Corporate Schools: కార్పొరేట్ బడులెప్పుడు? ప్రత్యక్ష తరగతులు పట్టని కార్పొరేట్ విద్యాసంస్థలు !!
అక్కడక్కడా కొన్ని బడ్జెటరీ స్కూళ్లు, కాలేజీలు తప్ప కార్పొరేట్ సంస్థల్లో తరగతులను నిర్వహించడం లేదు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు పనిచేస్తున్నా ప్రైవేటు సంస్థలు మాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం తమ విద్యార్థులకు ఆన్‌లైన్ లో పాఠాలు వినిపించి వాటినే తరగతులుగా చూపిస్తున్నాయి. కాలేజీలు, స్కూళ్లను తెరవకున్నా ఒక్కో విద్యార్థి వద్ద రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నాయి. సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో 16 వేల వరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలుండగా వాటిలో 29,61,689 మంది విద్యార్థులున్నారు. 2,500కు పైగా ఉన్న ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్, సెకండియర్ కలిపి 6 లక్షల మంది వరకు విద్యార్థులున్నారు. 90 శాతానికిపైగా సంస్థల్లో ఆన్లైన్ మంత్రాన్నే జపిస్తున్నారు. చాలా ప్రైవేటు యాజమాన్య పాఠశాలలను తెరవడం లేదు. కొన్నిచోట్ల తెరిచినా కొన్ని తరగతులకే పరిమితం చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు ఆమేరకు కూడా స్కూళ్లు తెరవడం లేదు. ఆన్లైన్ పాఠాలంటూ విద్యార్థులనుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని సంస్థల్లో మాత్రం ఆన్లైన్ లైవ్ పాఠాలను ప్రారంభించారు. కొన్ని కాలేజీలు తమ సిబ్బందితో కొన్ని పాఠాలను ముందుగా రికార్డు చేయించి వాటినే విద్యార్థులకు వాట్సప్, ఇతర మార్గాల్లో పంపి చూసి చదువుకోండని చెబుతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర పరికరాలున్న వారు పాఠాలను వినగలుగుతున్నా.. శారీరక, మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు. చాలామంది విద్యార్థులు తరగతులు లేక, ఆన్‌లైన్ లో వినే అవకాశాల్లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఫీజులు చెల్లిస్తేనే టీసీలు
కరోనా సమయంలో ఆన్లైన్ పాఠాలు కూడా లేకపోవడంతో పలువురు విద్యార్థులు ఆయా సంస్థల్లో మానేసి వేరే సంస్థల్లో చేరాలనుకున్నా ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు ససేమిరా అంటున్నాయి. తమకు పూర్తి ఫీజు చెల్లిస్తేనే టీసీలు ఇస్తామని చెబుతున్నాయి. అసలు స్కూళ్లు లేక, పాఠాలు లేనప్పుడు ఫీజులు ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నాయి.
వేతనాలకు ఎగనామం.. ఉద్యోగాలు తీసివేత
కరోనా సమయంలో కాలేజీల్లో తరగతుల నిర్వహణ ఆగిపోవడంతో పలు ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు సిబ్బందికి వేతనాలు ఇవ్వకుండా ఎగ్గొట్టాయి. వేతనాల గురించి ఒత్తిడి చేసిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఇప్పుడు ఆఫ్‌లైన్ తరగతుల నిర్వహణకు తగిన సిబ్బంది లేకపోవడంతో పలుసంస్థలు స్కూళ్లు తెరవకుండా కాలక్షేపం చేస్తున్నాయి. తొలగించిన సిబ్బందిని తిరిగి పిలిచినా వారు రావడానికి విముఖత చూపుతున్నారు. ఫలితంగా ఆయా సంస్థల్లో నిపుణులైన, అర్హతలు కలిగిన సిబ్బంది లేరు. దీంతో ఎలాంటి సామర్థ్యాలు లేనివారితోనే ఆయా సంస్థలు ఆన్లైన్ అంటూ నెట్టుకొస్తున్నాయి. ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహిస్తే సిబ్బంది జీతభత్యాలతోపాటు నిర్వహణ ఖర్చులు కూడా ఉంటాయి. ఆన్లైన్ అయితే పెద్దగా జీతాలు చెల్లించాల్సిన అవసరం, నిర్వహణ ఖర్చులు లేకపోవడంతో ఎక్కువ సంస్థలు ప్రత్యక్ష తరగతులకు మొగ్గుచూపడం లేదు. ఫీజులు మాత్రం యథాతథంగానే వసూలు చేస్తున్నాయి. విద్యార్థులకు తమ పుస్తకాలు, ఇతర మెటీరియల్‌ను బలవంతంగా అంటగడుతున్నాయి.
