Skip to main content

ICAR: దేశీయ చదువు.. విదేశీ శిక్షణ

సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్‌ విద్యార్థులను ఆధునిక, సాంకేతిక నైపుణ్యం సాధించేలా కళాశాల ప్రోత్సహిస్తోంది.
ICAR
దేశీయ చదువు.. విదేశీ శిక్షణ

సాంకేతిక అంశాలపై శిక్షణ కోసం వారిని విదేశాల్లోని యూనివర్సిటీలకు పంపిస్తోంది. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తుండగా.. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రి కల్చరల్‌ రీసెర్చ్, ఢిల్లీ (ఐసీఏఆర్‌) ఆర్థిక సాయం అందజేస్తోంది. వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాలలో ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి వారిని శిక్షణకు ఎంపిక చేస్తోంది. బాపట్ల ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి ఇటీవల 8 మంది విద్యార్థులను ఐసీఏఆర్‌–ఐడీపీ ప్రోగ్రాం కింద శిక్షణ నిమిత్తం విదేశాలకు పంపింది. వారు రెండు నెలలపాటు శిక్షణ ముగించుకుని ఇటీవల కళాశాలకు చేరుకున్నారు. నాలుగేళ్లుగా ఏటా ఐడీపీ ప్రోగ్రాం కింద ఐసీఏఆర్‌ విద్యార్థులను ఎంపిక చేస్తోంది.  

చదవండి: వ్యవసాయ విద్య బలోపేతానికి సర్వే

నూతన విధానాలపై అధ్యయనం 

విదేశీ వర్సిటీల్లో శిక్షణ ఇప్పించటం ద్వారా విద్యార్థుల్లో ప్రతిభను పెంపొందించడం, ఆయా దేశాల్లోని వ్యవసాయ ఆధారిత వనరులపై అధ్యయనం చేయటం, వ్యవసాయానికి సంబంధించి అత్యాధునిక పరికరాలపై అక్కడి వారితో కలిసి పరిశోధనలు చేయటం లాంటి కార్యక్రమాల్లో మన విద్యార్థులు శిక్షణ పొందారు. యూఎస్‌ఏలోని కాన్సెస్‌ స్టేట్‌ యూనివర్సిటీకి ముగ్గురు విద్యార్థులు, ఫిన్లాండ్‌లోని టంపరే యూనివర్సిటీకి ఇద్దరు, యూనివర్సిటీ ఆఫ్‌ మలేషియాకు ముగ్గురు చొప్పున మొత్తం 8 మంది విద్యార్థులతోపాటు కళాశాల అధ్యాపకులు సైతం శిక్షణలో పాల్గొన్నారు. శిక్షణలో భాగంగా ఫుడ్‌గ్రెయిన్‌ ప్రాసెసింగ్, థాయ్‌లాండ్‌ వాటర్‌ కన్జర్వేషన్, ఫామ్‌ మెకనైజేషన్, డ్రోన్‌ ఆపరేటింగ్, చిరుధాన్యాల ప్రాసెసింగ్, యాంత్రీకరణ పరికరాలను ఉపయోగించే విధానం తదితర అంశాలపై విద్యార్థులు శిక్షణలో పాల్గొన్నారు. నాణ్యమైన బ్రెడ్, పిజ్జా లాంటి తినుబండరాలు తయారుచేయటం, కూరగాయలను భద్రపరిచే విధానం, గార్డెన్స్‌ రూపొందించడం తదితర వాటిపై శిక్షణ తీసుకున్నారు. అక్కడి పరిశ్రమలను పరిశీలించడంతోపాటు వ్యాపారులతో చర్చించినట్టు విద్యార్థులు తెలిపారు.  

చదవండి: ICAR-IIRR: ‘మెరుగైన సాంబమసూరి’ రకం వంగడం

శిక్షణ మంచి బాటలు వేసింది  
అమెరికాలోని కాన్సెస్‌ స్టేట్‌ యూనివర్సిటీకి శిక్షణ కోసం వెళ్లా. ఫుడ్‌గ్రెయిన్‌ ప్రాసెసింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. ఇలాంటి శిక్షణ తరగతులు మా భవిష్యత్‌కు ఎంతగానో ఉపయోగపడతాయి. 
– సాయిశ్రీ, వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థిని  
 
స్మార్ట్‌ అగ్రికల్చరల్‌ టెక్నాలజీపై శిక్షణ పొందా 
ఫిన్లాండ్‌లోని టంపరే యూనివర్సిటీలో స్మార్ట్‌ అగ్రికల్చరల్‌ టెక్నాలజీపై శిక్షణ తీసుకున్నాను. వ్యాపారులతో చర్చించి చాలా విషయాలను నేర్చుకున్నాం. డ్రోన్‌ టెక్నాలజీపై శిక్షణ తీసుకున్నాం.  
– సోఫియా, వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థిని 

చిరుధాన్యాల ప్రాసెసింగ్‌పై శిక్షణ  
అమెరికాలోని కాన్సెస్‌ స్టేట్‌ యూనివర్సిటీకి రెండు నెలల శిక్షణ కోసం వెళ్లా. చిరుధాన్యాల ప్రాసెసింగ్‌లో శిక్షణ తీసుకున్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేసిన మెషినరీపై అధ్యయనం చేశాం.  
– హర్షవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థి 
 
విదేశీ శిక్షణ ఎంతో ఉపయోగకరం  
8 మంది విద్యార్థులను శిక్షణ నిమిత్తం అమెరికా, మలేషియా, ఫిన్లాండ్‌లోని యూనివర్సిటీలకు పంపించా. వారు ఎంపిక చేసుకున్న సబ్జెక్టుల్లో అక్కడ శిక్షణ పొందారు. ఐసీఏఆర్‌ ద్వారా పొందిన ఐడీపీ శిక్షణ విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. 
– డానియల్‌రాజ్, ప్రిన్సిపాల్, వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల 

Published date : 29 Apr 2023 04:17PM

Photo Stories