Bachelor Degree: ఒక కాలేజీలో చదువు.. మరో కాలేజీలో హాజరు
- డిగ్రీలో క్లస్టర్ విధానం అమలు
- ఏదైనా ఒక సబ్జెక్టు ఎక్కడైనా చదివే అవకాశం
- తొలిదశలో తొమ్మిది కళాశాలల మధ్య సమన్వయం
బ్యాచిలర్ డిగ్రీలో సరికొత్త విద్యా విధానాన్ని అమలు చేయనున్నారు. కొఠారీ కమిషన్, జాతీయ విద్యా విధానం సిఫార్సుల మేరకు క్లస్టర్ విధానానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రూపకల్పన చేసింది. ఏదైనా ఒక కాలేజీలో చదువుకునే విద్యార్థి మరో కాలేజీలో వేరే సబ్జెక్టు క్లాసులకు హాజరయ్యే వెసులు బాటును ఇది కల్పిస్తుంది. దీనిపై కోఠి ఉమెన్స్ కాలేజీలో సెప్టెంబర్ 21న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఆధునిక విద్యావిధానం కోరుకునే విద్యార్థులకు క్లస్టర్ విధానం చక్కటి అవకాశమని అధికారులు తెలిపారు. ప్రత్యక్ష, పరోక్ష (ఆన్‌లైన్) చదువుకూ వీలుంటుందన్నారు. తొలి దశలో తొమ్మిది కాలేజీల మధ్య సమన్వయం తీసుకొస్తున్నారు. కోఠి ఉమెన్స్ కాలేజీ, సిటీ కాలేజ్, రెడ్డి ఉమెన్స్, సెయింట్ ఆన్స్, సెయింట్ ఫ్రాన్సిస్, భవన్స్, లయోలా, బేగంపేట ఉమెన్స్ కాలేజ్, నిజాం కాలేజీలు ఈ జాబితాలో ఉన్నాయి.
త్వరలో మార్గదర్శకాలు
కళాశాలల్లోని ఫ్యాకల్టీ, లేబొరేటరీ, లైబ్రరీ, రీసెర్చ్ తదితర అంశాల్లో ప్రత్యేకతలను పరిగణనలోకి తీసుకుని వాటిలో ఎక్కడైనా విద్యార్థులు ఒక సబ్జెక్టును చదవచ్చు. దానికి సంబంధించిన పరీక్ష అదే కాలేజీలో నిర్వహించి, మార్కులు మాతృ కాలేజీకి పంపుతారు. తొమ్మిది కాలేజీల్లో ఒకే రకమైన పాఠ్య ప్రణాళిక, పరీక్ష విధానం, అడ్మిషన్ ప్రక్రియ ఉంటుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు.
ఈ ఉమ్మడి ఎజెండాకు అనుగుణంగా తొమ్మిది కాలేజీలు అవగాహన ఒప్పందానికి వస్తాయని, పరస్పర సమన్వయంతో ముందుకెళ్తాయని వివరించారు. దీనిపై త్వరలో మరోసారి సమీక్షించి, అవసరమైన మార్గదర్శకాలు అందుబాటులోకి తెస్తామని లింబాద్రి చెప్పారు.
Degree Colleges: రాజకీయ ప్రముఖులు, మాజీ ఐఏఎస్‌లతో విద్యార్థులకు పాఠాలు