Skip to main content

Prof. TV Kattimani: NEP అమలులో అగ్రస్థానంలో ఏపీ

విశాఖ విద్య: జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) అమలులో ఆంధ్రప్రదేశ్‌.. దేశంలోనే అగ్రస్థానంలో ఉందని కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం వైస్‌ చాన్సలర్‌ టీవీ కట్టిమని అన్నారు.
AP is at the top in implementation of NEP
మాట్లాడుతున్న కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ వీసీ కట్టిమని

విశాఖపట్నంలో జూలై 26న‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ(శ్రీకాకుళం) వీసీ నిమ్మ వెంకటరావు, జేఎన్‌టీయూ(విజయనగరం) వీసీ బి.వెంకట సుబ్బయ్య, ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ వి.కృష్ణమోహన్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం ఎనర్జీ డైరెక్టర్‌ శాలివాహన్, ఐఐఎం ప్రతినిధి ఆచార్య షమీమ్‌ జావేద్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

జాతీయ స్థాయిలో పాలసీలు తీసుకువచ్చేది కేంద్ర ప్రభుత్వమే అయినప్పటికీ.. భవిష్యత్‌ తరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని విజయవంతంగా అమలు చేసేది రాష్ట్ర ప్రభుత్వాలే అని చెప్పారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆ దిశగా ముందుకు అడుగులు వేస్తోందన్నారు.

చదవండి: విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంపొందించాలి

జాతీయ విద్యా విధానం వల్ల విద్యార్థులు తమ అభిరుచి మేరకు కోర్సులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లభించిందన్నారు. యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేలా చదువులు సాగుతున్నాయని వివరించారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకు కేటాయించడం, విద్యాలయాలను పరిశ్రమలకు అనుసంధానం చేయడం వంటి చర్యలు విద్యార్థులకు భరోసాగా నిలుస్తున్నాయని చెప్పారు.

ఉన్నత విద్యకు పాఠశాల స్థాయిలోనే పటిష్ట పునాది వేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. ఉద్యోగ అవకాశాలు లక్ష్యంగా బోధన సాగుతోందన్నారు. గిరిజన యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం 561 ఎకరాల భూమి కేటాయించిందని.. మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణాలు పూర్తి చేసిన అనంతరం నూతన క్యాంపస్‌కు వెళ్తామని వీసీ కట్టిమని తెలిపారు. అనంతరం జాతీయ విద్యావిధానం ప్రయోజనాలపై గిరిజన వర్సిటీ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

చదవండి: SKU University: కరువు సీమలో చదువుల సిరులు

Published date : 27 Jul 2023 02:10PM

Photo Stories