Foreign Languages Free Coaching : ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హలో.. బోంజో.. ఓలా.. అర్థం కాలేదా..? అయితే ఈ స్టోరీ చదవండి..
కాకపోతే.. ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో.. ఒక్క మనోజ్, రాంచరణే కాదు.. ఆ బడిలో చాలా మంది ఫ్రెంచ్, స్పానిష్ భాషలను నేర్చుకుంటున్నారు. స్పోకెన్ ఇంగ్లిష్‌లో పట్టు సాధిస్తున్నారు.. పోటీ ప్రపంచంలో రాణించేందుకు తమను తాము సంసిద్ధం చేసుకుంటున్నారు.
మంత్రి హరీశ్‌రావు చొరవతో..
ఇందిరానగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను హైదరాబాద్‌కు చెందిన ఇఫ్లూ (ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్) యూనివర్సిటీ దత్తత తీసుకుంది. మంత్రి హరీశ్‌రావు చొరవతో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్ , ఫ్రెంచ్, స్పానిష్ భాషలు నేర్పిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం 9వ తరగతిలో 160 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారిలో 100మందికి ఇంగ్లిష్ , 30 మందికి ఫ్రెంచ్, 30 మందికి స్పానిష్ నేర్పిస్తున్నారు.
ఇదే మొదటిసారి..
ఓ యూనివర్సిటీ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని విద్యాబోధన చేయడం ఇదే మొదటిసారి. ఫిబ్రవరి 27న తరగతులను ప్రారంభించారు. ఇంగ్లిష్ , ఫ్రెంచ్, స్పానిష్ భాషలు నే ర్పి ంచారు. వారంలో రెండు రోజులు (గురు, శుక్రవారాలు) ఆన్‌లైన్, ఒకరోజు ( శనివారం) ప్రత్యక్షంగా ప్రొఫెసర్లు బోధన చేశారు. ఇలా నాలుగు వారాలపాటు బోధించారు. ఇంగ్లిష్ లో భాగంగా ఉచ్ఛారణ, సంభాషణ, గ్రూప్ డిస్కషన్, ప్రజెంటేషన్‌పై అవగాహన కల్పించారు. ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో పలకరించడం, సెల్ఫ్ ఇంట్రడక్షన్, సింపుల్ కన్వర్జేషన్ నే ర్పించారు.
సర్టిఫికెట్లు కూడా..
మార్చి 28న హైదరాబాద్‌లోని ఇఫ్లూ యూనివర్సిటీకి 160 మంది విద్యార్థులను తీసుకెళ్లారు. విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలు, విద్యాబోధన తీరు ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. ఇతర దేశాలకు చెందిన విద్యార్థులతో ఇంగ్లిష్ , ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో ముచ్చటించారు. శిక్షణ పొందిన విద్యార్థులకు ఏప్రిల్ 16న మంత్రి హరీశ్‌రావు, యూనివర్సిటీ వీసీ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో కూడా ఆయా భాషల బోధనకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి ఏడాదంతా బోధించనున్నారు.
ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే రెండో భాష ఇదే..
నేను స్పానిష్ నేర్చుకుంటున్నా. నాకు ఒక అడ్వంచర్‌లా అనిపిస్తుంది. యూనివర్సిటీకి వెళ్లినప్పుడు అక్కడి స్టూడెంట్‌తో నేను స్వయంగా స్పానిష్‌లో మాట్లాడాను. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే రెండో భాష స్పానిష్ నేర్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేర్చుకోవాలని ఉంది. పూర్తిగా గలగలా స్పానిష్‌లో మాట్లాడాలి. ఉన్నత విద్య కోసం స్పెయిన్‌కు వెళ్లినా నాకు అక్కడి భాషతో ఇక ఇబ్బంది ఉండదు.
–రాంచరణ్, 9వ తరగతి
ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాం..
ఇంగ్లిష్ లో ఇన్‌ఫార్మల్ టు ఫార్మల్ ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాం. గ్రూప్ డిస్కషన్, ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకున్నాం. ఇఫ్లూ వర్సిటీ వారు మాకు ఇంగ్లిష్ నే ర్పి ంచడం చాలా లక్కీగా ఫీలవుతున్నాం. ఇతర విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లలో డబ్బులు పెట్టినా విదేశీ భాషలు నేర్చుకోలేరు అదే మా హరీశ్‌రావు సార్ కృషితో మా స్కూల్‌లోనే వాటిని నేర్చుకుంటున్నాం.
–అప్ష, ఐమన్, తనీమ్, 9వ తరగతి విద్యార్థులు
మాట్లాడటంతోపాటు అర్థం చేసుకోగలుగుతున్నా..
ఫ్రెంచ్ భాషను ఇంట్రస్ట్‌గా నేర్చుకుంటున్నా.ఇఫ్లూ క్యాంపస్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఫ్రెంచ్ విద్యార్థులతో మాట్లాడాను. ఫ్రెంచ్ మాట్లాడటంతోపాటు అర్థం చేసుకోగలుగుతున్నా. పదో తరగతిలోనూ ఇంకొంచెం ఫ్రెంచ్ భాషను నేర్చుకోవాలని ఉంది.
–మనోజ్,9వ తరగతి