Skip to main content

Stock Market Frauds: యువత అలెర్టుగా ఉండాలి... సోషల్‌ మీడియాలో ‘ట్రెండింగ్‌ మోసం’ ఇదే!

బి.ఫార్మసీ పూర్తి చేసి.. విదేశాల్లో ఎం.ఫార్మసీ చదివేందుకు సిద్ధపడుతున్న మైలవరానికి చెందిన ఓ యువతి తాజాగా సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడింది. ‘ట్రేడింగ్‌తో ఇంట్లో కూర్చునే ప్రతి రోజూ రూ.లక్షలు సంపాదించవచ్చు’ అంటూ ఫేస్‌బుక్‌లో వచ్చిన పోస్ట్‌కు ఆకర్షితురాలై వెంటనే అందులోని నంబర్‌ను సంప్రదించింది. ఆ పోస్ట్‌ పెట్టిన కుషిశర్మ అనే యువతితో వాట్సాప్‌లో చాటింగ్‌ మొదలెట్టింది. కుషిశర్మ మాటలు నమ్మి ముందుగా రూ. 1,050 పంపింది. కొద్ది నిమిషాల్లోనే.. ‘మీ పెట్టుబడితో కొన్ని షేర్లు విపరీతంగా పెరిగాయని.. దీని నిమిత్తం మీరు రూ. 40 వేలు సంపాదించారని’ వాట్సాప్‌కు మెసేజ్‌ వచ్చింది. వ్యాలెట్‌ను చెక్‌ చేసుకుని సంభ్రమాశ్చర్యానికి గురైంది. వ్యాలెట్‌లోని నగదు విత్‌డ్రా కావాలంటే రూ.7 వేలు సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాలని చెప్పడంతో ఆ విధంగా చేసింది. రూ.7 వేలు డిపాజిట్‌ చేయగానే వ్యాలెట్‌లో నగదు ఒక్క సారిగా రూ. 90 వేలు అయింది. ఆ డబ్బులు తీసుకోవాలంటే మళ్లీ రూ. 11 వేలు డిపాజిట్‌ చేయాలని కుషిశర్మ చెప్పడంతో తిరిగి అదేవిధంగా చేసింది. ఈ విధంగా జ‌న‌వ‌రి 13 నుంచి 16వ తేదీ వరకు రూ. 4.50 లక్షలు చెల్లించింది. ఎంతకూ డబ్బులు విత్‌ డ్రా కాకపోవడంతో మోసపోయానని గ్రహించి విజయవాడ సైబర్‌ పోలీసులను ఆశ్రయించింది.
Fake news on Social Media   Beware of Cyber Fraud: Scam Alert    Social Media Alert

విజయవాడస్పోర్ట్స్‌: ‘ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ద్వారా టాటా, రిలయన్స్‌, ఆదానీ కంపెనీల్లో షేర్లు కొనుగోలు చేసి.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందండి’ అనే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా పోస్ట్‌లతో ప్రజలకు సైబర్‌ నేరగాళ్లు వల విసురుతున్నారు. కేవలం గంటల వ్యవధిలోనే రూ.లక్షలు సంపాదించవచ్చంటూ ముగ్గులోకి దింపుతున్నారు. దీని కోసం డీమ్యాట్‌ అకౌంట్‌ అవసరం లేదని, పెద్దపెద్ద కంపెనీల్లో షేర్లు కొంటే నిత్యం ఆదాయం వస్తుందని, ఇంట్లో కూర్చునే లక్షలు సంపాదించవచ్చంటూ నమ్మిస్తున్నారు.

చదవండి: IIT Placement 2024: రూ.కోటి కంటే ఎక్కువ జీతం.. 85 మంది సెలెక్ట్‌.. ఈ జాబ్స్ ఎక్క‌డంటే..!

ఇలా మోసం..

తమ వలలోకి వచ్చిన వారిని నేరగాళ్లు స్వతహాగా ప్రోగ్రామింగ్‌ చేసుకున్న వ్యాలెట్‌లోకి తీసుకెళ్తున్నారు. నగదు వ్యాలెట్‌లో కనిపిస్తుందని చెబుతున్నారు. అయితే షేర్లు కొనుగోలు నిమిత్తం చెల్లించే నగదు వ్యాలెట్‌లో కాకుండా వారి యుపీఐ యాప్‌(ఫోన్‌ పే, గూగుపే, పేటీఎం)లకు బదిలీ చేయమని సూచిస్తున్నారు.

