Skip to main content

TSCHE: డిగ్రీ కోర్సుల్లో అమ్మాయిలదే హవా.. కోర్సుల వారీగా చేరికలు ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ కోర్సుల్లో అమ్మాయిల శాతం పెరుగుతోంది. 2022 ‘DOST’ నియామకాలను పరిశీలిస్తే అబ్బాయిల సంఖ్యను మించిపోయారు.
TSCHE
డిగ్రీ కోర్సుల్లో అమ్మాయిలదే హవా.. కోర్సుల వారీగా చేరికలు ఇలా..

రాష్ట్రవ్యాప్తంగా 4.60 లక్షల డిగ్రీ సీట్లు ఉండగా ‘దోస్త్‌’ద్వారా 1,90,578 సీట్లు భర్తీ అయ్యాయి. ఇందులో 90,534 (47.50 శాతం) మంది బాలురు చేరితే, 1,00,044 (52.50 శాతం) మంది బాలికలు వివిధ రకాల డిగ్రీ కోర్సులో ప్రవేశాలు పొందారు. అయితే బీకాం, బీఏ కోర్సుల్లో బాలికలకన్నా బాలుర శాతమే ఎక్కువగా ఉండగా సైన్స్‌ గ్రూపుల్లో మాత్రం బాలురకన్నా బాలికలే ఎక్కువగా ఉన్నారు. భవిష్యత్తులో డిగ్రీ కోర్సుల్లో అమ్మాయిల శాతం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

చదవండి: TSCHE: దోస్త్‌ ద్వారా భర్తీ అయిన డిగ్రీ సీట్ల వివరాలు.. సంప్రదాయ కోర్సులకు తగ్గుతున్న ఆదరణ

ఉపాధి వైపు అబ్బాయిలు.. 


కోవిడ్‌ తర్వాత 50 శాతం మంది అబ్బాయిల్లో గ్రాడ్యుయేషన్‌ తర్వాత కుటుంబ బాధ్యతల్లోకి వెళ్లక తప్పడం లేదని సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) అధ్యయనంలో వెల్లడైంది. రెండేళ్లుగా వెంబడిస్తున్న ఆర్థిక ఒడుదుడుకులే ఈ పరిస్థితికి కారణంగా సెస్‌ పేర్కొంది. దీనికి అనుగుణంగానే ఇంటర్‌ తర్వాత ఉపాధి కోర్సులను విద్యార్థులు ఎంచుకుంటున్నారు. పీజీ చేయాలనే ఆలోచన కొందరికి మాత్రమే ఉంటోంది. ఇంటర్‌ తర్వాత ఇంజనీరింగ్‌ లేదా సాధారణ డిగ్రీ కోర్సుల్లో చేరడం ద్వారా తక్షణ ఉపాధి పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా కామర్స్‌లో 54.45 శాతం బాలురు చేరారు. బీఏలో కంప్యూటర్‌ అనుబంధ కోర్సుల కాంబినేషన్‌ రావడవంతో ఈ కోర్సులో 60.84 శాతం మంది చేరారు. మేనేజ్‌మెంట్‌ కోర్సులైన బీబీఏ, బీబీఎంలో 56.54 శాతం మంది చేరారు. వాణిజ్యరంగం పెరగడం, కామర్స్‌ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు విస్తృతమవ్వడంతో ఈ కోర్సును ఎంచుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

చదవండి: Navin Mittal: ఈ కాలేజీలో డిగ్రీ విద్యార్థినులకు హాస్టల్‌ సదుపాయం

అమ్మాయిల లక్ష్యం పీజీ.. 

గత రెండేళ్లుగా పీజీ కోర్సుల్లో చేరుతున్న అమ్మాయిల శాతం పెరిగింది. కోవిడ్‌ కాలం నుంచి డిగ్రీలను ఎంపిక చేసుకోవడంలోనూ ఇదే విధానం వారిలో కనిపిస్తోంది. డిగ్రీతోనే ఉపాధి వైపు వెళ్లడానికి అమ్మాయిలు ఇష్టపడటం లేదని సెస్‌ సర్వేలో తేలింది. దీంతో పీజీ తర్వాత పోటీ పరీక్షలు రాయడం లేదా పరిశోధనల వరకూ వెళ్లే ఆలోచనలతోనే అమ్మాయిలు అందుకు తగ్గ డిగ్రీ కోర్సులను ఎంచుకుంటున్నారు. ఈ ఏడాది ‘దోస్త్‌’ప్రవేశాల్లో బీకాం, బీఏ కోర్సులకన్నా, బీఎస్సీ (లైబ్రరీ సైన్స్‌), సాధారణ బీఎస్సీ కోర్సుల్లో అమ్మాయిల ప్రవేశాలు ఎక్కువగా ఉన్నాయి. మేనేజ్‌మెంట్‌ కోర్సుల వైపు అమ్మాయిలు పెద్దగా వెళ్లకపోవడం గమనార్హం. 

చదవండి: Best Certification Courses: సర్టిఫికేషన్స్‌తో.. కెరీర్‌ షైన్‌!

అవకాశాలు పెరగడమే కారణం.. 
టెన్త్, ఇంటర్‌ దశ నుంచే అమ్మాయిలకు గురుకులాలు పెరగడం, ఉన్నతవిద్యను అందించాలనే అవగాహన తల్లిదండ్రుల్లోనూ పెరగడం వల్ల ఉన్నతవిద్యలో అమ్మాయిల ప్రవేశాలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో వారి శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. 
– ప్రొఫెసర్‌ ఆర్‌. లింబాద్రి, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌

Published date : 15 Nov 2022 02:54PM

Photo Stories