Vizianagaram District Collector: విద్యార్థుల వివరాల నమోదు తప్పనిసరి
విజయనగరం అర్బన్: గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో కింద విద్యార్థుల వివరాల నమోదును శతశాతం పూర్తిచేయాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. 2005–2018 మధ్యన జన్మించిన వారందరి వివరాల నమోదు సర్వేను రెండు రోజుల్లోగా పూర్తిచేయాలన్నారు. 6వ తరగతి నుంచి 7వ తరగతికి, 10వ తరగతి నుంచి 11వ తరగతిలో విద్యార్థులు చేరేలా ఎంఈఓలు, హెచ్‌ఎంలు బాధ్యత వహించాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఎక్కడ చదువుతున్నది చైల్డ్ ఇన్ఫోలో అప్లోడ్ చేయాలన్నారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంఈఓలు, మండల ప్రత్యేకాధికారులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. జగనన్న సురక్ష, గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో, గడపగడపకు మన ప్రభుత్వం, జగనన్నకు చెబుదాం వినతుల పరిష్కారం, సంక్రమిత వ్యాధుల నివారణ, ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలపై మండలాల వారీగా సమీక్షించారు. గడపగడపకు మన ప్రభుత్వం కింద మంజూరు చేసిన పనులన్నీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ప్రారంభం కాని పనులు వెంటనే ప్రారంభించాలని, వివిధ దశల్లో ఉన్నవి పూర్తిచేసి, బిల్లులు అప్‌లోడ్ చేయాలని సూచించారు. సెప్టెంబర్ 15లోగా నిర్మాణాలన్నీ పూర్తి చేయాలన్నారు. జగనన్న సురక్షలో 11 రకాల సేవలను ఉచితంగా అందించాలని సూచించారు. వర్షాకాలం ఆరంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. డ్రైడేపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఫీవర్ సర్వే కచ్చితంగా జరగాలన్నారు. పీహెచ్‌సీల్లో అత్యవసర మందులన్నీ అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ గణపతిరావు, జేసీ మయూర్ అశోక్, సీపీఓ బాలాజీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
22 నుంచి అభివృద్ధి పనులపై సమీక్ష
జిల్లాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను మరింత వేగవంతంగా పూర్తిచేసేందుకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న పనులపై సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలో జూలై 22 నుంచి నియోజకవర్గ స్థాయి సమీక్షలకు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు షెడ్యూల్ ఖరారు చేసినట్ట కలెక్టర్ నాగలక్ష్మి ప్రకటించారు.
కలెక్టర్ నాగలక్ష్మి ప్రజలు సంతృప్తి చెందేలా సమస్యల పరిష్కారం షెడ్యూల్ ఇలా..
జూలై 22న విజయనగరం, ఆగస్టు 5న రాజాం, 19న బొబ్బిలి, 26న గజపతినగరం నియోజకవర్గాల సమీక్షలు జరుగుతాయి. – సెప్టెంబర్ 16న ఎస్.కోట, 23న చీపురుపల్లి, సాలూరులోని మెంటాడ మండలాలకు, 30న నెల్లిమర్ల నియోజకవర్గ సమీక్ష సమావేశాలు ఉదయం 10.30 గంటల నుంచి కలెక్టర్ కార్యాలయంలో జరగనున్నవి.
వ్యవసాయం, నీటిపారుదల (నిర్మాణంలోని సాగునీటి ప్రాజెక్టులు), వైద్య ఆరోగ్య, విద్యాశాఖలో నాడు–నేడు పనులు, ఫ్యామిలీ డాక్టర్ విధానం, గృహనిర్మాణం, ఉపాధి నిధులతో కన్వర్జెన్స్ పనులు, గడప గడపకు మన ప్రభుత్వం, ఆయా నియోజకవర్గాల్లోని ఇతర సమస్యలపై సమావేశాల్లో సమీక్షిస్తారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రితో పాటు, మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే, జిల్లా అధికారులు, నియోజకవర్గ స్థాయి అధికారులు సమావేశాల్లో పాల్గొంటారు.