Skip to main content

Teachers Day Special: బోధనలో వినూత్నం

Teachers Day Special
బోధనలో వినూత్నం

చేగుంట(తూప్రాన్‌): వల్లభాపూర్‌ ప్రాథమిక పాఠశాల ప్రనోపాధ్యాయుడు పరమేశ్వర్‌రెడ్డి విద్యార్థులకు వినూత్న రీతిలో బోధన చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. పరిసరాల విజ్ఞానం కోసం స్వయంగా పొలాల వద్దకు విద్యార్థులను తీసుకెళ్లి వరినాట్లు, కలుపు, కోతలపై అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాల ఆవరణలో కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేశారు. అందులో కూరగాయాలను పండించి మధ్యాహ్న భోజనంలో వాటిని ఉపయోగిస్తున్నారు. ఫ్లకార్డులు, అట్ట ముక్కలతో తయారు చేసిన బొమ్మలతో గణితం, తె లుగు పాఠాలు బోధిస్తున్నారు. ఈయన 2021లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.

పతకాలు కొల్లగొట్టాల్సిందే..

వెల్దుర్తి(తూప్రాన్‌): వెల్దుర్తి ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రతాప్‌సింగ్‌ రాథోడ్‌ ఆటల్లో కోచింగ్‌ ఇచ్చాడంటే విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాల్సిందే. పిల్లలలో నైపుణ్యాన్ని గుర్తించి వివిధ క్రీడల్లో శిక్షణ ఇస్తుంటాడు. కరాటేలో బ్లాక్‌బెల్ట్‌ హోల్డరైన ప్రతాప్‌సింగ్‌ కరాటే, జూడో తైక్వాండ్‌ వంటి క్రీడల్లో 3 వేల మందికి పై చిలుకు విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చారు. అందులో 11 మంది బ్లాక్‌ బెల్ట్‌, మరికొందరికి గ్రీన్‌, ఆరెంజ్‌ బెల్ట్‌లు సాధించారు. పీడీ సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది.
క్రీడల శిక్షణలో మేటి

కౌడిపల్లి(నర్సాపూర్‌): మండల పరిధిలోని వెల్మకన్న ఉన్నత పాఠశాలలో పనిచేసే పీఈటీ ఇప్ప రాజేందర్‌ కోచింగ్‌లో విద్యార్థులు సత్తాచాటుతున్నారు. బూరుగడ్డకు చెందిన పాఠశాల విద్యార్థిని తాటి పూజ షాట్‌పుట్‌, హైజెంప్‌లో రాష్టస్థాయి ప్రథమ బహుమతి సాధించి జాతీయ స్థాయిలో పాల్గొన్నారు. ఈమె జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సుమారు ఇరవైకిపైగా పతకాలు గెలిచింది. రన్నింగ్‌లో శ్రీనివాస్‌, నాగరాణి, సాయిరాం, భరత్‌, వెంకటేశం, నితిన్‌ రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొన్నారు. 18వ నేషనల్‌ జంబూరి క్యాంప్‌నకు సాయికుమార్‌, భరత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు ఎంపిక కాగా రాజస్థాన్‌లో పాల్గొన్నారు. రాజేందర్‌ సేవలకు గుర్తింపుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపకయ్యారు.
ఆంగ్ల బోధనతో మన్ననలు

చిన్నశంకరంపేట(మెదక్‌): చిన్నశంకరంపేట మండలం వెంకట్రావుపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ప్రమోద్‌ తనదైన శైలిలో ఆంగ్ల బోధన చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్‌ పాఠశాలలో చదివే విద్యార్థులు సైతం ప్రభుత్వ పాఠశాలలో చేరేవిధంగా తన బోధన సాగుతోంది. విద్యార్థుల సంఖ్య పడిపోయి పాఠశాల మూసివేత దిశ నుంచి నేడు 70 మంది విద్యార్థులు పాఠశాలలో చదువుకునేలా కృషి చేశాడు. గతేడాది పాఠశాల తనిఖీకి వచ్చిన అప్పటి డీఈఓ రమేష్‌ కుమార్‌ ప్రమోద్‌ పనితీరును ప్రశంసించారు. అంతేకాకుండా 2022లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసి సత్కరించారు.

విద్యాబోధన.. విహార యాత్ర..

