Womens university: మహిళా వర్సిటీకి మెరుగులు
- కొత్త కోర్సులపై కసరత్తు
- ∙ఆనర్స్ కోర్సుల విస్తరణ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో 2022–23 విద్యాఏడాది నుంచి ప్రారంభంకానున్న మహిళా యూనివర్సిటీ విధివిధానాలపై ఉన్నత విద్యా మండలి కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులపై మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో కొత్త కోర్సుల రూపకల్పనపై ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ డి.రవీందర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆర్థిక శాస్త్రంలో ఆనర్స్ సహా, డేటా సైన్స్, పలు అంతర్జాతీయస్థాయి కోర్సులను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. దీనిపై మరో వారం రోజుల్లో స్పష్టత రానుంది. కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళా విశ్వవిద్యాలయంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించి, రూ.100 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో నిర్వహణ విధానం, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలపై సమగ్ర నివేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కోఠి ఉమెన్స్ కాలేజీ పరిధిలో ఉన్న అధ్యాపకులతో పాటు, కొత్త సిబ్బందినీ తాత్కాలిక విధానం లో తీసుకోవాలని భావిస్తున్నారు. ఇటీవలే ఉమెన్స్ కాలేజీలో బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ కోర్సును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
Also read: MBBS seats: ప్రభుత్వ కాలేజీల్లో 5,240 ఎంబీబీఎస్ సీట్లు
ఓయూ నుంచే సర్టిఫికెట్లు
కోఠి ఉమెన్స్ కాలేజీ ప్రస్తుతం ఉస్మానియా వర్సిటీ పరిధిలో పని చేస్తున్న నేపథ్యంలో.. 2021–22 విద్యా సంవత్సరంలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు పొందిన వారికి మాత్రం ఓయూ నుంచే సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. 2022–23 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందే వారికి మాత్రం కొత్తగా ఏర్పడే మహిళా విశ్వవిద్యాలయం పేరుతోనే డిగ్రీలు ఇస్తామని చెప్పారు.
Also read: KNRUHS: ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు వెబ్ కౌన్సెలింగ్