠకుల చెంతకే గ్రంథాలయం
గ్రంథాలయాలు మండల కేంద్రాలలో మాత్రమే ఉండటంతోపోటీ పరీక్షలకు సిద్దం అయ్యేవారు, పుస్తకాలు, దినపత్రికలు చదివే పాఠకులకు ఇబ్బందిగా ఉండేది. పబ్లిక్ రీడింగ్ రూంల ఏర్పాటుతో గ్రామాలలోని దినపత్రికలు, పుస్తకాలు చదువుకునే అవకాశం కలిగింది. జిల్లా గ్రంథాలయశాఖ అందించిన లక్ష రూపాయల నిధులతో రీడింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలోని 20 రీడింగ్ సెంటర్లకు రూ.50 వేలతో ఫర్నిచర్ అందించారు. ఇందులో పది కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
చదవండి: Shri Kurella Vittalacharya: ఇంటినే గ్రంథాలయం చేసిన విఠలాచార్య
అందుబాటులో పుస్తకాలు..
గ్రామంలోని విద్యార్థులతోపాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం పుస్తకాలు రీడింగ్ సెంటర్‌లో అందుబాటులో ఉంచారు. రీడింగ్ రూమ్ నిర్వహణకు ప్రతీనెల రూ.వెయ్యి అందిస్తున్నారు. దిన పత్రికలకు మరో రూ.వెయ్యి వరకు అందిస్తారు.
దినపత్రికలు రాక..
పబ్లిక్ రీడింగ్ కేంద్రాలలో పుస్తకాలతోపాటు దినపత్రికలు అందుబాటులో ఉంచాలి. కొన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నప్పటికీ సగం కేంద్రాలలో దినపత్రికలు రావడం లేదని పాఠకులు పేర్కొంటున్నారు. మామడ మండలం పొన్కల్, దిమ్మదుర్తి గ్రామాలలో రీడింగ్ కేంద్రాలను ప్రారంభించారు. ఈ కేంద్రాలలో పుస్తకాలు ఉన్నప్పటికీ దినపత్రికలు రావడం లేదు. రీడింగ్ కేంద్రాల నిర్వహణ నిధులు గ్రామపంచాయతీ అకౌంట్ ద్వారా అందిస్తారు. కొన్ని కేంద్రాలకు సంబంధించిన వివరాలు అందక పోవడంతో నిధులు అందించడంలో జాప్యం జరుగుతుందని గ్రంథాలయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
దిన పత్రికలు అందుబాటులో ఉంచాలి
మా గ్రామంలో ఏర్పాటు చేసిన రీడింగ్‌రూంకు దినపత్రికలు రావడం లేదు. దినపత్రికలు కేంద్రానికి రాక నోటిఫికేషన్ల వివరాలు, ఇతర సమాచారం తెలుసుకోలేక పోతున్నారు. దిన పత్రికలు, యువతకు ఉపయోగపడే పుస్తకాలు అందుబాటులో ఉంచాలి.
– సుధాకర్‌రెడ్డి, పాఠకుడు, పొన్కల్
అందుబాటులో పుస్తకాలు..
పొన్కల్ గ్రామంలో ఏర్పాటు చేసిన రీడింగ్ రూంలో పుస్తకాలు అందుబాటులో ఉంచాం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు, విద్యార్థులు రీడింగ్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దిన పత్రికలకు సంబంధించి నిధులు అందగానే పత్రికలు కేంద్రంలో అందుబాటులో ఉంచుతాం.
– సాయికృష్ణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి, పొన్కల్