రఘునాథపల్లి: మండలంలోని గబ్బెట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతూ హెచ్‌ఎం పరుపాటి జానకీదేవి ఆదర్శంగా నిలిచారు. నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరేలా బాట వేశారు. తల్లిదండ్రులను మెప్పించి వారిని బడిలో చేర్పించేందుకు ప్రత్యేక కృషి చేశారు. హెచ్‌ఎం ప్రత్యేక చొరవతో మండలంలోని ఏ పాఠశాలలో లేని విధంగా 109 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఏ ప్రాథమిక పాఠశాలలో లేని విధంగా 3వ తరగతి నుంచి హిందీ బోధన, అన్ని తరగతుల విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలతో పాటు ప్రైవేట్‌ పాఠశాల పుస్తకాలతో విద్యాబోధన, యేటా విద్యార్థులను విహార యాత్రలకు తీసుకెళ్తున్నారు. సర్పంచ్‌ రాజు, ఎంపీటీసీ శిరీష, ఎస్‌ఎంసీ చైర్మన్‌ శివప్రసాద్‌ సహకారంతో పాఠశాలను హరితమయం చేసి విద్యాభివృద్ధికి తోడ్పాటు నందిస్తున్నారు.

40 నుంచి 400 మంది విద్యార్థులు..

దంతాలపల్లి: మూసివేసే దశకు చేరిన పాఠశాలలో ప్రస్తుతం 400మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారంటే మాములు విషయంకాదు. పాఠశాలలో 40మందే ఉన్నారని, పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిని సవాల్‌గా తీసుకొని సహా ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థుల సంఖ్య పెంచామని కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు తండ రామస్వామి తెలిపారు. రామస్వామి 2000 నుంచి 2005వ సంవత్సరం వరకు నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో పిల్లలు లేరని పాఠశాలలను మూసివేస్తామని ఆదేశాలు వచ్చాయి. దీంతో హెచ్‌ఎం నారాయణరెడ్డి, ఉపాధ్యాయులు తేజానంతరెడ్డి, జీవన్‌కుమార్‌, రామకృష్ణ తదితర ఉపాధ్యాయుల సహకారంతో గ్రామాల్లో తిరిగి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం పొందేలా రామస్వామి కృషి చేశారు. దీంతో అనతికాలంలోనే పాఠశాలలో 400పైగా విద్యార్థులు చదువుతున్నారు.

ఆంగ్లంపై ఆసక్తి పెంచుకునేలా..

మహబూబాబాద్‌ రూరల్‌ : విద్యార్థుల్లో ఉన్న అంతర్గత నైపుణ్యాలు, వ్యక్తిగత, తరగతి గది సామర్థ్యాలను వెలికితీయడానికి మహబూబాబాద్‌ మండలం జిల్లెల్లగూడెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఆవునూరి రవి వినూత్నంగా కృత్యాధార బోధన చేపడుతున్నారు. ఆయన 12 సంవత్సరాలుగా లక్ష్మీపురం గ్రామంలోని ఆదివాసీ ప్రాంతం జిల్లెల్లగూడెంలో విధులు నిర్వర్తిస్తున్నారు. నేటి ప్రపంచంలో ఆదివాసీ విద్యార్థులు ఆంగ్లంపై ఆసక్తి పెంచుకునేలా కృత్యధార బోధన అవలంబిస్తున్నారు. పలు రకాల కృత్యాలు తయారు చేయడం.. వాటిని తరగతి గదిలో ప్రదర్శించడం.. విద్యార్థులతో స్వయంగా తయారు చేయించడం ఉపాధ్యాయుడు రవి ప్రత్యేకత. ఆయన రూపొందించిన అభ్యసన కృత్య సామగ్రి 2, 3 లెటర్‌ పదచక్రాలు, వ్యాఖ్యనిర్మాణ చక్రం, 0 నుంచి 999 వరకు నంబర్స్‌ వీల్‌, ఫ్రూట్స్‌, వెజిటెబుల్స్‌, జంతువుల చార్ట్స్‌ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.

ప్రయోగాత్మకంగా పాఠాల బోధన..

దుగ్గొండి: మండలంలోని నాచినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు వెలిదండి సమలత సాంకేతికతను జోడించి ప్రయోగాత్మకంగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. జీవశాస్త్రంలో ఉండే పాఠ్యాంశాలను బోధించడానికి స్వయంగా పర్చువల్‌ రియాల్టీ హెడ్‌సెట్‌ కొనుగోలు చేసి దాని ద్వారా విద్యార్థులకు మానవ శరీర అవయవాల గురించి వివరిస్తున్నారు. ప్రత్యేక యాప్‌తో సెల్‌ఫోన్‌ను అనుసంధానించి ప్రొజెక్టర్‌పై బొమ్మ చూపిస్తూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరిస్తున్నారు. విద్యార్థులతో అనేక ప్రాజెక్టులు తయారు చేయించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో బహుమతులు పొందేలా చేస్తుంది. విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి సైన్స్‌ డ్రామాలు వేయించడం, ఆకాశవాణి వరంగల్‌ కేంద్రంలో కదంబ కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల అభివృద్ధితో పాటు ప్రభుత్వ పాఠశాల ప్రగతి పథంలో పయనించడానికి పాటు పడుతున్నారు.

Published date : 05 Sep 2023 01:34PM

Photo Stories