Skip to main content

NTA: మహిళా కోటాపై ఐఐటీలకే అధికారం: ఎన్ టీఏ

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లోని వివిధ కోర్సుల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక సీట్ల కేటాయింపు 2021 విద్యాసంవత్సరం నుంచి మారనుంది.
NTA
మహిళా కోటాపై ఐఐటీలకే అధికారం: ఎన్ టీఏ

ఇప్పటివరకు అన్ని ఐఐటీల్లోని సీట్లకు అదనంగా 20 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తూ వచ్చారు. 2021 సంవత్సరం నుండి ఈ విధానాన్ని తొలగించి జేఈఈ అడ్వాన్స్ డ్లో అర్హత సాధించిన మహిళల సంఖ్యను అనుసరించి ఆయా ఐఐటీలే 20 శాతం కోటా సీట్లను నిర్ణయించుకునేలా కొత్త విధానాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) ఇటీవల ఈ మార్పులను ప్రకటించింది. అర్హులైన మహిళా అభ్యర్థుల అందుబాటును అనుసరించి సూపర్ న్యూమరరీ సీట్లు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఆయా ఐఐటీలకు కల్పించింది. ఐఐటీల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఐఐటీల్లో వారి ప్రాతినిధ్యం పెంచేందుకు 2018 నుంచి కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఐఐటీల్లోని మొత్తం సీట్లకు అదనంగా మరికొన్ని సీట్లను సూపర్ న్యూమరరీ కోటాలో కేవలం మహిళలకు కేటాయించేలా అదనపు సీట్లను ఏర్పాటు చేయించింది. 2018–19లో 14 శాతం సీట్లను ఇలా కేటాయించగా, 2019–20లో ఈ సంఖ్యను 17 శాతానికి పెంచింది. 2020–21లో దీనిని 20 శాతం చేసింది. ఇక 2021–22 సంవత్సరానికి వచ్చేసరికి ఈ కొత్త మార్పును తీసుకువచ్చింది. ఆయా ఐఐటీలే ఈ 20 శాతం కోటాపై నిర్ణయం తీసుకునేలా చేసింది. గత ఏడాది కరోనా వల్ల జేఈఈ మెయిన్ లో అర్హులైన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్ డ్ను రాయలేకపోయారు. వారికి ఈసారి జేఈఈ అడ్వాన్స్ డ్ను నేరుగా రాసుకునే అవకాశాన్ని ఎన్ టీఏ కల్పించింది. వీరు గత ఏడాది జేఈఈ మెయిన్ అర్హతతోనే ఈ అడ్వాన్స్ డ్ను రాసే అవకాశం వచ్చింది. ఈ విద్యా సంవత్సరం జేఈఈ మెయిన్ నుంచి జేఈఈ అడ్వాన్స్ డ్కు అర్హత సాధించిన 2.50 లక్షల మందికి వీరు అదనం. ఈ కారణంగానే మహిళలకు సూపర్ న్యూమరరీ సీట్ల కేటాయింపును ఆయా ఐఐటీలకు అర్హత సాధించే మహిళల సంఖ్యను అనుసరించి నిర్ణయం తీసుకునేలా కొత్త మార్పు చేశారు. గత ఏడాదిలో అర్హులైన మహిళలు లేకపోవడం వల్ల పలు ఐఐటీల్లో సూపర్ న్యూమరరీ కోటా సీట్లు పూర్తిగా భర్తీకి నోచుకోలేదు. కొన్ని ఐఐటీల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నా సూపర్ న్యూమరరీ కోటాను అనుసరించి సీట్లకేటాయింపు చేశారు. ఈనేపథ్యంలో అర్హులైన మహిళా అభ్యర్థుల సంఖ్యను అనుసరించి ఆయా ఐఐటీలే నిర్ణయం తీసుకునేలా ఈసారి మార్పులు చేశారు.

టాప్ 100 అభ్యర్థులకు పూర్తి రాయితీ

జేఈఈ అడ్వాన్స్ డ్లో మెరిట్ సాధించిన వారిలో మొదటి 100 మంది ఆల్ ఇండియా ర్యాంకర్లు తమ ఐఐటీలో చదువులు పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని స్కాలర్షిప్ కింద అందించేందుకు ఐఐటీ ఖరగ్పూర్ నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు వెల్లడించింది. ఏడాదికి రూ.20 లక్షలలోపు ఆదాయం ఉన్న కుటుంబాల్లోని విద్యార్థులు ఫుల్ స్కాలర్షిప్నకు అర్హులని వివరించింది. ‘పండిట్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఫుల్ స్కాలర్షిప్ ఫర్ టాప్ 100 జేఈఈ ర్యాంకర్స్’ పేరిట అందించనుంది. దీనికింద ఇనిస్టిట్యూషన్ ఫీజు, వసతి భోజన ఖర్చులు, పాఠ్యపుస్తకాలు, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ప్రయాణ ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులతో పాటు ఇతర వ్యయాలను కూడా ఐఐటీయే భరిస్తుంది. వీటితోపాటు ప్రతినెలా పాకెట్ మనీ కూడా అందిస్తుంది.

చదవండి:

జేఈఈ అడ్వాన్స్ డ్‌ ప్రాథమిక కీ, ఫలితాల వివరాలు..

జేఈఈ అడ్వాన్స్ డ్‌ ప్రాథమిక కీ, ఫలితాల వివరాలు..

Published date : 04 Oct 2021 03:34PM

Tags

Photo Stories