నగదు చెల్లించిన కొద్ది నిమిషాల్లోనే వ్యాలెట్‌లో నగదు పెంచేస్తున్నారు. అయితే వ్యాలెట్‌లో నగదు విత్‌డ్రా చేసుకోవాలంటే మరి కొంత డిపాజిట్‌ చేయాలని ఒకసారి, సెక్యూరిటీ కోసం కొంత చెల్లించాలని మరో సారి, కమీషన్‌ చెల్లించాలని, వ్యాలెట్‌లో టెక్నాలజీ సమస్య వచ్చిందని.. సమస్య పరిష్కారం కోసం కొంత చెల్లించాలని, మీ ఐటీ రిటర్న్స్‌ సరిగ్గా లేవని, ఇన్‌కం ట్యాక్స్‌ పడుతుందని, టీడీఎస్‌ కట్‌ అవుతుందని.. ఈ సమస్యలు పరిష్కరించాలంటే కొంత చెల్లించాలని చెబుతూ నగదు లాగేస్తున్నారు.

చదవండి: Securities Transaction Tax: సెక్యూరిటీ లావాదేవీలపై పన్ను పెంపు

ఎన్టీఆర్‌ జిల్లాలో మూడు ఘటనలు..

ట్రేడింగ్‌ పేరుతో మోసం చేసే సైబర్‌ ట్రెండ్‌ ప్రస్తుతం కొనసాగుతోంది. గడిచిన వారం రోజుల్లో ఈ తరహా ఘటనల్లో మోస పోయిన యువకులు విజయవాడ సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయిస్తున్నారు. విజయవాడలో ఇద్దరు, మైలవరంలో ఒక్కరూ ఈ తరహా మోసానికి గురయ్యారని పోలీసులు చెబుతున్నారు.

ఫిర్యాదులు ఒక్కొక్కరూ రూ. 4 లక్షలకు పైబడి నష్టపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే సోషల్‌ మీడియా వేదికలపై ప్రస్తుతం ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌పై ప్రకటనలు అత్యధికంగా వస్తున్న నేపథ్యంలో జిల్లాలో బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ట్రేడింగ్‌పై అవగాహన లేకపోతే నష్టాలే..

నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ), నిఫ్టీ, బాంబే స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్‌ అయిన కంపెనీల నుంచి స్టాక్స్‌ కొనుగోలు చేసి ట్రేడింగ్‌ చేయడం న్యాయబద్ధమే. డీమ్యాట్‌ అకౌంట్‌ సాయంతో స్టాక్స్‌ను ఎవరైనా కొనుగోలు/విక్రయాలు చేయోచ్చు. సిప్‌(సిస్ట మ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) ద్వారా ట్రేడింగ్‌ చేసుకుంటే రిస్క్‌ తక్కువగా ఉంటుంది. స్టాక్‌ మార్కెట్‌పై అవగాహనతో మాత్రమే దీనిలోకి దిగాలి. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో అత్యధికులు ఈ తరహా వ్యాపారంలోకి దిగడాన్ని సైబర్‌ నేరగాళ్లు పసిగట్టారు. ట్రేడింగ్‌ పేరుతో రకరకాల యాప్స్‌, వెబ్‌సైట్‌లు ప్రోగ్రామింగ్‌ చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నారు.

అవగాహన కలిగి ఉండాలి..

సైబర్‌ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రాంలలో వచ్చే ప్రకటనలు చూసి మోసపోవద్దు. తక్కువ సమయంలో సులువుగా డబ్బులు వస్తాయని వచ్చే ప్రకటనలు అస్సలు నమ్మొద్దు. అత్యాస ఉన్న వ్యక్తులే అత్యధికంగా సైబర్‌ నేరాల్లో బాధితులుగా ఉంటున్నారు. సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలి. ట్రేడింగ్‌ పేరుతో జరిగిన మోసాలపై 419, 520,66(డి) ఐటీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశాం.
– కోమాకుల శివాజి, సీఐ, సైబర్‌ క్రైం, విజయవాడ

Published date : 03 Feb 2024 11:31AM

Photo Stories