Skip to main content

To Change In Acadamic Exams Pattern: ఆరు నెలల్లో పరీక్షల్లో మార్పులు ... ? ఐఎస్‌బీ అధ్యయనం మొదలు

సాక్షి, ఎడ్యుకేషన్‌: ఉన్నత విద్యలో పరీక్షల విధానాన్ని, మూల్యాంకన పద్ధతిని సమూలంగా మార్చబోతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలులోకి తెచ్చేందుకు యత్నాలు జరుగుతున్నాయి.
Students

ఉన్నత విద్యామండలి ఇప్పటికే ఈ దిశగా అధ్యయనానికి ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)కి బాధ్యతలు అప్పగించింది.  విశ్వవిద్యాలయాల పరీక్షల విభాగం కంట్రోలర్స్‌ ఇప్పటి వరకూ జరుగుతున్న పరీక్షలకు సంబంధించిన డేటాను ఐఎస్‌బీకి అందజేయనుంది.
ప్రభుత్వ ఆమోదం తెలిపిన తర్వాత అమలులోకి...
ఐఎస్‌బీ బృందాలు దాదాపు వంద కాలేజీల నుంచి స­మగ్ర సమాచారం సేకరించనున్నాయి. వివిధ దేశాలు, రాష్ట్రా­ల్లో ఉన్న పరీక్షల విధానంపై స్టడీ చేస్తాయి. వీట­న్నింటినీ పరిగణనలోనికి తీసుకుని తెలంగాణ ఉన్నత విద్య కోర్సుల్లో అనుసరించాల్సిన సరికొత్త పరీక్షల ప్రక్రియపై ఐఎస్‌బీ నివేదిక ఇస్తుంది. ప్రభుత్వ ఆమోదం తర్వాత దీన్ని అమలులోకి తెస్తామని ఉన్నత విద్య మండలి చెబుతోంది. 
విభిన్న తరహా విశ్లేషణ...
డిగ్రీ, ఇంజనీరింగ్‌ సహా ఉన్నత విద్య పరిధిలోని అన్ని కోర్సుల్లో పరీక్షల విధానం ఎలా ఉంది? మార్కులు వేసే పద్ధతి ఏంటి? ఏ తరహా విద్యార్థికి ఎన్ని మార్కులొస్తున్నాయి? ఉన్నత విద్య తర్వాత విద్యార్థికి లభించే ఉపాధి ఏమిటి? అసలు విద్యార్థులు ఏం ఆశిస్తున్నారు? పరీక్షలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఈ తరహా డేటాను పరీక్షల విభాగం కంట్రోలర్స్‌ ఇప్పటికే సేకరించారు. వీటినే ఐఎస్‌బీ ప్రామాణికంగా తీసుకుంటుంది. 
మార్కులున్నా... నైపుణ్యం ఉండడం లేదు
ఉన్నత విద్యలో అత్యధిక మార్కులు పొందినప్పటికీ, మార్కెట్‌ అవసరాలకు తగ్గట్టు వారిలో నైపుణ్యం ఉండటం లేదని అఖిల భారత సాంకేతిక విద్య మండలి అధ్యయనంలో వెల్లడైంది. కేవలం మార్కుల కోణంలోనే మూల్యాంకన విధానం ఉందని, విద్యార్థి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసే తరహా అవసరమని భావించింది. వేగంగా విస్తరిస్తున్న బహుళజాతి సంస్థల్లో చేరేందుకు ఈ విధానం అవరోధంగా ఉందని గుర్తించారు. డిగ్రీ చేతికొచ్చిన విద్యార్థి ఉద్యోగ వేటలో ఎదురయ్యే పరీక్షల తంతును అందిపుచ్చుకునే తరహాలో శిక్షణ, పరీక్షలు, బోధన విధానం ఉండాలన్నదే సంస్కరణల ప్రధానోద్దేశ్యమని మండలి చైర్మన్ లింబాద్రి చెబుతున్నారు. ఈ కోణంలోనే ఐఎస్‌బీ చేత అధ్యయనం చేయిస్తున్నారు.

Published date : 12 Dec 2022 07:29PM

Photo Stories