భారత, విదేశీ విద్యా సంస్థల.. డ్యూయల్, జాయింట్ డిగ్రీలు
ఇందుకు అనుమతులు జారీ చేస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు యూజీసీ చైర్మన్ ఎం.జగదీశ్ కుమార్ వెల్లడించారు. ఇకపై 3.01 కనీస స్కోరుతో న్యాక్ (నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్) అక్రెడిటేషన్ ఉన్న, లేదా నేషనల్ ఇన్ స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ ఐఆర్‌ఎఫ్)లో టాప్ 100లో ఉన్న భారత విద్యా సంస్థలు టాప్ 500 విదేశీ విద్యా సంస్థలతో జట్టు కట్టవచ్చు. ఇందుకు యూజీసీ ముందస్తు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ‘‘ప్రస్తుతం భారత ఉన్నత విద్యా సంస్థల్లో 4 కోట్ల మంది విద్యార్థులున్నారు. ఈ సంఖ్య త్వరలో 10 కోట్లకు చేరుతుంది. యూజీసీ తాజా నిర్ణయం వల్ల వీరికి విదేశాల్లోని అత్యుత్తమ బోధన విధానాలు మరింతగా అందుబాటులోకి వస్తాయి’’ అని జగదీశ్ కుమార్ తెలిపారు. మన విద్యా సంస్థలకు అంతర్జాతీయంగా మెరుగైన ర్యాంకింగ్ లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన మార్గదర్శకాల ప్రకారం ట్వినింగ్ కోర్సులో భాగంగా భారత విద్యార్థులు తమ కోర్సులో కొంత ఇక్కడ, మరికొంత విదేశీ ఉన్నత విద్యా సంస్థలో పూర్తి చేయవచ్చు. జాయింట్ డిగ్రీ ప్రోగ్రాంలో సిలబస్‌ను భారత, విదేశీ విద్యా సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తాయి. డ్యూయల్ డిగ్రీ విద్యా ప్రణాళికను ఒకే సబ్జెక్టులో, ఒకే స్థాయిలో కలిసికట్టుగా రూపొందించి ఆఫర్ చేస్తాయి. ట్విన్నింగ్ కోర్సులో విదేశీ క్యాంపస్‌లో గడిపే గరిష్ట కాల పరిమితిని 30 శాతానికి పరిమితం చేశారు. డ్యూయల్, జాయింట్ ప్రోగ్రాంల కోసం విద్యార్థులు కోర్సు వ్యవధిలో కనీసం 30 శాతం సమయం విదేశీ వర్సిటీల్లో వెచి్చంచాలి. ఈ కోర్సుల పూర్తి మార్గదర్శకాలను యూజీసీ త్వరలో జారీ చేస్తుంది. దేశీయ, అంతర్జాతీయ ఉన్నత విద్యా సంస్థల మధ్య ఇలాంటి సహకారానికి 2016లో తొలిసారిగా అనుమతించినా పెద్దగా స్పందన రాలేదు. దాంతో సంబంధిత నియమ నిబంధనలను తాజాగా మరింతగా సడలించారు.
చదవండి:
ఏకకాలంలో రెండు డిగ్రీ, పీజీ కోర్సులు.. నష్టమా?.. లాభమా?
UGC – HRDC: మూడోస్థానంలో ‘మనూ’
UGC, AICTE & NMC: చైనా చదువులపై జాగ్రత్త.. అనుమతుల్లేని కోన్ని కోర్సులతో ఇబ్బందులు