Krishna Tarang 2023: పాఠ్యాంశాలే కాదు... సౌకర్యాలూ ముఖ్యమే
ప్రతి పేదింటి బిడ్డకు ఉన్నత విద్య అందించాలన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సంకల్పంలో భాగంగా ఆవిర్భ వించిందే కృష్ణా విశ్వవిద్యాలయం. మహానేత మహోన్నత లక్ష్యాన్ని.. యువతలో ఉత్తేజాన్ని ప్రతిబింబిస్తూ2008 నుంచి ఏటా ‘కృష్ణా తరంగ్–2023’ నిర్వహిస్తున్నాం’ అని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ ఆచార్య జి.జ్ఞానమణి పేర్కొన్నారు.
పశ్చిమగో దావరి జిల్లా నర్సాపురంలో జన్మించిన జ్ఞానమణి నాలుగు దశాబ్దాలు అధ్యాపక వృత్తిలో విశిష్ట సేవలందించారు. ‘భారతదేశంలో హెల్మీన్థాలాజీ’ పుస్తక రచనలో కీలక భూమిక పోషించారు. అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ, ఆంధ్రఓపెన్ వర్సిటీ విద్యార్థుల కోసం ఎన్నో పుస్తకాలను అందించారు.
చదవండి: NCERT New Syllabus: పాఠ్యాంశాల్లో రామాయణం, మహాభారతం!!
జాతీయ, అంతర్జాతీయ స్థాయి జర్నల్స్‌లో 19కిపైగా ప్రచురణలు, 35కిపైగా కాన్ఫరెన్సులు, సెమినార్లతో విశేష అనుభవాన్ని గడించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఎగ్జామినర్‌గా, పేపర్ సెట్టర్‌గా సేవ లందించారు. యూజీసీల్లో కీలక ప్రాజెక్టుల కమిటీల్లో సభ్యుడిగా ఎన్నో సంస్కరణలకు కారకులుగా నిలిచారు.
ఆంధ్ర వర్సిటీలో అకడమిక్ డీన్‌గా, అంబేడ్కర్ వర్సిటీ రిజిస్ట్రార్‌గా ఆయన సేవలను గమనించిన ప్రభుత్వం, ఉద్యోగ విరమణ తర్వాత జూలైలో కృష్ణావర్సిటీ వైస్ చాన్సలర్‌గా నియమించింది. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా కృష్ణా వర్సిటీ అభివృద్ధికి చేపడుతున్న కృషిని ఆయన ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
సంస్కరణల అమలు బాధ్యత మాదే..
విద్యతోనే సమాజం మారుతుందని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బలంగా నమ్మారు. అందుకే ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. వాటిని సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. విద్యార్థులకు అకడమిక్స్‌తో పాటు వారిలోని విభిన్న కోణాలను వెలికితీస్తున్నాం.
‘కృష్ణా తరంగ్–2023’లో 139 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల నుంచి రెండు వేల మంది విద్యార్థులు పాల్గొంటారు. సంగీతం, నృత్యం, ఫైన్‌ఆర్ట్స్, గ్రూప్ ఈవెంట్స్, థియేటర్ ఆర్ట్స్ వంటి 27అంశాల్లో పోటీపడతారు. ప్రతిభ చూపిన వారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగే సౌత్‌జోన్ పోటీలకు ఎంపికవుతారు. ఫెస్ట్ నిర్వహణకు భారీ ఓపెన్ ఆడిటోరియం సహా ఆహ్లాదకర వాతావరణాన్ని సిద్ధం చేశాం.
అడ్మిషన్లు పెంచడమే లక్ష్యం
వర్సిటీలో మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నాం. వీలైనంత త్వరగా హాస్టల్ బ్లాక్‌లను నిర్మిస్తాం. సహోద్యోగులతో కలిసి వర్సిటీలో బ్యాంకు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం.
ఫుడ్ కోర్టు, క్యాంటీన్ నిర్మాణాన్ని ఈ నెలాఖరుకు పూర్తి చేస్తున్నాం. వర్సిటీలో అడ్మిషన్లును పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ఎంబీఏ, కెమిస్ట్రీ వంటి ప్రోగ్రామ్స్‌లో ఎన్‌రోల్‌మెంట్ బాగా పెరిగింది.
నాలుగేళ్ల డిగ్రీని ప్రోత్సహిస్తాం
ఉన్నత విద్యలో నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సు విప్లవాత్మక నిర్ణయం. వర్సిటీ పరిధిలో 25 కళాశాలలకు ఆనర్స్ బోధనకు అర్హతలు ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వర్సిటీ తరఫున ప్రత్యేక ప్రచార, అవగాహన కార్యక్రమాలతో నాలుగేళ్ల డిగ్రీని ప్రోత్సహిస్తాం.
నాలుగేళ్ల డిగ్రీలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైతే పరిశోధనకు అర్హత సాధిస్తారు. ఇది కూడా విద్యార్థికి చాలా సమయాన్ని ఆదా చేస్తుంది.