Andhra Pradesh: కేజీబీవీ విద్యార్థినులకు బంకర్ బెడ్లు
రాష్ట్రంలోని 352 కేజీబీవీల్లో ఆరు నుంచి ఇంటర్మిడియెట్ వరకు చదువుతున్న 98,560 మంది విద్యార్థినులకు మంచాలు అందించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. విద్యార్థినులకు అన్ని రకాలుగా అనువుగా ఉండేలా స్టోరేజీ బాక్స్‌తో ఉండే రెండు లేదా మూండంచెల బంకర్ బెడ్లను అందించాలన్నారు. వీటిని డిసెంబర్ నెలాఖరుకు ఆయా పాఠశాలలకు అందించాలని యోచిస్తున్నారు. దీంతో 98,560 మంది విద్యార్థినులకు మేలు కలగనుంది.
కేజీబీవీలకు గత టీడీపీ ప్రభుత్వం 2018లో మందపాటి బొంతలను మాత్రమే ఇచ్చింది. ఈ క్రమంలో విద్యార్థినులకు అందుతున్న వసతులపై సమగ్ర శిక్ష, కేజీబీవీ అధికారులు ఆరా తీశారు. ఇటీవల జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ డిసెంబర్‌లోగా మంచాలు అందించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
ఇప్పటికే కేజీబీవీల్లో చదువుతున్న బాలికల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వారికి ప్రతి నెలా హిమోగ్లోబిన్ పరీక్షలు చేసి, అవసరమైనవారికి మాత్రలు అందజేసింది. ఆ పరీక్షల రిపోర్టును రికార్డు చేసేందుకు ‘హెచ్‌బీ పర్సంటేజ్’ కార్డులను సైతం ఆయా స్కూళ్లకు అందించింది.
చదవండి: KGBV Schools: కేజీబీవీ బాలికలకు ముఖ్యమంత్రి భరోసా
చదువుకునేందుకు కూడా ఉపయోగపడేలా..
ఏపీలో 2004–05 విద్యా సంవత్సరంలో కేజీబీవీలను అందుబాటులోకి తెచ్చారు. తొలుత 6 నుంచి 8వ తరగతి వరకు ప్రారంభించారు. అనంతరం ఇంటర్మిడియెట్ వరకు పెంచారు. ప్రస్తుతం ఈ విద్యాలయాల్లో 98,560 మంది విద్యార్థినులు చదువుతున్నారు. వీరికి గత ప్రభుత్వం బొంతలు మాత్రమే అందించడంతో నేలపై పడుకోవాలి్సన దుస్థితి తలెత్తింది.
పేదింటి ఆడపిల్లలు చదువుకునే విద్యాలయాల్లో వారికి మంచాలు అందించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థినులు పడుకునేలా, వాటిపై కూర్చుని చదువుకునేందుకు అనువైన ఎత్తు ఉండేలా బంకర్ బెడ్లను తయారు చేయిస్తున్నారు. ఒకదానిపై ఒకటి ఉండి ఇనుముతో చేసిన బంకర్ బెడ్లు అడుగున విద్యార్థినుల పుస్తకాలు, ఇతర సామగ్రి దాచుకునేందుకు వీలుగా స్టోరేజీ బాక్స్‌లను సైతం బిగించనున్నారు.