Skip to main content

APSCHE: ఎస్కేయూ వీసీగా హుస్సేన్‌రెడ్డి

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన వీసీగా ప్రొఫెసర్‌ కె.హుస్సేన్‌రెడ్డి నియమితులయ్యారు.
Hussain Reddy as SKU VC

చాన్సలర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఎంపిక మేరకు రాష్ట్ర ఉన్నత విద్య ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జె.శ్యామలరావు జ‌నవ‌రి 17న‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే యూనివర్సిటీలోనే కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా హుస్సేన్‌రెడ్డి పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. అంకితభావంతో విధులు నిర్వర్తించే గుణం, సమయస్ఫూర్తి, అందరితో సత్సంబంధాలు కలిగి ఉండడం, స్నేహపూర్వకంగా ఉండే మనస్తత్వం, వివాదరహితుడిగా గుర్తింపు పొందడంతో రాష్ట్ర ప్రభుత్వం హుస్సేన్‌రెడ్డిని వీసీగా ఎంపిక చేసింది.

చదవండి: RUSA: ఎస్కేయూ ప్రగతికి భరూసా

32 సంవత్సరాల బోధనానుభవం, 37 సంవత్సరాల విశిష్టమైన పరిశోధనానుభవం ఉంది. 28 మంది పీహెచ్‌డీ విద్యార్థులు ఈయన పర్యవేక్షణలో డాక్టరేట్‌ పొందారు. ఇన్‌ ఆర్గానిక్‌, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీలో నిష్ణాతులుగా ఖ్యాతి గడించారు. పేరెన్నికగల బహుళజాతి ఫార్మా కంపెనీలకు చెందిన ప్రముఖులు ప్రొఫెసర్‌ హుస్సేన్‌రెడ్డి వద్ద ఇండస్ట్రియల్‌ కోటాలో పీహెచ్‌డీ చేశారు. 6 మేజర్‌, 1 మైనర్‌ రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌లు నిర్వహించారు. 175 అంతర్జాతీయ జర్నల్స్‌ ప్రచురించారు. 60 పరిశోధనా వ్యాసాలు రాశారు. ఎస్కేయూలో 5 జాతీయ సదస్సులు నిర్వహించారు.

బాధ్యతల స్వీకరణ

ఎస్కేయూ వీసీగా నియమితులైన ప్రొఫెసర్‌ కె.హుస్సేన్‌రెడ్డి జ‌నవ‌రి 17న‌ సాయంత్రం అంబేడ్కర్‌ పాలక భవనంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ ఎంవీ లక్ష్మయ్య అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ వి.రఘునాథ్‌రెడ్డి, ఆంటియా వర్కింగ్‌ మాజీ ప్రెసిడెంట్‌ పురుషోత్తం రెడ్డి, నాగభూషణం, సురేష్‌ రెడ్డి, యోగానందరెడ్డి, వైఎస్సార్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ లింగారెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
 

Published date : 18 Jan 2024 03:34PM

Photo Stories