విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంపొందించాలి
హనుమకొండ జిల్లాలోని ఉర్దూ మీడియం పాఠశాలల టీచర్లకు పెట్రోల్ పంపు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండ్రోజుల నుంచి తొలిమెట్టు అమలుపై శిక్షణ ఇస్తున్నారు. మంగళవారం శిఽక్షణ కార్యక్రమాన్ని అబ్దుల్‌హై తనిఖీ చేసి మాట్లాడుతూ.. పీరియడ్ ప్లాన్ హ్యాండ్‌బుక్స్, పాఠ్యపుస్తకం, వర్క్‌బుక్ ఉపయోగించుకుని ఉపాధ్యాయులు నూతన పద్ధతిలో బోధించాలన్నారు. తొలిమెట్టును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్, కమ్యునిటీ మొబలైజింగ్ కో– ఆర్డినేటర్ బి.రాధ, కోర్సు డైరెక్టర్, హెచ్‌ఎం పద్మావతి, రిసోర్స్‌పర్సన్లు అమీనా అక్తర్, సయ్యద్ మున్వర్ హుస్సేన్, అయేషా పర్వీన్, మహ్మద్‌నెహాన్ తదితరులు పాల్గొన్నారు.
టీటీసీ శిక్షణ పొందిన అభ్యర్థులకు పరీక్షలు
హనుమకొండ జిల్లాలో 43 రోజులపాటు టీటీసీ టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (లోయర్ గ్రేడ్) థియరీ పరీక్షలు నిర్వహించేందుకు టైంటేబుల్ విడుదల చేసినట్లు హనుమకొండ డీఈఓ ఎండీ అబ్దుల్‌హై మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఆయా పరీక్షల్లో ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా ఈ టీటీసీ పరీక్షలకు హాజరు కావొచ్చని తెలిపారు. ఆగస్టు 12 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఆగస్టు 12న ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అదే రోజు మెథడ్స్ ఆఫ్ టీచింగ్ (జనరల్ ) సబ్జెక్ట్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 3గంటల వరకు, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ (స్పెషల్) సబ్జెక్టు మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ అబ్దుల్‌హై తెలిపారు.
నేటి నుంచి శాలసిద్ధిపై శిక్షణ
హనుమకొండ జిల్లాలో ఎంపిక చేసిన 31 పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఈనెల 26, 27 తేదీల్లో రెండ్రోజులు హసన్‌పర్తి మండలం మిలీనియం పాఠశాలలో శాల సిద్ధి (ప్రమాణాలు, స్వీయ మూల్యాంకణ కార్యక్రమం)పై శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈఓ ఎండీ అబ్దుల్‌హై తెలిపారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా 11 ఉన్నత పాఠశాలలు, ఐదు ప్రాథమికోన్నత పాఠశాలలను, 15 ప్రాథమిక పాఠశాలలను శాలసిద్ధికి ఎంపిక చేశారు. హైస్కూళ్లనుంచి ఒక హెచ్‌ఎం, ఇద్దరు టీచర్లు, యూపీఎస్ నుంచి ఒక హెచ్‌ఎం, మరో టీచర్, ప్రాథమిక పాఠశాలల నుంచి ఒక హెచ్‌ఎం, ఒక టీచర్ చొప్పున ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు శిఽక్షణ ఇవ్వనున్నారు. ఎంపిక చేసిన పాఠశాలలకు ఇప్పటికే సంబంధిత క్లస్టర్ రిసోర్స్‌పర్సన్లు, మండల రిసోర్స్ సెంటర్ల ద్వారా సమాచారం అందించారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత రిసోర్స్ పర్సన్లు శిక్షణ ఇవ్వనున్నారు.
నేడు, రేపు సెలవులు
వర్షాల కారణంగా బుధ, గురువారం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారులు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈఓ ఎండీ అబ్దుల్‌హై తెలిపారు. హనుమకొండ జిల్లాలో టీచర్లకు తొలిమెట్టు శిక్షణా కార్యక్రమాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని, ఎంపికై న ఉపాధ్యాయులు ఈశిక్షణకు హాజరుకావాలన్నారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలాయలు, యూఆర్‌ఎస్‌లలో బోధనా సిబ్బందికి సంబంధించి నియామకాల పరీక్షలు బుధవారం యథావిధిగా ఉంటాయని ఆయా అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని డీఈఓ తెలిపారు.