కరోనాలో అద్దెభవనాలు ఖాళీచేసిన సంస్థలు
ప్రత్యక్ష తరగతులను నిర్వహించడానికి కోవిడ్ ప్రొటోకాల్ నిబంధనలు పాటించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. తరగతికి 20 మందికి మించకుండా ఉండాలని స్పష్టం చేసింది. పలు ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు తమ విద్యాసంస్థలను అద్దె భవనాల్లో కొనసాగిస్తూ వస్తున్నాయి. కరోనా కారణంగా వాటికి అద్దెలు చెల్లించక ఖాళీ చేశాయి ఇప్పుడు ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు మళ్లీ ఆయా భవనాలను తీసుకోవాల్సి ఉంది. గతంలో అద్దె భవనాల్లో లెక్కకు మించి విద్యార్థులు కూర్చోబెట్టేవి. ఇప్పుడు కోవిడ్ నిబంధనలు పాటించాల్సి రావడంతో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు స్వస్తి చెబుతున్నాయి.
ర్యాంకుల కోసం పరిమిత సంఖ్యలో విద్యార్థులకు పాఠాలు
కొన్ని కార్పొరేట్ సంస్థలు తమ స్కూళ్లు, కాలేజీల్లో మెరిట్ విద్యార్థుల వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నాయి. జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో ర్యాంకుల కోసం మెరిట్ విద్యార్థులను పరిమిత సంఖ్యలో రప్పించి ప్రత్యేక సిబ్బందితో పాఠాలు చెప్పిస్తున్నాయి. కేవలం ర్యాంకులు వచ్చాయని ప్రచారం చేసుకునే వ్యాపార దృక్పథంతోనే అవి వ్యవహరిస్తున్నాయి.
వేతనాలకు ఎగనామం.. ఉద్యోగాలు తీసివేత
కరోనా సమయంలో కాలేజీల్లో తరగతుల నిర్వహణ ఆగిపోవడంతో పలు ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు సిబ్బందికి వేతనాలు ఇవ్వకుండా ఎగ్గొట్టాయి. వేతనాల గురించి ఒత్తిడి చేసిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఇప్పుడు ఆఫ్‌లైన్ తరగతుల నిర్వహణకు తగిన సిబ్బంది లేకపోవడంతో పలుసంస్థలు స్కూళ్లు తెరవకుండా కాలక్షేపం చేస్తున్నాయి. తొలగించిన సిబ్బందిని తిరిగి పిలిచినా వారు రావడానికి విముఖత చూపుతున్నారు. ఫలితంగా ఆయా సంస్థల్లో నిపుణులైన, అర్హతలు కలిగిన సిబ్బంది లేరు. దీంతో ఎలాంటి సామర్థ్యాలు లేనివారితోనే ఆయా సంస్థలు ఆన్లైన్ అంటూ నెట్టుకొస్తున్నాయి. ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహిస్తే సిబ్బంది జీతభత్యాలతోపాటు నిర్వహణ ఖర్చులు ఉంటాయి. ఆన్లైన్ అయితే పెద్దగా జీతాలు చెల్లించాల్సిన అవసరం, నిర్వహణ ఖర్చులు లేక ఎక్కువ సంస్థలు ప్రత్యక్ష తరగతులకు మొగ్గుచూపడం లేదు. ఫీజులు యథాతథంగానే వసూలు చేస్తున్నాయి. విద్యార్థులకు తమ పుస్తకాలు, ఇతర మెటీరియల్‌ను బలవంతంగా అంటగడుతున్నాయి.