Sarah Kirlew: భారత్, ఆస్ట్రేలియాల మధ్య విద్యావకాశాలు పుష్కలం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని ఆమె అక్టోబర్ 31న సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సారా కిర్లూ ప్రసంగిస్తూ భారత్– ఆస్ట్రేలియా దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉంటుందని చెప్పారు. భారతదేశం లాగానే ఆస్ట్రేలియా కూడా భిన్న సంస్కృతులు గలిగిన దేశమని వివరించారు. ఆస్ట్రేలియా కూడా వలస దేశమేనని, ఇండో– పసిఫిక్ దేశాలను భారత్, ఆస్ట్రేలియాలు కలుపుతున్నాయిని పేర్కొన్నారు. భారత్, ఆస్ట్రేలియల మధ్య విద్య, పర్యాటకరంగానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు.
ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు పెద్ద ఎత్తున ఎగుమతులు జరుగుతున్నట్లు చెప్పారు. ఆస్ట్రేలియాలో స్థిరపడుతున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రపంచంలో మొదటి వంద విశ్వ విద్యాలయాల్లో ఆస్ట్రేలియా నుంచి ఏడు ఉన్నాయని, దాదాపుగా ఒక లక్ష మంది భారతీయులు ఆస్ట్రేలియాకు చదువు కోసం వస్తున్నారని ఆమె వెల్లడించారు.
చదవండి: Study abroad: కెనడా కాలేజీలు, వర్సిటీలకు భారత విద్యార్థుల అవసరమే ఎక్కువ!
ఆస్ట్రేలియాలో చదువు కోసం వచ్చే వారికి తమ దేశం చాలా ఫెలోషిప్‌లు, స్కాలర్ షిప్‌లు ఇస్తోందని తెలిపారు. నాగార్జున యూనివర్సిటీలో సెంటర్ ఫర్ ఆస్ట్రేలియన్ స్టడీస్‌లో జరుగుతున్న పరిశోధనలపై సంతృప్తి వ్యక్తం చేశారు. వీసీ ఆచార్య పి.రాజశేఖర్ ప్రసంగిస్తూ ఆస్ట్రేలియన్ స్టడీస్ సెంటర్ ఆధ్వర్యంలో విద్య, పరిశోధన అంశాలకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. రెండు దేశాల మధ్య అనేక అంశాలు ఒకే విధంగా ఉంటాయని వాటిని క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ఏఎన్‌యూలో సెంటర్ ఫర్ ఆస్ట్రేలియన్ స్టడీస్ 2020లో ప్రారంభించామని అప్పటి ఆస్ట్రేలియన్ కౌన్సిల్ నుంచి వచ్చిన ప్రతినిధి ఈ సెంటర్ కు అనేక ప్రోత్సాహకాలు అందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆస్ట్రేలియన్ వైస్ కౌన్సిల్ శామ్యూల్ మేయర్స్, వర్సిటీ రెక్టార్ ఆచార్య పి.వరప్రసాద్ మూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య బి.కరుణ, ఓఎస్‌డీ ఆచార్య సునీత, సీడీసీ డీన్ ఆచార్య కె.మధుబాబు, వర్సిటీ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఆచార్య స్వరూప రాణి, ఆచార్య గంగాధరరావు, ఆచార్య పి.జాన్సన్, ఆచార్య సిద్దయ్య, ఆచార్య ప్రమీల రాణి, నూటా అధ్యక్షుడు డాక్టర్ బి.నాగరాజు, పీజీ, యూజీ పరీక్షల కో ఆర్డినేటర్లు ఆచార్య ఉదయ్ కుమార్, ఆచార్య సంధ్యకోలే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సెల్ డైరెక్టర్ ఆచార్య జి.చెన్నారెడ్డి పాల్గొన్నారు.